రాష్ట్రం ఏర్పడిన వెంటనే కృష్ణ జలాల సమస్యను అప్పటి మంత్రి ఉమాభారతితో చర్చించాం
గడిచిన ఏడేళ్లలో కేంద్రం ఒక్కసారైనా స్పందించి తగు
నిర్ణయం తీసుకోలేదు, మాకు కావాల్సింది కృష్ణ జలాల్లో
న్యాయమైన వాటా మాత్రమే : సిద్దిపేట మీడియా
సమావేశంలో మంత్రి హరీశ్‌రావు స్పష్టీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్, సిద్దిపేట : కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసమే తెలంగాణ ప్రభుత్వం పోరాటం చేస్తోందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. అంతే తప్ప కేంద్రంతో తమకు ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదన్నారు. రాష్ట్రప్రభుత్వ ఆవేదనంతా నీళ్లు, నిధులు, నియామకాలు కోసమేనని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతున్నా…ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. ప్రధానంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కావాలన్నదే తమ అభిమతమని ఆయన స్పష్టం చేశారు. ఇది నాలు గు నెలల పంచాయతీ కాదని, ఏడేళ్లుగా పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. శుక్రవారం సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్ర షెకావత్ రెండు రోజుల క్రితం సిఎం కెసిఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కేం ద్రం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలపై టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను అర్థం చేసుకోవాలన్నారు. ఏడేళ్లుగా సమస్య పరిష్కారం కాలేదనేది వాస్తవమా కదా? అని ప్రశ్నించారు.
నీళ్లలో న్యాయమైన వాటాకావాలని రాష్ట్ర ప్రభు త్వం అడుగుతోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర వివాదాల చట్టం (ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్) ప్రకారం జల వివాదాలపై ఒక రాష్ట్రం ఫిర్యాదు చేస్తే దాన్ని ఏడాదిలోగా పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. లేదా ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాల్సి ఉం టుందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. కేంద్రం చేస్తున్న జాప్యాన్నే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తప్పుపట్టారన్నారు. ఈ విషయంలో కేంద్రం కూడా తమ (రాష్ట్ర ప్రభుత్వ) ఆవేదనను అర్ధం చేసుకోవాలని గజేంద్ర షెకావత్‌కు మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆయనపై తమకు అపార గౌరవం ఉందన్నారు. షెకావత్ చిత్తశుద్ధిని తాము శంకించడం లేదన్నారు.
కృష్ణా నదీ జల వివాదాలపై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 42వ రోజే అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతితో చర్చించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. ప్రస్తుతం నవంబర్..2021లో ఉన్నామన్నారు. గడిచిన ఈ ఏడేళ్లలో కేంద్రం ఒకసారైనా స్పందించి తగునిర్ణయం తీసుకుని ఉంటే ఇప్పుడు…. ఇలాంటి సమస్యలు వచ్చేవి కావన్నారు. సిఎం కెసిఆర్‌తో పాటు తాను జలవనరుల శాఖ మంత్రిగా కొనసాగిన సమయంలో రాష్ట్ర అధికారులు ఏడాది పాటు తిరిగినా కేంద్రం స్పందించ లేదన్నారు. ఫిర్యాదు చేసిన 13 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం గడప తొకాల్సి వచ్చిందని హరీశ్‌రావు వివరించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కానీ కేంద్రంపై ఉన్న గౌరవంతో ఢిల్లీ పెద్దలు విజ్ఞప్తి చేయడంతో మళ్లీ కేసు ఉపసంహరించుకున్నామన్నారు. అందువల్ల కేంద్రం నీటి వాటాలపై ఇప్పటికైనా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలన్నారు. తక్షణమే బ్రిజేషకుమార్ ట్రిబ్యునల్‌కు లేదా? కొత్త ట్రిబ్యునల్ అయినా వేయాలని కోరుతున్నామన్నారు. అక్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెన్నా బేసిన్‌కు నీటిని తీసుకోతున్నదని, కాని బేసిన్‌లో ఉన్న తమకు న్యాయమైన వాటా రావడం లేదన్నారు.
సిఎం వ్యాఖ్యలను కేంద్రమంత్రి వ్యక్తిగతంగా తీసుకున్నారు
కేంద్రంపై సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను గజేంద్ర షెకావత్ వ్యక్తిగతంగా తీసుకున్నట్లుందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. నీళ్ల వాటాను ఎటు తేల్చకుండా కేంద్రం ఏడేళ్లుగా నాన్చడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అయినా కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటే సుప్రీంకోర్టులోని కేసు ఒక అడ్డంకి కాదు కదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయం తీసుకుని ఉంటే కోర్టులో కేసు కూడా వీగిపోయి ఉండేదన్నారు. ఇప్పటికైనా కృష్ణాజలాల పంచాయితీని వెంటనే ట్రిబ్యునల్‌కు అప్పగించాలన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ నిజాయితీ, సిఎం కెసిఆర్ కమిట్ మెంట్‌ను గుర్తించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో సమస్యలు విలయతాండవం చేస్తున్నప్పటికీ సిఎం కెసిఆర్ నీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అందువల్లే రాష్ట్రం ఏర్పడిన కేవలం 42వ రోజునే స్వయంగా ఉమాభారతిని కలిసి ఫిర్యాదు చేశామంటే రాష్ట్ర ప్రభుత్వ తాపత్రయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. తాను నీళ్ల శాఖ మంత్రిగా కేంద్రంలోని ప్రతి అధికారివద్దకు సంవత్సరం పాటు తిరిగానని అన్నారు. కేంద్రాన్ని చట్ట విరుద్ధమైన గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. నదీ జలాల్లో రాజ్యాంగబద్ధమైన, న్యాయమైన వాటా కోరుతున్నామని స్పష్టం చేశారు.