హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో మైనారిటీల కోసం ప్రవేశ పెట్టిన రూ. లక్ష ఆర్థిక సహాయ పథకాన్ని ఈ నెల 19న ప్రారంభించబోతున్నట్లు మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ పథకం అమలు చేయబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19న ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటు ఆయన పేర్కొన్నారు.
కాగా ఈ పథకం కింద తొలి విడతలో 10 వేల మందికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించబోతున్నారు. ఇప్పటికే జిల్లాల వారిగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావస్తోంది. మైనారిటీ సబ్సిడీ రుణాల కోసం గతంలో విద్యావంతులైన నిరుద్యోగ మైనారిటీల నుండి మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ దరఖాస్తుల నుంచే లబ్దిదారుల ఎంపిక జరిగింది. క్రైస్తవ మైనారిటీల నుండి మాత్రం దరఖాస్తులను ఆహ్వానించారు.