Thursday, January 23, 2025

ముంగిట్లోకి పాలన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్ర తిష్ఠాత్మకంగా భావిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.ప్రభుత్వ మే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందు కు యత్నిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందు కు కృషి చేస్తోందని తెలిపారు. గురువారం (డిసెంబర్ 28) నుంచి ఐదు పథకాలకు (మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి. ఇందిరమ్మ ఇళ్లు, చేయూత) సం బంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. డిసెంబర్ 28 నుంచి జవవరి 7 వరకు ఎనిమిది పనిదినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉం టుందని చెప్పారు. ఈ తేదీల్లో గ్రామసభ లు ముగిసిన తరువాత కూడా దరఖాస్తు చేసుకోలేని అర్హులైన లబ్ధ్దిదారులు తమ ద రఖాస్తులు సమర్పించవచ్చని అన్నారు. గడువు  తరువాత దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గడువులోగా దరఖాస్తులు సమర్పించలేకపోయామని ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. జనవరి 7 తర్వాత కూడా గ్రామపంచాయతీ కార్యాలయాలు, ఎంపిడిఒ, ఎంఆర్‌ఒ కార్యాలయాల్లో అభయ హస్తం కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.

ఈ ప్రభుత్వం ప్రజలది అని..ప్రజల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. దరఖాస్తులు సమర్పించేందుకు మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో పథకం అమలు అవుతోందని చెప్పారు. జనవరి 7లోపు లబ్దిదారుల వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నామని, అర్హులైన లబ్దిదారులందరకీ సంక్షేమ పథకాలు అందించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ప్రతి మండలానికి తహసీల్దార్ బాధ్యత వహిస్తారని, ప్రతిరోజు అధికారి రోజూ రెండు గ్రామాలను సందర్శిస్తారని అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో బుధవారం ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారాలను సిఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. సిఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, సిఎస్ శాంతికుమారిలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని అన్నారు.

గతంలో గడీల మధ్య పాలన.. ఇప్పుడు ప్రజల వద్దకే ప్రభుత్వం
గత పదేళ్లలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదని, ప్రజావాణిలో వచ్చిన 24 వేల ఫిర్యాదులే అందుకు ఉదాహరణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు మోయలేని భారాన్ని గత పదేళ్లలో మోసారని అన్నారు. ఒకప్పుడు ప్రజలకు సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరకు వస్తే గడీలు అడ్డుగోడలుగా ఉండేవని, కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల వద్దకు నడిచి వెళ్తోందని చెప్పారు. ప్రజా పాలనలో ప్రజలకు తమ ప్రభుత్వంపై మరింత విశ్వాసం కలుగుతుందని తెలిపారు. ఒకప్పుడు సచివాలయం అంటే ఏదో తెలియదని, సచివాలయం లోపల మీడియా సమావేశం ఉంటుందని ఎవరైనా ఊహించారా అని అడిగారు. ఇక మీదట సెక్రటేరియెట్‌లో మీడియా సెంటర్ ఉంటుందని సిఎం వెల్లడించారు. మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. నిస్సహాయులకు సహాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తండాలు, గూడాలలో ఉన్న అత్యంత నిరుపేదలకు పథకాలు అందించేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

దూరప్రాంతాల నుంచి సచివాలయానికి, ప్రజాభవన్‌కు వచ్చి దరఖాస్తులు ఇవ్వడం కష్టమైన పని అని, ఎవరూ హైదరాబాద్ రావాల్సిన పని లేకుండా గ్రామాల్లోనే లబ్దిదారుల ఎంపిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజల్ని ప్రభుత్వం దగ్గరకు రప్పించకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళుతోందని తెలిపారు. గ్రామ సభల్లో సర్పంచులు, ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు, మంత్రలు, ఎంఎల్‌ఎలు ఉంటారని, ప్రజల వద్దకే వెళ్లి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమానికి రప్పించడం కాకుండా ప్రజల వద్దకే వెళ్లి గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామసభల దరఖాస్తుతో వివరాలు తమకు అందుతాయని, ఆ దరఖాస్తులను ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయగలుగుతం అనేది తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి మండలం రెండు గ్రూపులు ఉంటాయని, ఒక గ్రూప్‌కు ఎండిఒ, మరో గ్రూప్‌కు ఎమ్మార్వో బాధ్యత వహిస్తారని చెప్పారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో అధికారులు గ్రామసభలకు హాజరవుతారని చెప్పారు. ప్రభుత్వం, అధికారులకు దగ్గరైనప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని వ్యాఖ్యానించారు. గ్రామసభల్లో దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయని, అర్హులైన ప్రతీ ఒక్కరికి గ్యారంటీలను అందిస్తామని వెల్లడించారు. మారుమూల పల్లెకూ సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

రేషన్‌కార్డులు ఉంటేనే సంక్షేమ పథకాలు
రేషన్‌కార్డులు ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అర్హులైన వారికి త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని వెల్లడించారు. అభయహస్తం దరఖాస్తు చేసుకునే వారికి రేషన్ కార్డు లేకపోయినా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కెటిఆర్ లక్ష కోట్ల అవినీతి డబ్బులో ఓ మహిళకు రూ.లక్ష ఇచ్చారు
కెటిఆర్ లక్ష కోట్ల సంపాదన నుంచి ఓ బాధిత మహిళకు లక్ష రూపాయలు ఇచ్చారని, మిగతా సొమ్ము అంతా కక్కిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాలేదని ఓ మహిళ మాజీ మంత్రి కెసిఆర్‌ను కలిసినట్లు పత్రికల్లో చూశారని, బాధిత మహిళకు కెటిఆర్ లక్ష సాయం అందించారని తెలిసిందని అన్నారు. కెటిఆర్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయల్లో బాధితురాలికి లక్ష ఇచ్చారని, ప్రజావాణి కార్యక్రమం ద్వారా కెటిఆర్ తన లక్ష కోట్ల దోపిడీలో లక్ష రూపాయలు సహాయం చేసేలా చేశామని అన్నారు. అధికారంలో ఉండగా కెటిఆర్ అక్రమంగా లక్ష కోట్ల రూపాయలను సంపాదించారని, అందులో లక్ష రూపాయలు కక్కించామని చెప్పారు. లక్ష కోట్ల అవినీతి డబ్బులో లక్ష రుపాయలు చెల్లించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కెటిఆర్ వద్ద మిగిలిన 99వేల 999కోట్ల రుపాయల 99లక్షల రూపాయలను కూడా పేదలకు పంచాల్సి ఉందని, ఆ పరిస్థితులు కూడా వస్తాయని అన్నారు.

ప్రజల రక్తమాంసాలతో రూ.లక్ష కోట్లు సంపాదించారు
పదేళ్లపాటు కెటిఆర్, హరీశ్ రావులు తిన్నది ప్రజల రక్తం కూడు అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల రక్తమాంసాలతో రూ.లక్ష కోట్లు సంపాదించారని మండిపడ్డారు. ఉపయోగపడే భవనాలను కూల్చి కొత్తవి కట్టారు… అది ఆస్తి సృష్టించడం అని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడిన సచివాలయాన్ని కూల్చి కొత్త భవనం కట్టారని సిఎం ఉదహరించారు. అసెంబ్లీలో కూడా బావాబావమరుదులు తప్ప మిగతా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. అసెంబ్లీలో చెప్పుకోవడానికి వారికి ఏ అంశమూ లేదని, అందుకే బయట చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
కెసిఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్లు కొని విజయవాడలో దాచారు.

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో అనవసరపు ఖర్చులతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మూడో సారి గెలిస్తే తిరిగేందుకు కొత్తగా 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొని విజయవాడలో దాచుకున్నారని ఆరోపించారు. ఒక్కో ల్యాండ్ క్రూయిజర్ కారు ధర రూ. 3 కోట్లు ఉంటుందని, వాటికి బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం అమర్చాలంటే ఖర్చులు అదనమని చెప్పారు. తాను మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుతాననే నమ్మకంతో కెసిఆర్ ముందుగానే కొత్త వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. మూడోసారి ముఖ్యమంత్రిగా అధికారగణంతో దర్పం ప్రదర్శించడానికి ప్రజాధనాన్ని వృథా చేశారని రేవంత్‌రెడ్డి కెసిఆర్‌పై ధ్వజమెత్తారు. తాము అధికారం చేపట్టిన కొన్ని రోజుల తర్వాత అధికారుల ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారని అన్నారు.

కెసిఆర్ నెత్తిమీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయిండు అని సదరు అధికారి తనతో చెప్పాడని తెలిపారు. ఇలాంటివి కెసిఆర్ సృష్టించిన సంపద అని విమర్శించారు. 22 కొత్త ల్యాండ్ క్రూజర్ల వాహనాలు ప్రభుత్వ ఆస్తి.. తప్పనిసరిగా వాటిని తీసుకుంటామని స్పష్టం చేశారు. కాన్వాయ్ కోసం తాను కొత్త బండ్లు కొనను.. ఖర్చు పెట్టను అని ముందుగానే అధికారులకు చెప్పానని, పాతబండ్లనే రిపేర్ చేసి, అడ్జెస్ట్ చేసి ఇవ్వండి అని అధికారులకు చెప్పానని గుర్తు చేశారు.అసలు ఇన్ని వందల వాహనాలు ఉన్నప్పుడు కొత్తవి అవసరమా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తే పథకాలకు ఉపయోగపడుతుందని, ఆ దిశగా తాము పనిచేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

గత ప్రభుత్వం అప్పులు చేసి నిండా ముంచింది
గత ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశామని, రూ. 6.71లక్షల కోట్లు అప్పులు చేసి నిండా ముంచారని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పరిస్థితుల నుంచి తేరుకుని ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబడతామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చూస్తే.. ఖాళీ కుండలే ఉన్నాయని వ్యాఖ్యానించారు. కెసిఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఊడ్చుకుని వెళ్లిందని ఆరోపించారు. లంకె బిందెలు అని వస్తే.. ఖాళీ గిన్నెలు కనిపిస్తున్నాయని సిఎం వ్యాఖ్యానించారు. ఇప్పుడు అంతా సెట్ రైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే తాము ప్రధాని నరేంద్ర మోడీని కలిసి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని వినతిపత్రం అందజేశామని అన్నారు.అంతేగానీ తాము కేసుల మాఫీ కోసం ఎవరినీ కలవలేదని చెప్పారు. ఐటీఐఆర్ వెనక్కి వెళ్లినా, రాష్ట్రానికి సైనిక్ స్కూల్ వచ్చి వెనక్కి వెళ్లినా అడగని వినోద్ కుమార్ బుల్లెట్ ట్రైన్ గురించి తమకు నీతులు చెబుతారా…? అని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

మేడిగడ్డపై న్యాయ విచారణ జరుగుతోంది
మేడిగడ్డకు సంబంధించి న్యాయ విచారణ జరుగుతోందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విచారణ తర్వాత ఎల్ అండ్ టి కంపెనీ, అధికారుల పాత్ర ఏమిటనేది తేలుతుందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైందని తెలిపారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలుతో ఆటో డ్రైవర్ల పరిస్థితిని ముందే ఊహించామని, అందుకే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారని చెప్పారు. తాము చెప్పిన విధంగా ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News