Monday, January 20, 2025

పోలవరం బ్యాక్ వాటర్ ముంపు సర్వేపై ఆదేశాలివ్వండి

- Advertisement -
- Advertisement -

పోలవరం బ్యాక్ వాటర్ ముంపు సర్వేపై ఆదేశాలివ్వండి
వర్షాకాలం వచ్చేస్తోంది. పనులు సాగవు
భద్రాచలం వద్ద నీటిమట్టాలు గుర్తించాలి
పోలవరం అథారిటి నిర్లక్షం చేస్తోంది
కేంద్ర జలసంఘానికి తెలంగాణ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై ఏపిలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే ముంపు ప్రభావం ఎంత అన్నది తేల్చేందుకు తక్షణమే ఉమ్మడి సర్వే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలసంఘాన్ని కోరింది. వర్షాకాలం సమీపిస్తోందని, రుతుపవనాల రాకకు కేవలం 25రోజులు మాత్రమే గడువు ఉందని ఆలోపే సర్వే జరపకపోతే వర్షాలలో సర్వేపనులకు వీలు కాదని తెలిపింది. సుప్రీంకోర్టు నిర్ణయించిన గడువులోగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధ్వర్యంలో సర్వే నిర్వహించాలని కోరుతూ ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం నాడు సిడబ్యుసి చైర్మన్‌కు లేఖ రాశారు.

బ్యాక్ వాటర్‌పై క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు పిపిఏ నేతృత్వంలో ఉమ్మడి సర్వే నిర్వహించాలని లేఖ ద్వారా విజ్ణప్తి చేశారు. మూడు టెక్నికల్ కమిటి మీటింగ్‌లతోపాటు సమన్వయ సమావేశంలో కూడా సర్వేపై నిర్నయాలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బ్యాక్ వాటర్ ముంపు ప్రభావానికి సంబంధించి పలు అంశాలన లేఖలో ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు పుల్ రిజర్వాయర్ లెవెల్ స్థాయిలో నీటిని నిలువ చేస్తే తెలంగాణలొ 954 ఎకరాలు ముంపునకు గురవుతుందని ప్రాధమిక అంచనా ఉందని తెలిపారు. దీనిపై వాస్తవాలు నిర్ధారించుకుని ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగా రక్షణ చర్యలు చేపట్టాని కోరారు. రాష్ట్ర పరిధిలో గోదావరికి ఉపనదులు ఉన్న కిన్నెర సాని, ముర్రేడువాగు నుంచి డ్రైనేజి ప్రవాహాలకు సంబంధించి 2021 జూన్‌లోనే సిడబ్యుసి నివేదిక ఇచ్చిందని తెలిపారు.

దీంతోపాటుగా దుమ్ముగూడెం ఆనకట్ట దిగువన గోదావరిలో కలిసే ఏడు లోకల్ వాగుల కారణంగా ఉత్పన్నమయ్యే ముంపును గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాకుండా మరో 30 ప్రవాహలను కూడా గుర్తించాలని తెలిపారు. భద్రాచలం పట్టణం, మణుగూరు భారజల కేంద్రానికి సంబంధించిన లెవెల్స్‌ను తనిఖీ చేసేందుకు కూడా తక్షణం ఉమ్మడి సర్వే చేపట్టాలని కోరారు.

2010లో ఆమోదించిన డిపిఆర్‌లోని సిఫార్సులకు అనుగుణంగా కరకట్టలు నిర్మించేందుకు ఉమ్మడి సర్వే నిర్వహించాలని లేఖలో తెలిపారు.ఏపి ప్రభుత్వం నుంచి వివరాలు అంది రెండు వారాలు గడిచినా పోలవరం అథారిటి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. తక్షణమే సర్వే ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సుప్రీంకోర్టు గడువు లోపుగా పిపిఏ సర్వే చేపట్టాలని ,ఏపిని ఇందులో భాగస్వామిగా చేర్చినా చేయకపోయినా సర్వే ప్రక్రియ జరిగి తీరాలని లేఖ ద్వారా ఈఎన్సీ మురళీధర్ సిడబ్యుసి చైర్మన్‌కు విజ్ణప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News