Thursday, January 23, 2025

రంజాన్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: తలసాని

- Advertisement -
- Advertisement -

మసీదుల్లో ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందులిస్తున్నాం
రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది
మంత్రులు తలసాని, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్

Telangana Govt making all arrangements for Ramadan

మనతెలంగాణ/హైదరాబాద్:  ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్‌కు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రంజాన్ పండుగ ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని డిఎస్‌ఎస్ భవన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో తలసానితో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, ఎస్సీ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌లు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం రంజాన్‌ను ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు తెలిపారు. నిరుపేదలు సైతం పండుగను సంతోషంగా జరుపుకోవా లన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనగా వారు పేర్కొన్నారు. ఈ మేరకు నూతన దుస్తుల గిఫ్ట్ ప్యాకెట్‌లను కూడా ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే మసీదుల్లో ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందులకు సైతం ప్రభుత్వం సహకరిస్తుందని వారు తెలిపారు. మత సామర స్యంతో అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్న రాష్ట్రంలో ప్రతి ఏటా రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ వస్తుందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఆయాశాఖల సమన్వయంతో రంజాన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు తెలిపారు.

ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా…

తెలంగాణ గొప్ప లౌకిక రాష్ట్రం, ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప లౌకికవాది అన్ని కులాలు, మతాలను సమదృష్టితో చూడడంతో పాటు గౌరవిస్తున్నారన్నారు. అన్ని ప్రధాన పండుగలు, జాతరలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరుస్తుందని రంజాన్ పవిత్ర మాసాన్ని, పేదలకు దుస్తుల పంపిణీ, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చే విందును, పండుగను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకుందామన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు శ్రద్ధాసక్తులతో చూసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. మసీదులు,ఈద్గాలకు అవసరమైన మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని, సున్నాలు వేయాలని,, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.

బ్లీచింగ్ పౌడర్ చల్లాలి

ప్రధానమైన మసీదులు, ద్గాల వద్ద మూత్రశాలలు నిర్మించడంతో పాటు పండుగ రోజు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రైనేజీలు పొంగకుండా చూసుకోవాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు. పేదలకు పంపిణీ చేసే దుస్తులను పండుగకు ముందేగానే అందజేయాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని వారు సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో పాటు ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News