Wednesday, January 22, 2025

కాళేశ్వరంపై స్కానింగ్

- Advertisement -
- Advertisement -

గోదావరి నదీజలాల ఆధారంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం నఖశిఖ పరిశీలనకు సిద్దమైంది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు భూ మిలోకి కుంగిపోయిన ఘటనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. కాళేశ్వరం లో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై నిగ్గు తేల్చేందుకు న్యాయవిచారణ జరిపిస్తామని ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంగా నిండు సభలోనే ప్రకటించారు. దోషులు ఎంతటివారైనా సరే ఎవరినీ ప్రభుత్వం వదిలిపెట్టదని హె చ్చరించారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర మంత్రు ల బృందం బ్యారేజీలో నిర్మాణలోపాల పరిశీలనకు సిద్దమయింది. శుక్రవారం ఉయదం రాష్ట్ర నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడిగడ్డకు బయల్దేరనున్నారు. ఉదయం 11.30గంటలకు మేడిగడ్డకు చేరుకోనున్నారు. అ క్కడే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన ప్రాంతాల ను నిశితంగా పరిశీలన చేయనున్నారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు కాళేశ్వ రం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వా రా డిపిఆర్ మొదలుకుని గోదావరి నదీజలాల వి నియోగం ,

కొత్త ఆయకట్టు వివరాలు , ఇప్పటికే ఉన్న ఆయకట్టు స్థిరీకరణ , బ్యారేజీలలో నీటి నిల్వ సామర్థ్ధం, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనకు సంబంధించిన కారణాలు , అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడటం తదితర అన్ని వివరాలను మంత్రుల బృందానికి వివరించనున్నారు. అనంతరం సాయంత్రం 3.30గంటలకు మంత్రు ల బృందం
అన్నారం బ్యారేజీని సందర్శించనుంది. బ్యారేజీలో బుంగలు ఏర్పడిన ప్రాతాన్ని పరిశీలించనుంది. పర్యటన అనంతరం తమ పరిశీలనలో వెలుగు చూసిన అంశాలపై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం గత అక్టోబర్‌లో రాష్ట్రానికి వచ్చింది. జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతోపాటు ,బ్యారేజి నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో మేడిగడ్డ ఘటనకు సంబంధించిన వివిధ కోణాలపై సమీక్షించారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించారు. హైడ్రాలజీకి చెందిన అంశాలను కూడా పరిశీలన చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ అక్టోబర్ 21నాటి రాత్రి ఉన్నట్టుండి భారీ శబ్ధంతో కుంగిపోయింది.

బ్యారేజి ఏడవ బ్లాకుకు చెందిన 18,19,20 పిల్లర్ల వద్ద వంతెన పైభాగం కొంతమేరకు కుంగింది. 19,20 నెంబర్ పిల్లర్లు నాలుగు అడుగుల మేరకు భూగర్భంలోకి కుంగిపోవటంతో బ్యారేజి పైగాగం కిందకు వంగిపోయింది. సంఘటన జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం యుద్ధ్దప్రాతిపదికన స్పందించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టి అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల బృందం మేడిగడ్డ ప్రాంతానికి చేరుకుని బ్యారేజిని నిశితంగా పరిశీలన చేసింది. బ్యారేజీపైనుంచి నిచ్చెనల సాయంతో కిందకు దిగి ఏడవబ్లాకులోని పిల్లర్లను అన్నికోణాల తనిఖీ చేసింది. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో జరిపిన ఉన్నత స్థాయి సమీక్షలో మరిన్ని అంశాలపై లోతుగా వివరాలను తెలుసుకుంటూ బ్యారేజి కుంగిపోవటానికిగల సాంకేతిక పరమైన అంశాలను గుర్తించే ప్రయత్నం చేసింది. రాష్ట్ర నీటి శాఖ ఉన్నత స్థాయి అధికారులు కేంద్ర బృందం అడిగిన ప్రశ్నలు , లేవనత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ వచ్చారు. బ్యారేజీ నిర్మాణంలో పునాదుల దశ నుంచి నిర్మాణం పూర్తయ్యేదాక అన్ని అంశాలను పూసగుచ్చినట్టు కేంద్ర బృందానికి వివరించినట్టు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో జియాలజికల్ సర్వే నివేదికలను కూడా పరిశీలించారు. పిల్లర్లు నిర్మించేందకు భూగర్భంలో ఎంత లోతువరకూ తవ్వకాలు చేశారు

అక్కడి నేల స్వభావం , లోతుకు వెళ్లే కొలది ఎటువంటి నేలపొరలు బయట పడ్డాయి , భూగర్బంలో పిల్లర్ల పునాదుల నిర్మాణం కోసం నేల గట్టిదనం ఎంత తదితర అంశాలను కూడా కేంద్ర బృందం సమీక్షించింది. లూజ్ సాయిల్ ప్రాంతం భూగర్భంలో ఎన్ని మీటర్ల వరకూ వ్యాపించి ఉన్నది కూడా వివరాలు సేకరించింది. భూగర్భంలో లూజ్‌సాయిల్ ఉంటే మేడిగడ్డబ్యారేజికి చెందిన 87పిల్లర్లు కుంగిపోవాల్సి కేవలం 19,20 నెంబర్ పిల్లర్లే ఎందుకు కుంగిపోయాయి అన్నది కూడా ఆరా తీసింది. ఈ పిల్లర్లు నిర్మించే సందర్భంగా నాణ్యత పరీక్షలు , వాటికి సంబంధించిన రిపోర్టుల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. పిల్లర్ల పటిష్టత, నిర్మాణం సందర్బంగా తీసుకున్న జాగ్రత్తలు కూడా కేంద్ర బృందం సేకరించింది. ఈ రెండు పిల్లర్ల నిర్మాణంలో అప్పటి నీటిపారుదల శాఖ ఎస్‌ఇ , ఇఇ, డిఇ తదితర అధికారుల పాత్రపై కూడా ప్రశ్నించింది. అధికారులకు బ్యారేజీ నిర్మాణాల్లో ఉన్న అనుభవం , విధి వారి పనితీరు అదితర అంశాలపై కూడా ఆరా తీసింది. క్షేత్ర స్థాయిలో మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి సేకరించిన సమాచారం, నమూనాల సేకరణ ,వాటికి సంబంధించిన పరీక్షలు, నీటిపారుదల శాఖ అధికారులతో జరిపిన ఉన్నత స్థాయి సమీక్షలో గుర్తించిన అంశాలు తదితర వాటిని క్రోడీకరించి అన్ని కోణాలనుంచి సమగ్ర విశ్లేషణ అనంతరం ఒక నిర్ణయానికి వచ్చాకే కేంద్ర ప్రభుత్వం నియమించిన అనిల్ జైన్ నేతృత్వంలోని నిపుణుల బృందం నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను కేంద్ర శక్తి మంత్రిత్వశాఖకు సమర్పించింది.

మేడిగడ్డపై ఆ 20అంశాలే కీలకం !
కాళేశ్వరం పధకంలో అంతర్భాగమైన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజికి సంబంధించి మరింత సమాచారం కావాలని కేంద ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని కోరింది. మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటుకు సంబంధించిన 20 అంశాలను లేవనెత్తి ఆమేరకు అడిగిన సమాచారం పంపాలని కోరుతూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటివరకూ మేడిగడ్డ బ్యారేజి ఘటనలో తమకు నాలుగు అంశాలకు సంబంధించిన సమాచారం మాత్రమే అందజేశారని , ఇంకా 16 అంశాలకు సమాచారం అందజేయాలని తెలిపింది. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టు క్వాలిటీ, జియలాజికల్ స్టడీ రిపోర్ట్, బ్యారేజిని నిర్మించిన కాంటాక్టు సంస్థ లయబులిటి తదితర అంశాలను లేఖలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రస్తావించింది. తాము కోరిన విధంగా అన్ని అంశాలకు సంబంధించిన వివరాలను పంపాలని లేఖలో సూచించింది. మేడిగడ్డ ఘటనకు సబంధించి ఏడవ బ్లాకులో 16,17,18,19,20 పిల్లర్లను చక్కదిద్దే పనులు పెద్ద సవాలుగా మారాయి.

ప్రభుత్వంలోనే రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నతస్థాయి అధికార యంత్రాంగం బ్యారేజీ రిపేర్లపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. బ్యారేజీలో నిల్వ నీటిని ఖాళీ చేయించింది. ఎగువ నుంచి వస్తున్న కొద్దిపాటి నీటి ప్రవాహాన్ని కూడా ఎప్పటికప్పుడు దిగువకు పంపేందుకు ఏర్పాట్టు చేసింది. ఏడవ బ్లాకులో 20వ పిల్లరు భూమిలోకి కొంత మేరకు కుంగిపోవటంతో ఆ ప్రభావం పక్కన ఉన్న మరి కొన్ని పిల్లర్లపై కూడా పడటంతో ఈ బ్లాకు ఉన్న ప్రాంతంలో రింగ్‌బండ్ వేసి ఎగువ నుంచి వచ్చేనీరు అటువైపు రాకుండా నీటిమళ్లింపునకు అవసరమైన చర్యలు చేపట్టింది. కాఫర్ డ్యాం నిర్మించే ప్రయత్నాలపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి యంత్రాలు , ఇతర సామగ్రిని మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి చేరవేసేందుకు చర్యలు చేపట్టింది. బ్యారేజీల భద్రాత కమిటీ చైర్మన్ ఎ.బి పాండేతో నీటి శాఖ ఇఎన్‌సి మురళీధర్ పర్యవేక్షణలోనే మేడిగడ్డ బ్యారేజీ రిపేరి ప్రక్రియ కొంతమేరకు జరిగింది.

న్యాయవిచారణ .. సిడిఎ సిగ్నల్ వచ్చాకే పనులు!
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణపనులపై వచ్చిన అభియోగాలపై ప్రభుత్వం న్యాయవిచారణ ప్రారంభిస్తే అది తొలుత పూర్తికావాల్సి ఉంది. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులకు సంబంధించి సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సిడిఎ)అనుమతి రావాల్సి ఉంది. ఈ సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బ్యారేజీ పునరుద్ధరణ పనులు ప్రారంబించాల్సి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరిన విధంగా ఆయా అంశాలపైన ఇప్పటికే నివేదిక అందజేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారాలన్నీ పూర్తయితేనే తిరిగి మేడిగడ్డ పనులు చేపట్టే అవకాశం ఉందంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News