Wednesday, November 6, 2024

తెలంగాణలో స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు సర్కార్ ప్లాన్

- Advertisement -
- Advertisement -

ఒలింపిక్స్ స్థాయి ప్రమాణాలతో స్పోర్ట్ అకాడమీలు
అథ్లెట్లకు శిక్షణలో కొరియన్ స్పోర్ట్ యూనివర్శిటీ సహకారం
సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు
మనతెలంగాణ/హైదరాబాద్: యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ(ఫోర్త్ సిటీ)లో నిర్మించే స్పోర్ట్ హబ్‌లో దీనిని ఏర్పాటు చేస్తారు. దాదాపు 12 వివిధ క్రీడల అకాడమీలను ఇందులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఉంటాయి.

ఈ స్పోర్ట్ హబ్‌లో స్పోర్ట్ సైన్స్ సెంటర్, స్పోర్ట్ మెడిసిన్ సెంటర్ కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. కొత్తగా స్థాపించిన స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే తెలంగాణ స్పోర్ట్ యూనివర్సిటీకి ‘యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ’ అనే పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనువైన స్థలంగా ప్రస్తుతం హకీంపేటలో ఉన్న స్పోర్ట్ స్కూల్ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్ కాంప్లెక్స్‌లను పరిశీలిస్తున్నారు. సదరు క్యాంపస్‌ను ఒలింపిక్స్ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల దక్షిణ కొరియాలో పర్యటనలో సియోల్‌లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్ యూనివర్శిటీనిని సందర్శించారు. ఇది ప్రపంచంలోనే పేరొందిన స్పోర్ట్ యూనివర్సిటీగా ప్రత్యేకత చాటుకుంది.

ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా మొత్తం 32 పతకాలు గెలుచుకోగా, అందులో 16 పతకాలు కొరియన్ నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవే కావడం గమనార్హం. ఈ యూనివర్సిటీలో శిక్షణ పొంది, పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో మూడు బంగారు పతకాలు సాధించిన అథ్లెట్ లిమ్ సి-హైయోన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పర్యటనలో కలిసి అభినందించారు. భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లకు శిక్షణ ఇచ్చేలా తెలంగాణ యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్శిటీకి సాంకేతిక భాగస్వాములుగా కొరియన్ నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీ సేవలు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News