Wednesday, April 16, 2025

కొలువుల జాతరకు వేళాయే

- Advertisement -
- Advertisement -

త్వరలో 20 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమాయత్తం నోటిఫికేషన్లకు
తెలంగాణ సర్కారు సన్నాహాలు – నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం –
త్వరలో ఖాళీల గుర్తింపు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూరి ్తకావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. టీజీపీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియను మొదలుపెట్టాలని సర్కారు యోచిస్తోంది. వివిధ విభాగాల్లో ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేసి, నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. దాదాపు 20 వేల పోస్టులకు నియామక ప్రకటనలు(రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్) వెలువడే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్న ప్రభుత్వ యంత్రాంగం
రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల భర్తీకి ఏటా క్యాలెండర్(జాబ్ క్యాలెండర్) ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్‌ను జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని సర్కారు స్పష్టం చేసింది. దీంతో గత ఏడాది సెప్టెంబరు నుంచి వెలువడాల్సిన ఉద్యోగ నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. దీంతో జాబ్ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 14 నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. వర్గీకరణ పూర్తికావడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టనుంది. రెండు, మూడు రోజుల్లో పలు విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు.

20 వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం
కనీసం 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న లక్ష్యంతో సర్కారు ఉంది. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10 వేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్‌నర్సులు, ఫార్మాసిస్టులు కలిపి దాదాపు ఐదు వేల ఖాళీలు ఉన్నాయి. ఇంజినీరింగ్ విభాగాల్లోనూ 2-3 వేల వరకు ఖాళీలు ఉన్నట్లుగా సమాచారం. కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్‌కు చేరినట్లుగా తెలిసింది. మరో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తోంది. గురుకుల, ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు భారీగా ఉన్నాయి. గత గురుకుల నియామక ప్రక్రియలో దాదాపు రెండు వేల వేల పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మారాయి. గ్రూప్-4 స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగంలోనూ భారీగా ఖాళీలున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News