Wednesday, January 8, 2025

ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు?

- Advertisement -
- Advertisement -

 జనవరి 14న నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు
ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ఎన్నికలపై దూకుడు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ
ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు – ఇప్పటికే గ్రామాలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం

మన తెలంగాణ / హైదరాబాద్ : పంచాయితీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. జనవరి 14న పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మూడు ఫేజుల్లో పంచాయితీ ఎన్నికలు జరిగనున్నాయి. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కనీసం ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఎంపీటీసీలతో ఎంపీపీలున్న మండలాల్లో ఎంపీటీసీల సంఖ్యను ఐదుకు పెంచాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. వచ్చే పంచాయితీ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయనుంది.

ఆ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు పెట్టనుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో కుల గణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే కుల గణన కోసం ముందుగా కొత్త బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న కమిషన్ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. కొత్త కమిషన్ చైర్మన్, సభ్యులపై సీఎం రేవంత్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

జనవరి 14న నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు : మరో నెలన్నర రోజుల్లో స్థానిక సంస్థల సమరంతో తెలంగాణ వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేతతో పాటు రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై వేగం పెంచినట్లు సమాచారం. మొత్తం మూడు ఫేజ్‌లలో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇది వరకే ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం జనవరి 14వ తేదీన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే ప్రకటించింది. అలాగే శాసనసభ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించింది.

బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం మొదలైన కసరత్తు : తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికలు ఎప్పుడైనా ఉండవచ్చనే సంకేతాలు ఉండటంతో అధికార యంత్రాంగం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను గ్రామాలు, వార్డుల వారీగా సిద్దం చేయగా తాజాగా కొత్త పేర్లను వార్డుల వారీగా సేకరిస్తున్నారు. మరోవైపు ఓటర్లకు సరిపడా బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం కసరత్తు మొదలుపెట్టారు. బ్యాలెట్ పేపర్ అధికారులే సరఫరా చేస్తుండగా, దానిపై గుర్తులు మాత్రం ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో ముద్రిస్తారు. బరిలో నలుగురు ఉన్నట్లు, అయిదుగురు, పది మంది ఉన్నట్లు, ఇలా గుర్తులతో ముందస్తుగానే ముద్రించుకొని సిద్ధంగా ఉంచాలా? లేక అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తేలాక ముద్రించాలా అనే దానిపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతుండటంతో ఆ ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. అప్పటి వరకు అందుబాటులో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌ల వివరాలను తీసుకుంటున్నారు. బ్యాలెట్ బాక్సులకు మరమ్మతులు చేసేందుకు మండలాల్లో నిల్వ ఉంచిన బాక్సులను జిల్లా కేంద్రానికి తెప్పిస్తున్నారు. మొత్తానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండటంతో ఎన్నికలు ఎప్పుడుంటాయనే దానిపై అందరి దృష్టి పడింది.

మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 1200 ఓటర్ల వరకు ఒక కేంద్రం ఉండగా అదే పంచాయతీకి వచ్చే సరికి వంద ఓటర్ల కంటే తక్కువగా ఉన్నా ఆ వార్డుకు పోలింగ్ కేంద్రం అందుబాటులో ఉంచాలి. అందుకే సిబ్బంది ఎక్కువగా అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పలుచోట్ల మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఇంతకు ముందే ప్రతిపాదనలు పంపించారు. గ్రామ పంచాయితీ ఎన్నికలపై ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉంటామని తెలిపారు. గత ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు వాయిగదా పడ్డాయి. మళ్లీ జూన్‌లో పంచాయితీ ఎన్నికలు ఉంటాయని అనుకుంటే కులగణన చేస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News