2019 నుంచి 2024 నాటికి అన్ని జిల్లాలో పడిపోయిన గొర్రెల సంఖ్య
రెండు విడతల్లో 4,25,088 యూనిట్ గొర్రెలను పంపిణీ చేస్తే తగ్గిన గొర్రెల శాతం
తాజా పశుగణనలో తేలిన లెక్క
గొర్రెల పంపిణీపై విచారణ చేపట్టిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండు విడతలుగా గొర్రెలను పంపిణీ చేసినా గొర్రెల సంఖ్య తగ్గడం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. 2017లో అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటివరకు (మొదటి, రెండో విడత)ల్లో 4,25,088 యూనిట్‌ల గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయినా ఇప్పటివరకు రాష్ట్రంలో మేకలు, గొర్రెల సంఖ్య తగ్గిపోవడం విచిత్రంగా ఉంది. ఇటీవల చేపట్టిన పశుగణనలో ఈ విషయం బయటపడింది. దీంతో అధికారులు అవాక్కయ్యారు. 2012 సంవత్సరంలో తెలంగాణలో గొర్రెల సంఖ్య 12,835,761లు కాగా, మేకల సంఖ్య 45,75,695. ఇక 2019 సంవత్సరానికి గొర్రెల సంఖ్య 19,094,836 కాగా, మేకల సంఖ్య 49,40,341గా అప్పటి ప్రభుత్వ లెక్కలు పేర్కొంటున్నాయి.
ఇక 2012 నాటితో పోలిస్తే 2019 నాటికి 48.76 శాతం గొర్రెల సంతతి వృద్ధి చెందింది. ఇక 2024 సంవత్సరంలో తాజా పశుగణన ప్రకారం గొర్రెల సంఖ్య 12,414,299 కాగా, మేకల సంఖ్య 38,02,609గా తేలింది. ఈ అయిదేళ్లలో 2019 నుంచి 2024 సంవత్సరానికి 34.99 శాతానికి గొర్రెల సంఖ్య పడిపోయింది. 2017సంవత్సరం ఏప్రిల్‌లో అప్పటి ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించడంతో పాటు ఈ పథకం కింద రాష్ట్రంలోని గొల్ల, కుర్మలను కోటీశ్వరులను చేస్తామని పేర్కొంది. 25 శాతం లబ్ధిదారుల వాటాతో కలిపి సుమారుగా రూ. 5,500 కోట్లను గొర్రెల పేరిట ప్రభుత్వం ఖర్చు పెట్టింది.ఈ నేపథ్యంలోనే అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ రెండు విడతల గొర్రెల పంపిణీతో గొర్రెల సంఖ్య పెరగాల్సింది పోయి ఎలా తగ్గిందన్న దానిపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.
జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో రూ. 430 కోట్లు….
ఈ నేపథ్యంలోనే అసలు పంపిణీ చేసిన గొర్రెలు ఎక్కడికెళ్లాయన్న విషయాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. అసలు నిజంగా గొర్రెలను పంపిణీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల సంఖ్య అనుకున్న దానికన్నా అధికంగా ఉండేదని, గొర్రెలను పంపిణీ చేయకుండా అధికారులు చేసిన అవకతవకల వల్ల గొర్రెల సంఖ్య తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే ఇదే విషయమై కాగ్ కూడా లెక్కలతో సహా బయటపెట్టగా రానున్న రోజుల్లో మరింత సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు రెండో విడత గొర్రెల పంపిణీలో 85,488 మంది తమ వాటా కింద 25 శాతం డబ్బును డిడిలు తీసి చెల్లించారు. దాదాపు రూ. 430 కోట్లు జిల్లా కలెక్టర్ల ఖాతాల్లోనే ఉండిపోయాయి. మరో 2,20,792 మంది లబ్ధిదారులు ఇంకా డబ్బులు కట్టలేదు. ఈ పథకంలో భారీ అవకతవకలు జరిగిన విషయాన్ని ఇటీవలే కాగ్ బయట పెట్టడంతో ప్రస్తుతం ఈ పథకం ఆగిపోయింది. ఇప్పటికే రెండు విడుతల్లో జరిగిన గొర్రెల పంపిణీ కుంభకోణంపై పలువురిని ఏసిబి అరెస్టు చేయగా మరికొందరిని త్వరలో అరెస్టు చేయనుంది.
2019-2024 వరకు జిల్లాల వారీగా గొర్రెలు, మేకల వృద్ధి ఇలా
2019లో మేడ్చల్ జిల్లాలో 1,49,401 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 51,915 గొర్రెలు ఉన్నాయని పశుగణన లెక్కలో తేలింది. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 60.49 శాతానికి గొర్రెల సంతతి తగ్గిపోయిందని తేలింది. వరంగల్ జిల్లాలో 7,33,016 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 67,101 గొర్రెలు ఉన్నాయని పశుగణన లెక్కలో తేలింది. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 60.15 శాతానికి గొర్రెల సంతతి తగ్గింది. సంగారెడ్డి జిల్లాలో 4,38,757 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 1,85,790 గొర్రెలు ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 53.26 శాతానికి తగ్గింది.
మెదక్ జిల్లాలో 6,37,146 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 2,89,734 గొర్రెలు ఉన్నాయని పశుగణన లెక్కలో తేలింది. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 50.46 శాతానికి గొర్రెల సంతతి తగ్గింది. నిజామాబాద్ జిల్లాలో 7,35,539 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 3,81,354 గొర్రెలు ఉన్నాయని పశుగణన లెక్కలో తేలింది. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 46.38 శాతానికి గొర్రెల సంతతి తగ్గింది. సిద్ధిపేట జిల్లాలో 8,01,259 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 4,00,338 గొర్రెలు ఉన్నాయని పశుగణన లెక్కలో తేలింది. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 46.13 శాతానికి గొర్రెల సంతతి తగ్గింది. ఖమ్మం జిల్లాలో 6,67,318 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 3,16,070 గొర్రెలు ఉన్నాయని పశుగణన లెక్కలో తేలింది. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 44.84 శాతానికి గొర్రెల సంతతి తగ్గిందని ప్రభుత్వం గుర్తించింది.
కరీంనగర్ జిల్లాలో 3 లక్షలకు తగ్గుదల
ఇక కరీంనగర్ జిల్లాలో 6,38,706 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 3,51,413 గొర్రెలు ఉన్నాయని పశుగణన లెక్కలో తేలింది. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 43.44 శాతానికి గొర్రెల సంతతి తగ్గింది. రంగారెడ్డి జిల్లాలో 7,68,716 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 4,14,205 గొర్రెలు ఉన్నాయని పశుగణన లెక్కలో తేలింది. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 42.81 శాతానికి గొర్రెల సంతతి తగ్గింది.
పెద్దపల్లి జిల్లాలో 5,52,257 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 3,07,686 గొర్రెలు ఉన్నాయని పశుగణన లెక్కలో తేలింది. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 40.93 శాతానికి గొర్రెల సంతతి తగ్గింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,93,683 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 2,31,143 గొర్రెలు ఉన్నాయని పశుగణన లెక్కలో తేలింది. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 40.11 శాతానికి గొర్రెల సంతతి తగ్గింది. జనగాం జిల్లాలో 6,79,829 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 3,91,053 గొర్రెలు ఉన్నాయని పశుగణన లెక్కలో తేలింది.
ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 39.15 శాతానికి గొర్రెలు తగ్గాయి. కామారెడ్డి జిల్లాలో 5,87,156 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 1,21,729 గొర్రెలు ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 36.15 శాతానికి గొర్రెల సంతతి తగ్గింది. మహబూబాబాద్ జిల్లాలో 6,77,922 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 4,25,712 గొర్రెలు ఉన్నాయని పశుగణన లెక్కలో తేలింది. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 35.39 శాతానికి గొర్రెల సంతతి తగ్గింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,67,256 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 1,41,287 గొర్రెలు ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 33.35 శాతానికి గొర్రెలు తగ్గిపోయాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో 25 శాతానికి తగ్గుదల
జగిత్యాల జిల్లాలో 6,11,080 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 3,81,650 గొర్రెలు ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 32.69 శాతానికి గొర్రెలు తగ్గిపోయాయి. సూర్యాపేట జిల్లాలో 7,79,090 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 4,94,440 గొర్రెలు ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 32.27 శాతానికి గొర్రెలు తగ్గిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6,50,426 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 4,36,487 గొర్రెలు ఉన్నాయి.
ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 30.43 శాతానికి గొర్రెలు తగ్గిపోయాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 9,70,150 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 6,80,728 గొర్రెలు ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 29.63 శాతానికి గొర్రెలు తగ్గిపోయాయి. నిర్మల్ జిల్లాలో 5,02,576 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 3,47,994 గొర్రెలు ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 29.37 శాతానికి గొర్రెలు తగ్గిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 1,53,214 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 89,746 గొర్రెలు ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 27.89 శాతానికి గొర్రెలు తగ్గిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 10,08,098 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 7,61,292 గొర్రెలు ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 25.77 శాతానికి గొర్రెలు తగ్గిపోయాయి.
హన్మకొండ జిల్లాలో 21 శాతానికి తగ్గిన గొర్రెలు
ములుగు జిల్లాలో 1,28,836 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 82,749 గొర్రెలు ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 24.94 శాతానికి గొర్రెలు తగ్గిపోయాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,60,958 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 1,23,504 గొర్రెలు ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 23.15 శాతానికి గొర్రెలు తగ్గిపోయాయి. వికారాబాద్ జిల్లాలో 2,38,786 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 1,68,993 గొర్రెలు ఉన్నాయి.
ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 22.23 శాతానికి గొర్రెలు తగ్గిపోయాయి.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2,91,765 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 1,98,123 గొర్రెలు ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 22.22 శాతానికి గొర్రెలు తగ్గిపోయాయి. హన్మకొండ జిల్లాలో 3,87,752 గొర్రెలు ఉండగా, 2024 సంవత్సరానికి ఇదే జిల్లాలో 2,84,562 గొర్రెలు ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా 21.57 శాతానికి గొర్రెలు తగ్గిపోయాయి. ఇలా జిల్లాల వారీగా గొర్రెల సంఖ్య తగ్గిపోవడం విశేషం.