Thursday, January 23, 2025

రైతు బంధువు!

- Advertisement -
- Advertisement -

Communal clashes during Ram Navami procession కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గత కొంత కాలం సాగిన యాసంగి వరి ధాన్య సేకరణ వివాదాన్ని చాలా మంది రాజకీయమైనదిగానే చూశారు గాని, అందులోని మానవీయ కోణాన్ని గమనించినవారు అరుదు. ఇదేదో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ తమ రాజకీయ స్వప్రయోజనం కోసం ఆడుతున్న నాటకమని వ్యాఖ్యానించినవారున్నారు. ఇద్దరి మధ్య అమాయక రైతులు బలైపోతున్నారనే అభిప్రాయం కూడా బాహాటంగా వినవచ్చింది. వాస్తవాలను తరచి చూస్తే ఈ వివాదంలో ప్రజల పక్షం వహించినవారెవరో, ప్రజలు ఏమైపోతే తమకెందుకని కర్కశ ధోరణి తీసుకున్నవారెవరో స్పష్టపడుతుంది. యాసంగి వడ్లను కొనుగోలు చేయాలంటూ సింఎ కెసిఆర్ ప్రభుత్వం కేంద్రంతో సాగించిన పోరాటం ఒక విధంగా చెప్పుకోవాలంటే 2020 నవంబర్ నుంచి 2021 నవంబర్ వరకు ఢిల్లీ సరిహద్దుల్లో సాగిన రైతు మహోద్యమానికి కొనసాగింపుగా జరిగిందేనని పరిగణించాలి.

ప్రధాని మోడీ ప్రభుత్వం రైతులను, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టాలని చెప్పుకున్న సంకల్పం అమలులో భాగంగానే యాసంగి వరిని గతంలో మాదిరిగా కొనుగోలు చేయడానికి నిరాకరించింది. ఒకవైపు పంట కోతలు కూడా జరిగిపోతూ ధాన్యం కళ్లాల్లో కుప్పలు పడుతున్నా, దానిని సేకరించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే అర్థిస్తున్నా, రైతులంటే తనకు బొత్తిగా కనికరం లేదని ఈ వివాదం పొడుగునా జరిగిన అనేక పరిణామాల ద్వారా కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌ను కలుసుకొని అర్థించగా ఆయన వారిపట్ల చూపిన నిరాదరణ, నిర్లక్షం ప్రజాస్వామ్యంలో నాయకులెవరూ చూపించకూడని అమానవీయతను సంతరించుకున్నాయి.

యాసంగి వడ్లను నేరుగా మిల్లాడించి ముడి బియ్యాన్ని భారత ఆహార సంస్థకు అందజేస్తే నూకల రూపంలో అమిత నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి వస్తుందని, పూర్వం మాదిరిగానే వుప్పుడు బియ్యం (పారా బాయిల్డ్ రైస్) తీసుకోవలసిందని మంత్రుల బృందం గోయెల్‌ను అర్థించగా ఆ నూకలు తినడాన్ని మీ ప్రజలకే అలవాటు చేయండంటూ ఆయన చేసిన సూచన రాష్ట్ర ప్రజల హృదయాలను ఎంతగా గాయపరిచిందో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ఇది జరిగిన తర్వాత ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ధర్నాను నిర్వహించి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని మోడీకి నేరుగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఈ సందర్భంగా కెసిఆర్ హిందీలో చేసిన ప్రసంగం దేశ ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించింది.

ఒక ముఖ్యమంత్రి తన ప్రజల కోసం ఢిల్లీ వెళ్లి స్వయంగా ఆందోళనలో పాల్గొని ప్రధానికి తన రాష్ట్ర రైతుల గురించి విన్నవించుకున్న తీరు అనన్యమైనది. 24 గంటల్లో కేంద్రం ఏ విషయమూ చెప్పాలని అల్టిమేటం ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ అక్కడి నుంచి ఎటువంటి సత్ఫలితం ఊడిపడదని గమనించి రాష్ట్ర ప్రభుత్వం చేతనే రైతుల వడ్లను కొనుగోలు చేయించాలని నిర్ణయించుకున్న తీరు కష్టకాలంలో ఒక ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలో చెప్పింది. కాళేశ్వరం వంటి మేటి సాగునీటి ప్రాజెక్టులను అతి స్వల్ప కాలంలోనే నిర్మింపజేసి నేరుగా లక్షలాది ఎకరాలకు సాగు నీటిని సాధించుకొని, ఎడారి నేలల్లో సైతం భూగర్భ జలాలను పెల్లుబికించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిది.

కోటి 25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని దీక్ష వహించిన ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 32 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ సౌకర్యం కల్పించింది. దేశంలో మిగతా ఏ రాష్ట్రంలోనూ ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ ఆయకట్టు సృష్టిగాని, ఇంత విస్తీర్ణంలో వరి పంటను సాధించడం గాని జరగలేదు. దీనిని చూచి కన్నుకుట్టిందో ఏమో గాని కేంద్రం ఎప్పటి మాదిరిగా ఈ యాసంగిలో ఉప్పుడు బియ్యం ఇస్తే తీసుకునేది లేదని మొండికేసింది. అప్పుడెప్పుడో సంతకం చేశారనే కారణం చూపి రాష్ట్రంలోని రైతాంగానికి కన్నీరు తెప్పించే నిర్వాకానికి పాల్పడింది. కేంద్రం ధోరణిని గమనించి ఈ యాసంగిలో వరి వేయొద్దని ముఖ్యమంత్రి కెసిఆరే రైతులకు హితవు చెబుతూ వచ్చారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రంగ ప్రవేశం చేసి వరి వేయండి, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనదో చూస్తాం అని రైతులను రెచ్చగొట్టారు. ఆ విధంగా ఆయన పోషించిన ప్రతినాయక పాత్ర రాష్ట్ర రైతులను కష్టాల్లోకి నెట్టివేసింది.

కొనాల్సిన కేంద్రమే కొననంటూ మంకుపట్టుపట్టడం వారి పాలిట అశనిపాతమైంది. 60 లక్షల టన్నులకు పైగా వచ్చే వరి ధాన్యాన్ని రాష్ట్రం స్వయంగా కొనుగోలు చేయడమంటే వొంటి చేత్తో పర్వతాన్ని ఎత్తడమంత సాహసం. కేంద్రం ముడి బియ్యాన్నే కొంటానంటున్నందున రాష్ట్రం ఈ ధాన్యాన్ని మిల్లాడించి వచ్చే ముడి బియ్యాన్ని పంపించవలసి వుంటుంది. అందువల్ల రాగల అధిక శాతం నూకల నష్టాన్ని తానే భరించవలసి వుంటుంది. ఎన్ని కష్టనష్టాలకైనా ఓర్చి కొనుగోలు కేంద్రాలను విరివిగా తెరిచి రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మానవతా దృష్టిని కాకుండా రాజకీయాన్ని చూసే వారిని ఏమనాలో అర్థం కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News