Friday, November 15, 2024

ఆగిన జనజీవనం

- Advertisement -
- Advertisement -

మన నెట్‌వర్క్: ఆకాశానికి చిల్లు పడింది.. రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. నది పరీవాహకంగా వాగులు వంకలు ఏకమై ప్రవహిస్తున్నాయి. మ హారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి ఉపనదిగా ఉన్న ప్రాణహిత దాల్చింది. కడెం ఉధృతంగా ప్ర వహిస్తోంది. రాష్ట్రంలో మంజీరా, మూసీ తదితర నదుల్లో వ రద ఉధృతి క్రమంగా పెరుగుతూ వస్తోంది. గోదావరి నదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. భద్రాచలం వద్ద గోదావరిలో ఉదయం 35 ఉన్న నీటిమట్టం మధ్యాహ్నానికి 43 పెరిగింది. అధికారులు అప్రమత్తమై మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కేంద్ర జల మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గోదావరి నదీ వర్షాలను నిరంతరం గా గమనిస్తూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. గోదావరిలో వదర ఉధృతి మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని , భ ద్రాచలం వద్ద శుక్రవారం ఉదయానికి నీటిమట్టం 50అడుగులకు చేరే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది.

రాష్ట్రమంత టా విడవకుండా కురుస్తున్న జడివానతో జనజీవనం స్తంభించింది. రాష్ట్రంలోని పలు పట్టణాలు, గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరుతుండటంతో రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించి పోతుండడంతో వాహన దారులు పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో జ నం ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. గోదావరి నది పరీహాహకంగా ఉన్న ఉపనదులు వరద పొంగి ప్రవహిస్తుండడంతో లోతట్టు
కాలనీల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాలు వరదలను దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పలు శాఖల సిబ్బంది సెలవులు రద్దు చేసింది. 24గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. వరదల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాలను అక్కడి నుంచి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది.. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించే విషయంలో అవసరమైతే హెలికాప్టర్ సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు రాష్ట్ర ఆర్ధిక , వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రకటించారు. గురువారం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఈనెల 24న సూర్యాపేట జిల్లా పర్యటనను కూడా వాయిదా వేశారు. భారీ వర్షాల నేపధ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇల్లు వదిలి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. విద్యుత్ సంస్తలను కూడా అప్రమత్తం చేసింది. విద్యుత్ ప్రసారాల్లో అంతరాయాలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించింది. అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని ,విద్యుత్ సరఫరాలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలిచ్చింది.

మరో 5 రోజులు భారీ వర్షాలు ..పలు జిల్లాలకు ఐఎండి హెచ్చరిక:
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వర్షాలు మరింత అధికమయ్యే సూచనలున్నాయని పేర్కొంది. తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ప్రత్యేక వాతావరణ బులిటిన్ విడుదల చేసింది.రాష్ట్రంలో నాగులు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.మరో 11జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 12జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన వాతావరణశాఖ ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.

ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, కామారెడ్డిలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో అనేక చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం ఉదయం నుంచి నిజామాబాద్, కామరెడ్డి, మెదక్, సంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట, వరంగల్, కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

మల్కాజిగిరిలో అత్యదికంగా 111.8మి.మి వర్షం:
గడిచిని 24గంటలుగా రాష్ట్రంలో అత్యధికంగా మేడ్చెల్ మల్కాజిగిరిలో అత్యధికంగా వర్షం కురిసింది. ఈ జిల్లాలోని ప్రశాంత్‌నగర్‌లో 111.8మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డిజిల్లా కేతిరెడ్డిపల్లిలో 110.5, వికారాబాద్ జిల్లా ముజాహిద్‌పూర్‌లో 110.3, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 109, జేపిఎన్ నగర్‌లో 107, ఉప్పల్‌లో 105, ఆనంద్‌బాగ్‌లో 104,నాచారంలో 104.5, ప్రోద్దటూర్‌లో 101, మదనపల్లెలో 100.3,కాప్రాలో 99,రాచలూరులో 99.3 హెచ్‌ఎంటి హిల్స్‌లో 93.5, మల్లాపూర్ బయోడైవర్సిటిలో 93.3, పుట్టపహడ్‌లో 97మి.మి చోప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచిభారీ వర్షాలు కురిశాయి.

గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ బృందాలు:
గ్రేటర్‌హైదరాబాద్ పరిధిలోని అత్యధిక ప్రాంతాల్లో 60నుచి 90మి.మి మేరకు వర్షం కురిసినట్టు అధికారులు వెల్లడించారు. నగరంలో వరద నీరు రోడ్లపై ప్రహహించటంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌తో వాహన దారులు ఇబ్బందులు పడ్డారు.భారీ వర్షాల నేపధ్యంలో నగరంలో అత్యవసర సేవలు అందజేసేందుకు 426మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేశారు. మరో 127స్టాటిక్ టీంలను నియమించారు. నగరం పరిధిలో 339 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి వాటి వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. 185 చెరువుల వద్ద నీటిమట్టాలను ఎప్పటికపుడు గమనిస్తూ తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరంలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.

దుమ్ముగూడెం బ్యారేజికి 9.27లక్షల ఇన్‌ఫ్లో
భారీ వర్షాలు వరదలతో గోదవరి నది ఉధృతి పెరుగుతూ వస్తోంది. గురువారం సాయంత్రానికి దుమ్ముగూడెం బ్యారేజి వద్ద ఇన్‌ప్లో 9.27లక్షల క్యూసెక్కులకు చేరింది. భద్రాచలం వద్ద గోదావరిలో 9,46,412క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ఎగువన బాబ్లీ నుండి వదర శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పోటెత్తింది. ఈ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి59165క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 36.954టిఎంసీలకు చేరుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్‌ప్లో 10226క్యూసెక్కులు చేరుతోంది.ప్రాణహిత నది ఉగ్రరూపం దాలుస్తోంది. మేడిగడ్డ వద్ద లక్ష్మి బ్యారేజికి 5,53,670క్యూసెక్కులు చేరుతోంది.ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. సమ్మక్క బ్యారేజికి 8.76లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా అంతే నీటిని దిగువకు వదులు తున్నారు.కెండం ప్రాజెక్టులోకి 10978క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రెండు గేట్లు ఎత్తివేసి 4889క్యూసెక్కుల నీటిని బయటకు వదులు తున్నారు.

మంజీరా నదిలో వరద ప్రవాహం పెరిగిది. సింగూరు ప్రాజెక్టులోకి 84440క్యూసెక్కులు, నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 23400క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. రాష్ట్రంలో గోదారి నది పరివాహకంగ ఉన్న చిన్న మద్య తరహా ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. పోచారం ప్రాజెక్టులోకి 6538క్యూసెక్కుల నీరు చేరుతోంది.కళ్యాణి డ్యాం పూర్తి స్థాయిలో నిండిపోయింది. అధికారులు గేట్లు ఎత్తి లోతట్టు ప్రాంతాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు.కుమరం భీమ్ ప్రాజెక్టులోకి 5056క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు మూసి నదికి కూడా వరద ప్రవాహం పెరిగింది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరో వైపు కృష్ణానది పరివాహకంగా ఉన్న ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.రాష్ట్ర ముఖద్వారంలో ఉన్న జూరాల ప్రాజెక్టులోకి చుక్కనీరు చేరకపోవటం ఆందోళన గొలుపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News