Thursday, November 14, 2024

కలెక్టర్‌పై దాడి… సర్కార్ సీరియస్

- Advertisement -
- Advertisement -

సంఘటనపై సిఎం ఆరా.. కుట్రకోణంపై విచారణకు ఆదేశం
అనుమానితులుగా భావిస్తున్న 55మంది అరెస్టు
నిర్మానుష్యంగా మారిన లగచర్ల, రోటిబండ తండా
అర్థరాత్రి కరెంట్ తీసి అనుమానితుల ఇళ్లపై ఆకస్మిక దాడులు 
బోసిపోయిన వీధులు, ఇళ్లకు తాళాలు 
బొంరాస్‌పేట, దుద్యాలలో ఇంటర్నెట్ కనెక్షన్ కట్
రాజకీయ కుట్రలపై పోలీసుల ఆరా
పట్నం నరేందర్‌రెడ్డిపై బలపడుతున్న అనుమానాలు
కలెక్టర్‌ను గ్రామానికి తీసుకెళ్లిన సురేష్ అనే వ్యక్తి నరేందర్‌రెడ్డి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు
సురేష్ ఫోన్ నుంచి నరేందర్‌రెడ్డికి రెండు రోజుల్లో 45కి పైగా ఫోన్లు

మన తెలంగాణ/హైదరాబాద్/కొడంగల్/దౌల్తాబాద్: ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థులు దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్‌రెడ్డి కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లేముందు ఈ ఘటన గు రించి సిఎం రేవంత్ అధికారులను అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. ఈ ఘటనలో కుట్రకోణం ఉంటే సమగ్రంగా విచారణ జరపాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారుల ను ఆదేశించినట్టుగా తెలిసింది. దీంతో సిఎం ఆదేశాల మే రకు సంబంధిత అధికారులు ఈ కేసును సీరియస్‌గా విచారణ చేస్తున్నారు. సిఎం ఆదేశాల నేపథ్యంలో మంత్రి శ్రీధర్‌బాబు (రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జీ మంత్రి) అక్కడి పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రస్తుతం ఆయా గ్రామాల్లో పరిస్థితు ల గురించి, జరిగిన సంఘటన గురించి మంత్రి శ్రీధర్‌బాడు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ సంఘటన కుట్ర ప్రకా రం జరిగిందని పోలీసుల విచారణలో తేలినట్టుగా తెలిసింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, మంత్రులు, ఎంపిలు సైతం ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, నిందితులను పట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్‌పై దాడి కేసులో బిఆర్‌ఎస్ నేతల ప్రమేయంపై కూడా పోలీసులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. రాజకీయ ప్రేరేపితంతోనే దాడి జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించినా పోలీసులు, ఈ దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. నిందితుడి సురేష్ ఫోన్ నుంచి 42 సార్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్‌కాల్స్ వెళ్లడం, అదే టైంలో కెటిఆర్‌కు ఆరు సార్లు పట్నం నరేందర్ రెడ్డి ఫోన్లు చేయడం లాంటి సంఘటనకు సంబంధించి పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు సురేష్‌పై ఇప్పటికే రేప్ కేసుతో సహా పలు కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు.

మొత్తం 58 మంది అదుపులోకి…
సోమవారం అర్ధరాత్రి లగచర్ల, రోటిబండతండాలలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడులు జరిగిన వెంటనే బొంరాస్‌పేట్, దుద్యాలలో ఇంటర్నెట్ కనెక్షన్‌ను అధికారులు కట్ చేశారు. అర్ధ్దరాత్రి ఆయా గ్రామాల్లో కరెంటు తీసి అనుమానితుల ఇండ్లపై దాడి చేశారు. వారి ఇండ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 55 మందిని అరెస్టు చేసి రాత్రికి రాత్రే పరిగి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. పోలీసులు దాడులు నిర్వహించి యువకులను అరెస్టు చేయడంతో గ్రామంలో మిగిలిన వారంతా ఇళ్ళకు తాళం వేసి వెళ్ళిపోయారు. దీంతో ఆయా గ్రామాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. గ్రామంలో ఎక్కడ చూసినా తాళం వేసి ఉన్న ఇండ్లే దర్శనమిస్తున్నాయి. కాగా, భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియలో భాగంగా రైతులతో మాట్లాడి, వారి డిమాండ్లను తెలకోవడానికి వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డిని సురేష్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి గ్రామంలోకి తీసుకు వెళ్ళినట్లు జిల్లా ఎస్‌పి నారాయణరెడ్డి పేర్కొన్నారు.

గ్రామంలో ప్రశాంతంగా రైతుల మధ్య మాట్లాడుకుందామని అధికారులకు నచ్చజెప్పి వారిని గ్రామంలోకి తీసుకువెళ్ళినట్లు విశ్వసిస్తున్నారు. సురేష్ మాటలు నమ్మి గ్రామంలోకి వెళ్ళిన అధికారులపై గ్రామస్థులు తిరగబడడం, వారిపై రాళ్ళు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని జరిగిన సంఘటనల ఆధారంగా దాడి ఘటనను విశ్లేషించగా పక్కా ప్రణాళిక ప్రకారం ముందస్తుగా వేసుకున్న వారు మూకుమ్మడిగా దాడికి పాల్పడినట్లు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా అరెస్టు చేసిన వారిని పూర్తి స్థాయిలో విచారిస్తామని, వారి నుండి పూర్తి సమాచారాన్ని సేకరించిన అనంతరం దాడి కేసులో బాధ్యలపై చర్యలు తీసుకుంటామని ఎస్‌పి తెలిపారు. దాడి సంఘటనలో రాజకీయ కుట్ర సైతం దాగి ఉండవచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. వెదడి ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బోగమోని సురేష్‌ను బిఆర్‌ఎస్ కార్యకర్తగా గుర్తించిన పోలీసులు దాడి జరిగిన రోజు ఆయన కొడంగల్ మాజీ ఎంఎల్‌ఎకి చాలాసార్లు ఫోన్ చేసినట్లు గుర్తించామని తెలిపారు.

అంతేకాకుండా గతంలో సురేష్‌పై పలు క్రిమినల్ కేసులు సైతం ఉన్నట్లు గుర్తించారు. సురేష్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. ఏదేమైనా దాడి ఘటనలో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.సురేష్ బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త అని, అతడి స్వస్థలం హైదరాబాద్‌లోని మణికొండ అని వారు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా గ్రామానికి వెళ్లి అక్కడ సురేష్ గ్రామస్థులను రెచ్చ గొట్టినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడి అయ్యిందని వారు తెలపడంతో బిఆర్‌ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే బిఆర్‌ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆరు గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందని, గ్రామస్తులు ఎవరూ వదంతులను నమ్మొద్దని పోలీసులు సూచించారు.

రాష్ట్రస్థాయిలో ఉద్యోగ సంఘాల నాయకుల నిరసన
కలెక్టర్, అదనపు కలెక్టర్, తహసీల్దార్‌లపై దాడికి నిరసనగా రాష్ట్రస్థాయిలో ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉద్యోగ సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు ఉద్యోగ సంఘాల నాయకులు డిజిపిని కలిసి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వినతిపత్రం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News