మద్యం షాపులు 12 గంటల వరకు…
బార్‌లు, పబ్‌లు, ప్రత్యేక ఈవెంట్‌లకు ఒంటిగంట వరకు
జనవరి 01వ తేదీ వరకు అనుమతులు కొనసాగింపు
ఈవెంట్‌లకు కనీస ఫీజు రూ.50 వేలు,
అత్యధికంగా రూ.2.50 లక్షల తాత్కాలిక ఫీజు వసూలు చేయనున్న ఆబ్కారీ శాఖ
ఉత్తర్వులను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఈనెలలో రూ. 3,500 కోట్లకుపైగా
మద్యం విక్రయాలు జరిగే అవకాశం
ఆబ్కారీ శాఖ వర్గాల అంచనా
హైదరాబాద్: కొత్త ఏడాది వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నూతన ఏడాది వేడుకలను రాత్రంతా జరుపుకునేలా, మద్యం అందుబాటులో ఉంచుతూ న్యూ ఇయర్ వేడుకలకు పూర్తిస్థాయిలో అనుమతులు జారీ చేసింది. దానికి అనుగుణంగా మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లలో ప్రత్యేక ఈమెంట్లకు అనుమతులు ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలను డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకునేలా, బార్లు ఈవెంట్లు, సెలబ్రేషన్లు, ఇతర వేడుకలకు టూరిజం హోటళ్లకు రాత్రి ఒంటిగంట వరకు అనుమతులనిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పలు సడలింపునిచ్చింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఈవెంట్ల నిర్వహణకు ఆబ్కారీ శాఖ తాత్కాలిక లైసెన్సులు జారీ చేయనుంది. అయితే ఈవెంట్‌లలో పాల్గొనే వారి సంఖ్యను బట్టి కనీస ఫీజు రూ.50 వేలు కాగా, అత్యధికంగా రూ.2.50 లక్షలు తాత్కాలిక ఫీజు కింద ఆబ్కారీ శాఖ వసూలు చేయాలని నిర్ణయించింది.
మెమో జారీ చేసిన సిఎస్
అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం దుకాణాల్లో రాత్రి ఒంటిగంట వరకు బార్లు, ఈటెంట్లు, టూరిజం హోటళ్లలో మద్యం సరఫరా చేయవచ్చని ఈ ఉత్తర్వులు డిసెంబర్ 31తో పాటు జనవరి 1వ తేదీ వరకు కొనసాగుతాయని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సిఎస్ సోమేష్ కుమార్ మెమో 33833ను జారీ చేశారు.
ఈనెలలో 28 రోజులకు రూ.2,886 కోట్ల ఆదాయం
ఈ ఏడాది డిసెంబర్ నెలలో రూ. 3,500 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగే అవకాశాలున్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 2016 డిసెంబర్‌లో రూ.1,399కోట్లు, 2017లో రూ. 1,644కోట్లు 2018లో రూ. 1,961కోట్లు, 2019లో రూ.2,046కోట్లు, 2020లో డిసెంబర్ నెలలో రూ.2,765 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. దసరాకంటే నూతన ఏడాది వేడుకల్లోనే మద్యం వినియోగం, విక్రయాలు ఎక్కువగా జరిగాయని ఎక్సైజ్ గణాంకాలను బట్టి తెలుస్తోంది. (ఈనెల 28వ తేదీ) మంగళవారం రాత్రి వరకు 28 రోజులకు గాను రూ.2,886కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
2020 అక్టోబర్‌లో దసరాకు రూ.2,623కోట్ల మద్యం అమ్మకాలు
ఇందులో ఐఎంఎల్ 34,43,434 పెట్టెలు, బీర్లు 28,11876 పెట్టెలను విక్రయించినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 2014-,15లో ఏడాది మొత్తం విక్రయాలు రూ.10,880కోట్లుకాగా, గతేడాది ఇది. రూ. 28వేల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది రూ.35వేల కోట్లకుపైగా చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 404 మద్యం దుకాణాలు, 159 బార్లకు అదనంగా అనుమతులు జారీ చేయడంతో విక్రయాలు పుంజుకున్నాయి. దీంతో ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా 20 శాతంపైగా విక్రయాలు పెంచుకునేందుకు ఆబ్కారీ శాఖ ప్రణాళికలు వేసింది. 2020 డిసెంబర్‌లో రూ.2765 కోట్ల మద్యాన్ని ఎక్సైజ్ శాఖ విక్రయించగా ఇది ఎక్సైజ్ చరిత్రలో అత్యధిక విక్రయంగా నమోదయ్యింది. 2020 అక్టోబర్‌లో దసరా సందర్భంగా రూ.2,623కోట్లు మద్యం అమ్ముడుపోయింది.