గురుకులాలకు పౌష్టికాహార సరఫరా బాధ్యత మహిళా సంఘాలకే
ఆడపడుచుల ఆశీర్వాదంతో చంద్రగ్రహణం తొలగింది మహిళల
జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయి కోటి మంది మహిళలకు లక్ష
కోట్ల రుణం అందిస్తాం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వ్యాపారంలో మన ఆడపడుచులు
అదానీ, అంబానీలతో పోటీ పడుతున్నారు స్వయం సహాయక
సంఘాల సభ్యుల వయోపరిమితి సడలింపు కనిష్ఠం 18 నుంచి
15కు తగ్గించాలి గరిష్ట వయస్సు 60 నుంచి 65కు పెంచాలి
కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు అందిస్తాం
ఇందిరా మహిళా శక్తి సదస్సులో సిఎం రేవంత్ రెడ్డి ఇందిరా
మహిళా శక్తి మిషన్2025 ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
మన తెలంగాణ/హైదరాబాద్: పదేళ్లుగా రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందని, ఇప్పుడు చంద్రగ్రహణం తొలగడంతో తెలంగాణ మహిళలు స్వేచ్ఛగా ఉన్నారని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆడబిడ్డలు రా ణీరుద్రమ, చాకలి ఐలమ్మల స్ఫూర్తితో మహిళా శక్తిని చాటారని, రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డలు తమ ఆత్మగౌరవాన్ని చాటుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపా రు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీదని, సోనియాగాంధీ చట్టసభ ల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని, ఇప్పటికై నా రాజకీయాల్లో మహిళలు రాణించాలని సిఎం రే వంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహిళా స్వయం సహాయ క సంఘాలను బలోపేతం చేసినప్పుడే రాష్ట్రం ఆర్ధికం గా పురోగమిస్తుందని ఆయన తెలిపారు. కోటిమంది మహిళలకు లక్ష కోట్ల రుణం అందిస్తామని సిఎం రేవంత్ తెలిపారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసినప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వన్ ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన అన్నారు.
టన్నెల్ కూలితే, పంటలు ఎండితే బిఆర్‌ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని, వాళ్ల పైశాచిక ఆనందం కోసం తనను తిడుతున్నారని, ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. మీ అనుభవంతో సూ చన చేయాలని, కానీ, పైశాచిక ఆనందం పొందడం మం చిది కాదని, పైశాచిక ఆనందం పొందేవారు బాగుపడినట్టు చరిత్రలో లేదన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్ర భుత్వ పాఠశాలలు ఉండాలని వాటి నిర్వహణ మహి ళా సంఘాలకు అప్పగించామని ఆయన తెలిపారు. కోటి 30లక్షల జతల స్కూల్ యూనిఫాం కుట్టే పనిని ఆడబిడ్డలకు అప్పగించామని ఆయన పేర్కొన్నారు. మహిళా సంఘాల సమావేశాల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో రూ. 25 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌లను వారికి అప్పగించామని, ఆర్టీసి బస్సులకు మహిళలను యజమానులను చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసికి అద్దెకు ఇచ్చి మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకరిస్తోం దన్నారు. రాబోయే రోజుల్లో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు మహిళలు యజమానులు కాబోతున్నారని ఆయన తెలిపారు.
ఆడబిడ్డల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది
సమాజానికి సేవచేయాలని మహిళలకు సిఎం రేవంత్ సూచించారు. మహిళలకు అండగా నిలబడింది ఇందిరమ్మ రాజ్యం కాదా ఒక్కసారి ఆలోచించాలని మహిళలకు సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఆడబిడ్డల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గోడౌన్స్‌ను నిర్మించే బాధ్యత తాను తీసుకుంటానని, మిల్లుల్లో ధాన్యాన్ని బొక్కుతున్న పందికొక్కులకు, దొంగలకు బుద్ధి చెబుతామని ఆయన పేర్కొన్నారు. మహిళలకు ప్రభుత్వమే స్థలం ఇస్తుందని, రుణాలు ఇస్తుందని, మీరే గోడౌన్స్ నిర్మించుకోవాలని, వ్యాపారవేత్తలుగా మారాలని, మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత తనదని, ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడేలా తీర్చి దిద్దుతామని సిఎం రేవంత్ అన్నారు. ఆనాటి ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తి ఈ నాటి మీ రేవంతన్న స్ఫూర్తితో మీరు ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా మీరు వ్యాపారాల్లో ముందుకెళ్లాలని ఆయన సూచించారు. తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని తాను ప్రయత్నిస్తున్నానని ఆయన తెలిపారు.
రూ.22 వేల 794 కోట్ల 22 లక్షల చెక్కు అందజేత
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు (2,82,552 సంఘాలు) 22 వేల 794 కోట్ల 22 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందచేశారు. మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా పథకాల ద్వారా రూ.44 కోట్ల 80 లక్షలను ( రూ.44,80,00,000) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘాలకు అందజేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే సోలార్ ప్లాంట్స్‌కు వర్చువల్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
150 ఆర్టీసి అద్దె బస్సులను ప్రారంభించిన సిఎం
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సమీపంలోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలివిడతలో 150 ఆర్టీసి అద్దె బస్సులకు సిఎం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడ మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను మంత్రులు సీతక్క, పొన్నం తదితరులతో కలిసి సిఎం రేవంత్ సందర్శించారు. మహిళా పెట్రోల్ బంకుల నమూనాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే సోలార్ ప్లాంట్ల నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహకులను సిఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజుకు రూ.15 వేల వ్యాపారం జరుగుతోందని నిర్వాహకులు సిఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మాలక్షం: డిప్యూటీ సిఎం
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పది సంవత్సరాలు పరిపాలన చేసిన బిఆర్‌ఎస్ ఏరోజు మహిళా అభ్యున్నతి గురించి, డ్వాక్రా సంఘాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పెద్ద పీట వేశామన్నారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్నామని డిప్యూటీ సిఎం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించిన ఐకేపి పథకాన్ని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఐకెపి, స్వయం సహాయక సంఘాల గురించి మాట్లాడటానికి కూడా అసెంబ్లీలో గత పాలకులు ప్రతిపక్ష పార్టీ నాయకులకు సమయం ఇవ్వకుండా నియంతృత్వంగా వ్యవహారించారన్నారు. పది సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ ఆదాయం, చేసిన ఏడు లక్షల కోట్ల అప్పును పంది కొక్కుల తిన్నారే తప్పా, మహిళల ఆర్దిక సాధికారతకు ఏమి చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.10 వేల కోట్లు కూడా మహిళా సంఘాలకు బిఆర్‌ఎస్ కేటాయించలేదు
ఇందిరమ్మ రాజ్యం వస్తే ఆశలు నెరవేరుతాయన్న మహిళల ఆకాంక్షలను ప్రజా ప్రభుత్వ నెరవేరుస్తుందని ఆయన హామీనిచ్చారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఈ ఏడాది 20వేల కోట్ల రుణాలు వడ్డీ లేకుండా ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయిస్తే ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీ రూ.20వేల కోట్లు ఇవ్వడం సాధ్యమేనా అంటూ హేళన చేస్తూ నవ్వారని ఆయన వాపోయారు. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పాలకులు పందికొక్కుల్లా ప్రభుత్వ ఖజానాను తిన్నారని ఆయన ఆరోపించారు. పది సంవత్సరాల కాలంలో కనీసం రూ.10 వేల కోట్లు కూడా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. కానీ, రూ.20వేల కోట్ల రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామని చెప్పిన ప్రజా ప్రభుత్వం రూ.21 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని, 21 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం అనేది ఆషామాషీ కాదని ఆయన తెలిపారు.