వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా పరిగణిస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లించనున్నట్లు ప్రకటించింది. గతంలో వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియాను మాత్రమే అందించేవారు. అయితే, ఇప్పుడు రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద ఆ మొత్తాన్ని రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వడగాల్పుల ప్రభావం నుంచి రక్షించుకోవడానికి స్థానిక అధికారులు జారీ చేసే ఆరోగ్య సూచనలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎండలో ఎక్కువ సమయం గడపకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. వడదెబ్బ ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి, సంబంధిత ఆరోగ్య శాఖలు, విపత్తు నిర్వహణ సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నాయి. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు ఈ అవగాహన చర్యలు కొనసాగనున్నాయి. ఈ చర్యల ద్వారా ఎండల కారణంగా ప్రాణ నష్టాన్ని నివారించడమే కాక, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఉదయం 11 నుంచి 5 గంటల వరకు వేడిగాల్పులు
ప్రస్తుతం రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 11 నుంచి 5 గంటల వరకు వేడిగాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఔట్‌డోర్‌లో పనిచేసే కార్మికులను రక్షించడానికి ప్రస్తుతం ప్రభుత్వ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వడగాల్పులను ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. వడగాల్పుల మరణాలపై జాతీయ స్థాయిలో నష్టపరిహారం చెల్లించే పాలసీ లేదు. కొన్ని రాష్ట్రాలు మాత్రమే పరిహారం చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కూడా ఆ జాబితాలో చేరిపోయింది.
జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం- 2005 కింద వడదెబ్బను ప్రకృతి విపత్తుగా కేంద్రం గుర్తించకపోవడం గమనార్హం. ఒక వ్యక్తి వడ దెబ్బతో చనిపోయారో లేదో తెలుసుకునేందుకు డాక్టర్లు పోస్టుమార్టం చేస్తారు. ఆ తరువాత పిహెచ్‌సి డాక్టర్, ఎమ్మార్వో, ఎస్‌ఐలతో కూడిన కమిటీ ధ్రువీకరించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుంది. పోస్ట్‌మార్టం చేయకుంటే నష్ట పరిహారం అందదు.