హైదరాబాద్లో ప్రత్యేకించి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు 100 అడుగుల విగ్రహం ప్రతిష్టాపనకు, ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా స్థలం కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు. గురువారం ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్థన్, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ సభ్యులు మధుసూదన రాజు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా గత ఏడాదిన్నర కాలంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను టి.డి.జనార్థన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు.
హైదరాబాద్లో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పాలన్న తమ సంకల్పాన్ని వివరించి దానితోపాటు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని, ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని, ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వం తరపున స్థలాన్ని కేటాయించి సహకరించాలని టి.డి.జనార్థన్, నందమూరి రామకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని, ఆయన 100 అడుగుల విగ్రహం హైదరాబాద్లో ప్రతిష్టించాలన్న ప్రతిపాదనకు తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూల స్పందనకు ఎన్టీఆర్ అభిమానులందరూ సంతోషిస్తారని పేర్కొంటూ ఆయనకు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ తరపున టి.డి.జనార్ధన్, వైస్ ఛైర్మన్ డి.రామ్మోహన్ రావు ధన్యవాదాలు తెలిపారు.