Sunday, March 23, 2025

దొడ్డుకు స్వస్తి ..

- Advertisement -
- Advertisement -

ఉగాది రోజు మట్టపల్లి లక్ష్మీనర్సింహుని
సన్నిధిలో ఆరంభం పౌర సరఫరాల
శాఖ మంత్రి ఉత్తమ్ ఇలాకాలో
ప్రారంభించనున్న సిఎం రేవంత్‌రెడ్డి
స్వయంగా మహిళలకు బియ్యం
పంపిణీ చేయనున్న రేవంత్, ఉత్తమ్
ఏప్రిల్ నెల నుంచి అంతటా
సన్నబియ్యమే

మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో: దారిద్య్ర రేఖకు దిగువన (బిపిఎల్) ఉన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ షాపుల వద్ద దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు.. పగలంతా కాయాకష్టం చేసిన ప్రజలు ఆబియ్యం తినలేక ఇబ్బందులుపడుతున్నారు.. పేదల కష్టాలను గమనించిన సర్కారు దొడ్డు బియ్యానికి స్వస్తి పలికి సన్నబియ్యం ఇచ్చేందుకు సన్నద్ధమైంది. ఈ ఏడాది జనవరి మాసంలోనే రేషన్‌షాపుల్లో ప్రారంభించాల్సి ఉన్నా అప్పుడు వీలుపడలేదు. అయితే ఏప్రిల్ మాసం నుండి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఈనెల ౩౦వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఆహార, పౌరసరఫరాల శాఖమంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇలాకా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆరంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మట్టపల్లిలోని రేషన్‌షాపులో మహిళలకు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి,

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల చేతులమీదుగా పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ నెల నుండి తెలంగాణలోని అన్నిరేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఉగాది రోజు ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ గురువారం మట్టపల్లిలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతేకాకుండా భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా పెద్ద ఎత్తున మహిళలను తరలించడం.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభావేదిక నుండి ప్రసంగించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలిసారి సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. అదికూడా మంత్రి ఉత్తమ్ ఇలాకాలో పర్యటిస్తుండటం గమనార్హం. ఇక నుండి తెలంగాణలోని అన్ని రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యానికి స్వస్తి పలికి సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో పేదప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మట్టపల్లిలో భారీ బహిరంగ సభ
ఉగాది పర్వదినం రోజున సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన అనంతరం మట్టపల్లిలో భారీ బహిరంగసభకు ఫ్లాన్ చేస్తున్నారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలతో పాటు సూర్యాపేట జిల్లా, నల్లగొండ జిల్లాలోని చుట్టుపక్కల ప్రాంతాల నుండి కేడర్‌ను కదిలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా మహిళలను పెద్దసంఖ్యలో తరలించే పనిలో ఉన్నారు. ఈ సభావేదిక నుండి సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు. 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ వంటి పథకాలతో జరిగిన లబ్ధిని ప్రజలకు తెలియచేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News