Saturday, December 21, 2024

పంట పొలాల్లో క్షీరాభిషేకాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఏకకాలంలో రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. గాంధీ భవన్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్నిచోట్ల సిఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పలు జిల్లాలో జరిగిన సంబురాల్లో మంత్రులతో పాటు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లు పాల్గొని ఈ సంబురాలను విజయవంతం చేశారు. ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు.

గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఫిషర్‌మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, అధికార ప్రతినిధులు సత్యం శ్రీరంగం, కమల్ తదితరులు పాల్గొన్నారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 560 రైతు వేదికల్లో రైతులు, కాంగ్రెస్ నేతలు ఈ సంబురాల్లో పాల్గొన్నారు. ఇక నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి ట్రాక్టర్ నడుపుతూ రైతులతో కలిసి రైతువేదిక వద్దకు చేరుకోగా, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎండ్ల బండిపై రైతువేదిక వద్దకు చేరుకొని ఈ సంబురాల్లో పాల్గొన్నారు.

ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదిక వద్దకు మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండలో జరిగిన సంబురాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో ఈ రోజు నల్గొండ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొందని రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారన్నారు. నల్గొండ నియోజకవర్గంలో 8,358 ఖాతాల ద్వారా 7,890 కుటుంబాలకు రుణమాఫీ కోసం ప్రభుత్వం 46.16 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. అలాగే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 83,121 ఖాతాల ద్వారా 78,757 కుటుంబాలు రుణమాఫీ పొందారన్నారు. ఇందుకోసం రూ. 481.63 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటుగా జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సహకారంతో నల్లగొండ జిల్లాకు రూ.481.63 కేటాయించినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

విపక్షాలకు మాట్లాడే నైతిక అర్హత లేదు: మంత్రి సీతక్క
రుణమాఫీపై పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ రైతన్నకు రుణ విముక్తి, తెలంగాణ ప్రగతికి నాంది అని ఆమె అన్నారు. రైతురాజ్యం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే సాధ్యమన్నారు. కెసిఆర్ పదేళ్లలో చేయలేనిది తాము కేవలం నెలన్నరలో చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. విపక్షాలకు మాట్లాడే నైతిక అర్హత లేదని, వరంగల్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో రైతులకు ఇచ్చిన రుణ మాఫీ హమిని నిలబెట్టుకున్నామని ఆమె తెలిపారు.. దేశచరిత్రలో కనీవిని ఎరుగని విధంగా అన్నదాతలకు ఏక కాలంలో రూ. రెండు లక్షల వరకు పంట రుణాల మాఫీ చేసుకుంటున్న శుభసందర్భం ఇది అని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రుణమాఫీలో హుస్నాబాద్‌కు ద్వితీయ స్థానం లభించింది: మంత్రి పొన్నం
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేసిన లక్ష రూపాయల రుణమాఫీలో హుస్నాబాద్‌కు ద్వితీయ స్థానం లభించిందని, ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ అమలు చేసిందని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈరోజు లక్ష రూపాయల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేసిన జాబితాలో రాష్ట్రంలోనే హుస్నాబాద్ ద్వితీయ స్థానంలో నిలిచింది. లక్ష రూపాయలు రుణమాఫీ అమలు అయినా వాటిలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 18,907 ఖాతాల్లో 18,101 కుటుంబాలకు 106 కోట్ల 74 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని ఆయన తెలిపారు. రుణమాఫీతో పండుగ జరుపుకుంటున్న రైతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

70 లక్షల మంది రైతులకు మేలు: టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
ఏకకాలంలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ దేశ చరిత్రలోనే మొదటిసారి అని టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపి మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీలో ప్రక్రియ ప్రారంభించి, ఇందులో భాగంగా గురువారం రూ.లక్ష రుణమాఫీ చేపట్టడం పై హర్షం వ్యక్తం చేస్తూ గాంధీభవన్‌లో నిర్వహించిన సంబురాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీతో పాటు మధుయాష్కీ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు తమ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రైతు డిక్లరేషన్‌లో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. రైతులంతా సంతోషంతో పండుగ చేసుకుంటున్నారని రుణమాఫీ ప్రారంభించిన జూలై 18వ తేదీ రైతుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

ఎడ్లబండిపై పరకాల ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని దానికి నిదర్శనం ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలేనని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటి నిలబెట్టుకున్నారని అన్నారు. గురువారం ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో బైక్‌లతో ర్యాలీ నిర్వహించి అనంతరం రైతులతో ఎండ్ల బండ్లతో రైతు రుణమాఫీ సంబురాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు పూర్తి రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, కానీ, అంతకంటే నెలరోజుల ముందే ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నేడు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసి 7వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు.

ఇది చారిత్రాత్మక నిర్ణయం: మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలు రైతు రుణమాఫీ అమలు చేస్తోందన్నారు. రైతు రుణమాఫీ గురించి గతంలో చాలా ఆందోళనలు జరిగినా ఎవ్వరూ ఇంత ధైర్యం చేయలేదని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఇక కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో నిర్వహించిన సంబురాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News