చాంద్రాయణగుట్ట : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆదివారం పాతబస్తీలోని పోలింగ్ కేంద్రాలలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. తొలుత పోలింగ్ కొంత మందకొడిగా ప్రారంభమైనా గంట గంటకు పుంజుకుంది. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటర్లు బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దివ్యాంగులు సైతం ఎంతో ఉత్సహాంతో పోలింగ్‌లో పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వీల్ చైర్లో కూర్చొని ఓటు వేశారు. పోలింగ్ అధికారులు ఓటర్లను థర్మల్ స్క్రీనింగ్ చేసి, శానిటైజర్, మాస్కులు ఉపయోగించిన వారినే ఓటు వేసేందుకు అనుమతించారు. సెల్‌ఫోన్లను అనుమతించలేదు. పోలీసు ఉన్నతాధికారులు తరచూ పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. కాగా ఫలక్‌నుమా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు 604,604ల వద్ద ఓటర్లు ఎండలో నిరీక్షించాల్సి వచ్చింది. షామియానాలు ఏర్పాటు చేయకపోవటంతో ఉదయం 9 గంటల నుండే చురచురలాడిన ఎండలో నిలబడ్డారు. మధ్యాహ్నం వేళ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో క్యూలైన్లను భవనం వరండాలోకి మార్చారు.
పాతబస్తీ ఫలక్‌నుమా డివిజన్లోని చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో చాంద్రాయణగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాల, ఛత్రినాక పోలీసుస్టేషన్ పరిధిలో ఫలక్‌నుమా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, గౌలిపురా మిత్రా క్లబ్ ప్లే గ్రౌండ్ (ఆలె నరేంద్ర స్పోర్ట్ కాంప్లెక్స్) పోలింగ్ కేంద్రాలను దక్షిణ మండల డీసీపీ గజారావు భూపాల్, ఏసీపీ మహ్మద్ మజీద్, ఇన్‌స్పెక్టర్లు రద్రు భాస్కర్, సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీలతో కలిసి సందర్శించారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. సాయంత్రం నాలుగు గంటల వరకు చాంద్రాయణగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 58 శాతం, సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో 53 శాతం పోలింగ్ నమోదైయ్యింది. ఫలక్‌నుమా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 62.3 శాతం, గౌలిపురా మిత్రాక్లబ్ మైదానంలో 66.7 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి స్వల్ప సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పోలింగ్ బాక్సులలో భవిత భద్రం….
గత రెండు నెలలుగా కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడికి తెరపడింది. ఆదివారం జరిగిన పోలింగ్‌లో ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం పోలింగ్ బాక్సులలో నిక్షిప్తం చేశారు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావటం ఎవరికి లాభించనుందో అంచనా వేయటం కష్టంగా మారింది. ఈనెల 17న జరిగి ఓట్ల లెక్కింపులో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారన్న విషయం స్పష్టం కానుంది. అభ్యర్థుల భవిష్యత్తు తేలనుంది.