మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ చెస్ చాంపియన్ షిప్ టోర్నమెంట్లో తెలంగాణా గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరైగైసీ ఆధిక్యంలో ఉన్నాడు. మంగళవారం కాన్పూర్ లో జరిగిన టోర్నమెంట్ లో తొమ్మిదవ రౌండ్ లో తమిళనాడు గ్రాండ్ మాస్టర్ వి.ప్రణవ్ పై అరవై ఎత్తులలో విజయం సాధించాడు. దాంతో 7.8 పాయంట్లతో అర్జున్ టాప్ లో నిలిచాడు. అంతకు మునుపు ఎనిమిది రౌండ్లలో డిఫెండింగ్ చాంపియన్ అరవింద్ చిదంబరం, గణేశ్, ఇనియన్ లతో కలిసి సమాన ఆధిక్యంలో కొనసాగిన అర్జున్ తొమ్మిదవ రౌండ్ విజయంతో వారిని అధిగమించాడు. ఆంథ్రప్రదేశ్ ఆటగాడు ఎం.ఆర్ లలిత్ బాబు 6.5 పాయంట్లతో ఉమ్మడిగా మూడవ స్థానంలో కొనసాగాకా, తొమ్మిదవ రౌండ్లో అబిజిత్ గుప్తాతో అతను ఆడిన ఆట డ్రా అయింది. తదుపరి రౌండ్లలో ఇనియన్, గణేశ్ ల మధ్య జరిగిన ఆటతో పాటూ అరవింద్, స్వప్నిల్ ల ఆట కూడా డ్రా అయింది. వీరందరినీ దాటుకుని అర్జున్ తొమ్మిదవ రౌండ్లో గెలుపొందాడు. తెలంగాణ రాష్ట్రం తరఫున అనేక జాతీయ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో పోటీ చేసిన అర్జున్, భారతదేశపు 54వ గ్రాండ్ మాస్టర్ గా గుర్తింపు పొందాడు.