Thursday, January 23, 2025

పెద్ద రాష్ట్రాలను తలదన్నిన ప్రగతి

- Advertisement -
- Advertisement -

చిటికెన వేలు మీద కొండను ఎత్తడం సాధ్యమా అంటే అసాధ్యమేనని చెప్పకతప్పదు. అది పౌరాణిక ఘట్టం కాబట్టి దానిని ఒక ఊహా సన్నివేశంగానే పరిగణిస్తాము. కల్పిత కథగానే దీనిని చాలా మంది చూస్తారు. ఆధునిక కాలంలో అటువంటి లక్షాలు అసాధ్యమైనవేవీ కావని కొన్ని సందర్భాలు రుజువు చేస్తాయి. తెలంగాణ దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల కంటే కొత్తది. అదే సమయంలో పెద్ద రాష్ట్రాలతో పోటీపడుతూ వాటిని తలదన్నేలా ముందుకు సాగిపోతున్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. చిన్నదైనా మిన్నదే నని అనిపించుకొంటున్న ఒక అద్భుతం ఈనాటి తెలంగాణ. పాలకులకు దృఢమైన సంకల్పబలం వున్నది కాబట్టే కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అతి పెద్ద లక్షాలను అనుకొన్న తడవుగానే సాధించుకొని తెలంగాణ వాటిని తన కీర్తి కిరీటాలు చేసుకొన్నది. కలలు కనడమే కాదు వాటిని రూపుకట్టించుకోడం కూడా సాధ్యమేనని తొమ్మిదేళ్ళ ప్రస్థానంలో తెలంగాణ ప్రపంచమంతటికీ చాటి చెప్పింది.

నీతి ఆయోగ్ 201819లో ఆరోగ్యరంగంలో కేరళ, తమిళనాడు తర్వాత మూడవ స్థానంలో తెలంగాణను నిలబెట్టింది. అంటే పెద్ద రాష్ట్రాలతో పోటీపడి నెగ్గడమనే అరుదైన అపురూప లక్షణాన్ని మన రాష్ట్రం నిరూపించుకొన్న తీరు నిరుపమానమైనది, సాటిలేనిది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఎప్పటివో, ఎంత అనుభవమున్న రాష్ట్రాలో వివరించి చెప్పనక్కర లేదు. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలనూ మించిపోయి ఆరోగ్య రంగంలో ఆ రెండు రాష్ట్రాల సరసన మూడవ విజేతగా నిలబడడం సాధారణమైన విషయం కాదు. అలాగే 201819, 201920 సంవత్సరాలలో వివిధ ఆరోగ్య సేవలలో ఘనమైన, గణనీయమైన రికార్డును సాధించుకొన్న రాష్ట్రాలుగా తెలంగాణను, మిజోరాంను నీతి ఆయోగ్ ఎంపిక చేసింది. బాలలందరికీ టీకాలు వేయించిందని, గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వెల్‌నెస్ సెంటర్లుగా తీర్చిదిద్దిందని నీతి ఆయోగ్ తెలంగాణను మెచ్చుకొన్నది.

వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణ వాణిజ్య పరంగా ఎంతో విలువైన పంటలు పండించడంలో కూడా అగ్ర భాగాన వున్నది. చింత పండు ఉత్పత్తిలో మొదటి స్థానం, పత్తి సాగులో రెండవ స్థానం, కోడి గుడ్లలో మూడవ స్థానం, మాంసం ఉత్పత్తిలో ఐదవ స్థానం, పాడిలో 13వ స్థానం సాధించుకోగలిగింది. ఇంకా బాల్య దశలోనే వున్న రాష్ట్రానికి ఇవన్నీ అలవి అయ్యే పనులేనా? మామూలుగా అయితే అలవి కానివే, కాని తన విషయంలో మాత్రం సుసాధ్యమేనని తెలంగాణ రుజువు చేసుకొన్నది. రాష్ట్రంలో చిరు ధాన్యాల ఉత్పత్తి 30 లక్షల టన్నులకు చేరుకొన్నదంటే మాటలా? తాజాగా ఆయిల్ పామ్ సాగులో రికార్డు సృష్టించే లక్షాన్ని చేపట్టింది. 2014 జూన్ నుంచి 2023 జనవరి వరకు సేకరించిన సమాచారం ప్రకారం ఇ లావాదేవీల్లో తెలంగాణయే ప్రథమ స్థానంలో వున్నది. ప్రతి 1000 మంది జనాభాకు లక్ష 58 వేల ఇ లావాదేవీలతో తెలంగాణ మొదటి స్థానంలో వుండగా, లక్ష 41 వేల ఇ లావాదేవీలతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో, లక్ష 25 వేల ఇలావాదేవీలతో కేరళ మూడవ స్థానంలో వున్నాయి. ఐటి హబ్‌గా మన రాష్ట్రంతో పోటీ పడుతున్న కర్ణాటక కేవలం 22,486 ఇ లావాదేవీలతో 13వ స్థానంలో వుండడం గమనించవలసిన విషయం.

ఈ విధంగా రాష్ట్రం డిజిటల్ పాలనలో దేశంలోనే అగ్ర భాగాన నిలవడం అసాధారణ విజయం కాదా? అత్యధిక డిజిటల్ డెలివరీ సామర్థం రీత్యా భారత దేశం ప్రపంచానికే అతి ముఖ్యమైనది అవుతున్నదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హైదరాబాద్ వైపు చూపుతూ పేర్కొనడం గర్వించదగిన విషయం. సంప్రదాయకమైన మంచి నీటి సరఫరా, చెరువుల ఆధునికీకరణ, వ్యవసాయం వంటి రంగాలలోనే కాకుండా అత్యాధునికమైన ఐటి, ఇ గవర్నెన్స్ వంటి రంగాలలోనూ రాష్ట్రం ముందంజలో పరుగెడుతున్నది. వయసులో చిన్న అయినా కృషిలో, లక్ష సాధనలో అనితరమైనదని తెలంగాణ చాటుతున్నది. కేంద్రం తెలంగాణను పట్టించుకోకపోడం అందరికీ ఎరుకే. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల వాటాను కూడా సకాలంలో ఇవ్వకుండా బాధపెడుతున్న సందర్భాలు అనేకం. రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు గుర్తు చేసినా వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల పాటు రాష్ట్రానికి రావాల్సిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను కేంద్రం విడుదల చేయలేదు. ఇందుకు సంబంధించి కేంద్రం చెల్లించవలసిన బకాయిలు రూ.1350 కోట్లకు చేరుకొన్నాయి. అయినా అభివృద్ధిలో కుంటుపడకపోడమే తెలంగాణ ఘనత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News