Friday, November 22, 2024

తాటిపండు తీసుకొని ఈతపండు ఇచ్చింది

- Advertisement -
- Advertisement -

కేంద్రానికి పన్నుల ఆదాయం రూ.18.10 లక్షల కోట్లు
ఒక్క తెలంగాణ నుంచే రూ.1.62లక్షల కోట్లు 
రాష్ట్రానికి ఇచ్చింది కేవలం రూ.19668వేల కోట్లు 
కొవిడ్ టీకాల విషయంలోనూ కేంద్రం కక్కుర్తి 
బడ్జెట్‌లో రూ.89,155 కోట్లు 
అయినా వ్యాక్సిన్లను రాష్ట్రాలే కొనుగోలు చేయాలని తాజా ఆదేశాలు వ్యాక్సిన్లు ఇవ్వదూ..
బకాయిలు ఇవ్వదూ రాష్ట్రాలను వేధిస్తున్న కేంద్రం

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాలు పోషిస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తోందనే విమర్శలుతా రాస్థాయిలో ఉన్నాయి. రాష్ట్రాల ఆర్థ్ధిక వ్యవస్థలకు వెన్నుదన్నుగా ఉండాల్సిన కేంద్రమే రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వాల్సిన నిధుల విడుదల విషయం లో అనేక రకాల దొడ్డిదారి విధానాలు, అంకెల గారడీలతో భారీగా గండికొడుతోందని ఆర్థ్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. పోనీ రాష్ట్రాలకూ ఏమైన సహకరిస్తున్నారా… అంటే అదీలేదని, అన్ని విషయాల్లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహాయ నిరాకరణనే పాటిస్తోందని, మరో విధంగా చెప్పాలంటే రాష్ట్రాలను ఏకపక్షంగా, మొండిగా వేధింపులకు గురిచేస్తోందని ఆ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడంలేదని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకూ నిధులు ఇవ్వలేదని, చివరకు రుణాల సేకరణకు కూడా కేంద్రం రాజకీయపరమైన కారణాలతోనే అడ్డుపడిందని అంటున్నారు.

తాజాగా కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు సహకరించాలని, కనీసం 15 లక్షల డోస్‌ల వ్యాక్సిన్స్ ఇవ్వాలని, అందుకయ్యే ఖర్చు మహా అయితే రూ.44 .25 కోట్ల మాత్రమే ఉంటుందని, అందుకు కూడా కేంద్రం సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తెలంగాణకే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ వ్యాక్సిన్స్ ఇవ్వమని, ప్రతి రాష్ట్రమూ సొంత నిధులతోనే వ్యాక్సిన్‌లను కొనుగోలు చేసుకోవాలని కేంద్రం కఠోర నిర్ణయం తీసుకొందని వివరించారు. పైగాదేశంలో కొవిడ్-19 నివారణకు 2023 -24వ ఆర్థ్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.89,155 కోట్ల నిధులను బడ్జెట్‌లో కేటాయించిందని, మరి ఈ నిధులను వ్యాక్సిన్‌లకు కాకుండా ఇక ఏ విధంగా ఖర్చు నిధులను వ్యాక్సిన్‌లకు కాకుండా ఇక ఏ విధంగా ఖర్చు చేస్తారో ఎవ్వరికీ అర్ధంకావడంలేదని ఆ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

2022-23వ ఆర్థ్ధిక సంవత్సరంలో గత మార్చి నెలాఖరు వరకూ కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రికార్డుస్థాయిలో రూ.18.10 లక్షల కోట్ల నిధులు కేవలం జిఎస్‌టి పన్నుల ఆదాయం రూపంలో వచ్చాయని, ఇదొక సంచలనమని ఆ అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి ఏడు రకాల పన్నులు, సెస్, సర్‌చార్జి, పెట్రోల్, డీజిల్ ధరలు, వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్‌ల ధరలు, ఎగుమతులు, దిగుమతుల పన్నులు… ఇలా రకరకాల పేర్లతో ఉన్న పన్నులు, అధిక ధరల రూపంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2022-23వ ఆర్థ్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు ఏకంగా ఒక రూ.1.62 లక్షల కోట్ల నిధులను చెల్లించారని ఆ అధికారులు వివరించారు.

తెలంగాణ ప్రజలు కేంద్రానికి ఇంత పెద్ద మొత్తం నిధులు ఇస్తే కేంద్రం మాత్రం తెలంగాణ రాష్ట్రానికి పన్నుల ఆదాయంలోని వాటాగా కేవలం రూ.19,668 కోట్ల నిధులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు 41 శాతం (ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం) నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. న్యాయంగా, నిజాయితీగా లెక్కలుగట్టినా, ప్రస్తుతం అమలులో ఉన్న సబ్సిడీల విధానాన్ని పరిశీలించినా, రాష్ట్రాల్లో అమలులో ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు అమలు జరుగుతున్న తీరును నిజాయితీగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వ స్వాహాకాండ ఇట్టే అర్థమవుతుందని ఆ అధికారులు వివరించారు.

కేంద్ర పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటా రికార్డుల ప్రకారం 41 శాతం అమలుచేస్తున్నట్లుగా చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం 29.6 శాతమే నిధులు వస్తున్నాయని గతంలో రాష్ట్ర ఆర్థ్ధికశాఖ మంత్రి టి.హరీష్‌రావు గణాంకాలతో సహా వివరించారు. న్యాయంగా లెక్కలు కడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఫార్మా కంపెనీలు, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారి దగ్గర్నుంచి బహుళజాతి కంపెనీల స్థాయిలోని ప్రముఖల వరకూ నీతి, నిజాయితీ అన్ని రకాల పన్నులు చెల్లించడం మూలంగానే తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వ ఖజానాకు ఏకంగా ఒక లక్షా 62 వేల కోట్ల రూపాయల నిధులు వెళ్ళాయని వివరించారు. అందులో రాష్ట్రాల వాటా 41 శాతం నిధులు ఇవ్వాలనే లెక్కన తెలంగాణ రాష్ట్రానికి సుమారు 66 వేల కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉందని వివరించారు. అయితే ఇలా నిజాయితీగా రాష్ట్రాలకు వాటాలు ఇవ్వకుండా ఎగనామం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన పన్నులను వసూలు చేసుకొంటూ ఖజానాను ఏటా 27 లక్షల కోట్ల రూపాయలతో నింపుకుంటోందని ఆ అధికారులు వెల్లడించారు.

పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు వాటాలుగా ఇవ్వాల్సిన నిధుల్లో భారీగా కోతలు విధించడానికే సెస్, సర్‌చార్జిల రూపంలో పెద్దమొత్తాల్లో దేశ ప్రజల నుంచి అదనపు పన్నుల రూపంలో నిధులను వసూలు చేస్తోందని, ఇదంతా బహిరంగంగా జరుగుతున్న భారీ దోపిడీ అని మండిపడ్డారు. ఇవే అంశాలపై ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, ఒడిషా, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఆర్థ్ధికశాఖల మంత్రులు, ఎంపిలు పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీశారు కూడా. అయినా తనకేమీ పట్టనట్లుగా కేంద్రం తన దోపిడీ స్వామ్యాన్ని కొనసాగిస్తూనే ఉందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాల్లో అమలులో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేయడమే కాకుండా, వాటిల్లో భారీగా కోతలు విధించడం, సబ్సిడీల భారాన్ని తగ్గించుకొని ఆ లోటులను రాష్ట్రాలపై రుద్దుతూ వేధింపులకు గురిచేస్తోందని, రాష్ట్రాలను ఆర్థ్ధికంగా బలోపేతం చేయాల్సిన కేంద్ర సర్కార్ తనకున్న ధన దాహంతో రాష్ట్రాలను దివాళా తీయించే ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలున్నాయి.

చాలా రాష్ట్రాలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే ఉన్నాయని, సొంత నిధులతోనే ఆయా పథకాలను కొనసాగిస్తూ ఆర్థ్ధికంగా అష్టకష్టాలు పడుతున్న రాష్ట్రాల్లో బిజెపియేతర రాష్ట్రాలే కాకుండా కమలం పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలు కూడా వేలాది కోట్ల రూపాయల నిధులను నష్టపోతున్నాయని వివరించారు. రాజకీయపరమైన కారణాలతో కక్షసాధింపుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థ్ధికంగా పనిగట్టుకొని కేంద్రం నష్టం కలిగిస్తోందని జాతీయస్థాయిలో అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థ్ధిక విధానాలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నాయని, బిజెపి పాలిత రాష్ట్రాలు తమ బాధ, ఆవేదనలను పంటి బిగువున భరిస్తున్నాయని, కక్కలేక మింగలేక బిజెపి పాలిత రాష్ట్రాల అధికారులు, మంత్రులు తీవ్రస్థాయిలో మదనపడుతున్నారని వివరించారు.

సబ్సిడీలు తగ్గించారని, కేంద్ర ప్రాయోజిత పథకాలను ఆకస్మికంగా రద్దు చేస్తూ, పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటాలు తగ్గిస్తూ (అంకెల గారడీతో) వేధిస్తున్న కేంద్రం… కనీసం రాష్ట్రాలు రుణాల రూపంలో నిధులను సమీకరించుకోవడానికి కూడా సహకరించకుండా కేంద్రం సతాయించడం దారుణమని అంటున్నారు. తన మూలంగా ఆర్థ్ధికంగా వేలాది కోట్లల్లో నష్టాలను ఎదుర్కొంటూ నిధుల కోసం అష్టకష్టాలు పడుతున్న రాష్ట్రాలకు రుణాలతో నిధులను సమకూర్చుకునే ప్రయత్నాలకు కూడా కేంద్రం సహకరించడం లేదని, సహకరించకపోగా ఆర్‌బిఐ పెద్దలపై వత్తిడి తీసుకొచ్చి ఫలానా తెలంగాణ వంటి రాష్ట్రాలను సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనకుండా చూడండి అని ఆదేశాలిస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇబ్బందులను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు మార్పులు వస్తాయో…నని ఆ అధికారులు వేదాంత ధోరణితో వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News