Monday, December 23, 2024

దుఃఖభారమే ‘నిర్వేదస్థలం’

- Advertisement -
- Advertisement -

2018 వ సం.లో ‘బాలసుధాకర్ మౌళి’ గారి ‘ఆకు కదలని చోట’ కవిత్వానికి గాను ‘కేంద్ర సాహిత్య యువ పురస్కారం’ లభించింది. ఈ అవార్డుకు ఎంపిక కాబడే కవికి 35 సంవత్సరాల లోపు వయస్సుండాలి. ఒక సప్రామాణికమైన కవిత్వాన్ని సృష్టించి, ఈ అవార్డును కైవసం చేసుకున్న ఏకైక ఉత్తరాంధ్ర కవి మౌళినే. 2016 లో ఎగరాల్సిన సమయం, 2017 లో స్వప్న సాధకులు సంకలనం, 2018లో నీళ్లలోని చేప, 2019లో భూమి పెదాలపై, 2021లో దుఃఖపు వొరుపూ అనే లాక్డౌన్ సాహిత్యం, అదే ఏడాది రైతు పోరాట ప్రత్యేక సంచిక ‘చర్య’ వెలువడ్డాయి. మొన్న మే 14 వ తేదీన ’మౌళి’ వివాహం జరిగింది. ఆరోజునే ’నిర్వేదస్థలం’ అనే కవితా సంపుటి ’శివారెడ్డి’ గారి చేతులు మీద ఆవిష్కరించబడింది. వీటిని వరుసలో పేర్చిజూస్తే, అతని సామాజిక, సాహిత్య మరియు సాంస్కృతిక అవగాహన స్థాయి క్రమేపి ఉన్నత స్థితికి చేరుకుందనిపిస్తుంది. ఇది ఏ కవి సాహిత్యాన్ని పరిశీలించినా కనబడవచ్చు. కానీ మౌళి కవిత్వంలో దీని సాంద్రత ఎంతో ఎక్కువ. అందుకే మౌళిని ఎంతో నిబద్ధతగల కవిగా అభివర్ణించవచ్చు.
గత కొన్నేళ్లుగా అస్తిత్వ ఉద్యమాలు వివిధ ప్రాంతాల వారీగా పొడచూపిన నేపథ్యంలో నేటితరం కవులు ఒకవైపు అస్తిత్వ భావనలను ఎగదోస్తూ, మరోవైపు ఆ వాదనలను బలపరిచే సాహిత్యాన్ని విరివిగా పండిస్తున్నారు. అంటే ప్రాపంచిక దృక్పథాన్ని కవులు, రచయితలు మర్చిపోతున్నారన్నమాట. కేవలం కొద్దిమంది కవులు మాత్రమే విశ్వమానవ సమానత్వం మనే విశాల దృక్పథంతో కవితా సేద్యం చేస్తూ, జన చైతన్యానికి శంఖారావం పూరిస్తున్నారు. అలాంటి వారిలో బాలసుధాకర్ మౌళి ఒకరు.
ఈయన కవిత్వాన్ని దగ్గరగా పరిశీలిస్తే ఒక విషయం ఖచ్చితంగా బోధపడుతుంది. దేశంలో ఏ మూల మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా, ఎక్కడ అట్టడుగు వర్గాల ప్రజల జీవనం దుర్భరమైనా, తన వంతుగా ఆయా అంశములకు పెద్దపీట వేస్తూ నవ కవితా గానం చేయడం కద్దు. కేరళ నుండి కెన్యా వరకు, ఆంధ్ర నుండి అమెరికా వరకు ఎక్కడ జనం ఆధిపత్య భావజాలం దురహంకారానికి బలవుతున్నా, దానిని వస్తువుగా తీసుకుని జన చైతన్యానికి శ్రీకారం చుడుతూ కావ్యగానం చేస్తున్నారు. ఇదే మౌళి ఉత్కృష్ట సాహితీ పరిణితికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇదే అతన్ని అచ్చమైన రాజకీయ కవిగా సాహితీ సీమ గుర్తించటానికి ప్రధాన కారణం.
’నిర్వేదస్థలం, దుఃఖవొరుపుకు కొనసాగింపని’ కవి తన పీఠికలో ప్రస్తావిస్తాడు. 2020 లో కరోనా విజృంభించి జనజీవనాన్ని అస్తవ్యస్తము చేసింది. 2021 లో అనేకమంది ప్రజల ప్రాణాలను బలిగొన్నది. ఈ సంక్షోభ సమయాన్ని చూసిన ప్రతీ వ్యక్తి తీవ్ర భయాందోళనలకు గురై ఒక విధమైన ట్రాన్స్ లోకి జారిపోయారు. అది ఒక దుఃఖసమయం. వేదనాభరిత కాలం. ఆ దిగులు ప్రపంచంలో మనుషులు ఒక రకమైన నిరాశ వాదానికి లోనై భావి జీవన ప్రయాణం కొనసాగించడంలో తడబడ్డారు. అయితే కొంతమంది స్వతహాగా ఉండే రక్షక తంత్రాలను ఉపయోగించుకుని మానసికంగా ధైర్యాన్ని కూడగట్టుకోగలిగారు. ముఖ్యంగా కవులు, రచయితలు మరియు వివిధ రకాల కళాకారులు ఆ ఖాళీ సమయాన్ని వినియోగించుకుని తమ కళలను సానబెట్టి, అద్భుతమైన కళాకృతులను సృజన చేస్తూ తమకు తాము సాంత్వన పొందుతూ, ధైర్యాన్ని ప్రోది చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే కవి తన అక్కను కోల్పోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ’అమ్మకు చేదోడై/నన్నిలా ప్రాణాలతో నిలబెట్టిన/సుందరం అక్కకు/ఒక జీవితకాల ప్రేమతో’ అంటూ ఈ కవితా సంపుటిని అంకితం చేసి, తన హృదయంలో భరోసాను నింపుకున్నాడు. ’ఒక జవాబు లేదు’ అనే కవితలో ’భూమి యుద్ధం మరిచిపోయినట్టు/దిగాలుగా ముఖం పెట్టి నెత్తురోడుతుంది/ఎవరి వద్ద నిక్సాన ఒక జవాబు లేదు/ఒక్క తేటదనం దరిదాపులో కనిపిస్తున్నట్టు లేదు’ అంటూ మౌనవేదనను కవి పలికిస్తాడు. ’కమ్మిన మబ్బుని అటువైపు కాస్తా జరిపి/సూర్యుణ్ణో చంద్రుణ్ణో కళ్లముంజూరుల ముందు/వేలాడగట్టడానికి పూనుకునేదెవరో/కాలం ఊబిలో దిగబడిపోయిన భూమిని/ఏ దన్ను పెట్టి పైకి లాగాలో రహస్యం తెలిస్తే బాగుణ్ణు’ అంటూ సంక్షోభాలలో సతమతమవుతూ వాటి విరుగుడు కోసం కవి శోధన చేస్తాడు.
’రాత్రికి రాత్రి’ అనే కవితలో జీవానికి, నిర్జీవానికి మధ్యగల అతిసూక్ష్మ సమయాన్ని కవి కొలుస్తాడు. ’ఇల్లు వదిలి పిల్లలను వదిలి అరక్షణం ఎక్కడా ఇమడలేని ఆమె/నాలుగు గోడల ఆసుపత్రి నిశ్శబ్దాన్ని ఎలా ఒప్పుకుంటుంది/మొండిగా ఊపిరినే కాదని ప్రాణం బొమ్మను/కాలితో తన్ని మధ్యలోనే నిష్క్రమించింది’ మరణం అనివార్యమైతే మనిషి తనకు తాను ఎలా నచ్చ చెప్పుకోవాలి. మరణానంతర పరిణామాలను ముందే ఊహించుకొని దుఃఖ సాగరాన్ని తానే ఒడుపుగా ఈదుతాడు. ఈ నేపథ్యంలో తన వారికి ఏ విధంగా ధైర్యం చెప్పాలా! అని ఆలోచిస్తాడు. ’లేని ఆమెను ఉన్నట్టుగా నమ్మడానికి/వాళ్ళింకా అలవాటుపడలేదు/ఆమె తిరిగిన ఆమె ఊపిరి పీల్చిన/ఆమె మేల్కొన్న ఆమె నిద్రపోయిన ఆమె ఇల్లు/లేని ఆమెను గుర్తు చేసుకుంటూ తుళ్ళితుళ్ళిపడుతుంది’ అనంత లోకాలకు పోయిన మనిషిని మరచిపోవడం ఇంకా అలవాటు కాలేదు. ఆమె సంచరించిన నేలతల్లిపై నిక్షిప్తమైన జ్ఞాపకాలు ప్రతి వస్తువులో కనబడడం ఒక విషయమైతే, అవన్నీ ఆమె లేని వాస్తవాన్ని ఎరుకుపరచడం మరొక దృగ్విషయం కూడా. కొవిడ్ కాలంలో ఆసుపత్రులలో చికిత్స పొందుతూ పలువురు రోగులు ఆక్సిజన్ అందక చనిపోవడం చూసాం. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కవి సోదరి సుందరమ్మ కన్ను మూయడం జరిగింది. చిన్నతనంలో సోదరితో గడిపిన క్షణాలను జ్ఞాప్తికి తెచ్చుకుంటూ ’సుందరం అక్క’ కవిత సాగుతుంది. ’మనిద్దరం నడిచిన బుచ్చు రాజుపేట దారులు/ఎక్కీదిగిన గురమ్మవలస పొలాల గట్టులు/నీ చేయి పట్టుకొని నేను చేసిన పిచ్చుకగూళ్ళ ప్రయాణాలు/అదంతా గతమేనా అక్కా/నువ్ వేసిన అడుగుల్లో అడుగులు వేసి నడిచిన/తూనీగ రెక్కల చిన్న తమ్ముణ్ణి నేను/తమ్ముణ్ణి ఇలా ఒంటరిని చేసి వెళ్లిపోవడం/ ఏం న్యాయం అక్కా’ ఇలా ఆర్ద్రంగా కైత ముందుకుపోతుంది.
దుఃఖపు లోతులను ’మహా విభ్రాంతి’ అనే కవితలో గుండెలవిసేలా వ్యక్తీకరిస్తాడు కవి. ’దుఃఖాన్ని నెమరువేసుకునే వెసులుబాటులేని కాలంలో/బతకడమంత దుఃఖం ఇంకోటి లేదు/బహుశా నెమరు వేసుకుంటేనే అలవాటవుతుందేమో దుఃఖం/దుఃఖం నీటితిత్తిలా గుండె అంతా ఆక్రమించి/బరువు బరువుగా ఉంది/దుఃఖాన్ని నెమరువేసుకోకపోవడమే పెద్ద శిక్షలా ఉంది’ అంతటా దుఃఖం, కనుచూపు మేరంతటా దుఃఖం, హృదయాంతరంగాలను తడిపేస్తున్న దుఃఖం, ఈ దుఃఖం ఎల్లకాలం ఉండదు. అదే ఒకానొక స్థితి వరకు తోడుగా నిలుస్తూ, మరుక్షణం శుభోదయాలను అందిస్తుందని కవి ఆశిస్తాడు.
దుఃఖాన్ని వానతో పోల్చుతూ ’వాన’ అనే కవిత నిర్మించబడింది. ’వానది ఆదిమ అనాది తత్వం/లేలేత మునివేళ్ళతో నేల ముఖాన్ని సుతారంగా తాకినట్టే/ఆమెనూ తాకుతుంది/దుఃఖానిదీ ఆదిమ అనాది తత్వమేనేమో/వానలాగే దుఃఖమూ ఆమెను/తాకి తాకి దుఃఖపు నదిని చేస్తుంది’ దుఃఖం అంటే ఎవరికైనా కన్నీరే, వర్షం అంటే ఎవరికైనా పన్నీరే. ఈ రెండింటి మధ్య సామ్యం కవి నిలువెత్తు జ్ఞానాన్ని బయటపెడుతున్నది. ఇంకా ’దుఃఖానిది చంటిబిడ్డ తత్వం/దూరం వెళ్ళనీయదు/దగ్గరను ఇంకాస్త దగ్గర చేస్తుంది’ పసిబిడ్డతో ప్రేమానుబంధాలు విడదీయరానివి. అలాగే దుఃఖంతో బంధం తెంచడం ఏ ఒక్కరికైనా కష్టతరం. ’దుఃఖం వాసన వేస్తున్న పద్యం’ అన్న కవితలో ’అతను రాసిన పద్యం/ ఇక్కడ ఎక్కడో ఉండాలి/దుఃఖం వాసన వేస్తుంది/ఎంత వెతికినా ఎక్కడా/ ఆనవాలు లేదు/దుఃఖం వాసన వేస్తున్న/పద్యం కోసం/ ఎందుకిలా పదేపదే మళ్లీ మళ్లీ/ తల్లడిల్లుతున్నాను’ సర్వప్రపంచం దుఃఖమయంతో ఊగిసలాడుతున్నప్పుడు ఎవరి వద్ద సాంత్వన పొందగలం? ప్రతి హృదయం నిండా దుఃఖం పొంగిపొర్లుతుంటే దుఃఖ బాధ ఎవరికి చెప్పగలను? అంటూ కవి పొగిలి పొగిలి ఏడుస్తాడు. కవితా సంపుటి శీర్షిక గల ’నిర్వేదస్థలం’ అనే కవితలో దుఃఖానికి మూలం వెతుకుతాడు. ’ఈ దుఃఖాన్ని పూరించడానికి ఏ వాక్యమూ/సరిపోవటం లేదు/ఇదొక అనాది అనాధ స్థితి/ఎగిరిన రెక్కలు ఎగరాల్సిన రెక్కలు/మధ్యలోనే ఆగిపోవడమే రాలిపోవడం/దుఃఖానికి మూలం’ ఎన్నాళ్ళీ దుఃఖం ఇళ్లనే ఖాళీ నిర్వేదస్థలంలో మకాం వేస్తుంది? ఏదో ఒక రోజున దుఃఖాన్ని తరిమే కాంతి కిరణాలు ప్రసరించక మానవు, అని కవి ఎదురుచూస్తాడు.
’ప్రేమభాష’ అనే కవితలో ’పిల్లలను ప్రేమభాషతో పిలిస్తే మన హృదయాల్లోపల/నునులేత తీగల్లా అణువణువూ అల్లుకుపోతారు/ఎన్నాళ్లైనా ఎన్నేళ్లైనా పిల్లలను పిల్లలే అంటాం’ పిల్లల్తో గడిపిన క్షణాలు మధురమని, అవి పెద్దలకు ఎంతో ఆనందాతిశయాలను పంచుతాయని, అందువల్ల పిల్లలను వశం చేసుకుంటూ, మనం కూడా వారికి వశమవ్వాలంటాడు కవి. ఈ సంపుటిలో మొత్తం 45 కవితలు ఉన్నాయి. మెజారిటీ కవితలు దుఃఖభారాన్నే ఎత్తుకున్నాయి. యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిన క్షణాలను మన ముందుంచుతాయి. వీటితోపాటు ఎప్పటివలె ’మౌళి’ మార్కు రాజకీయ కవిత్వం కూడా కొన్ని కవితలలో తారసపడతాయి. ’అడవిపూవు/ఆర్కే’ లో విప్లవయోధుణ్ణి స్మరిస్తాడిలా. ’అతనెక్కడికీ వెళ్లలేదని/అడవిలోనే అడుగడుగునా వున్నాడని/పక్షులు లోకానికి చాటింపు వేస్తున్నాయి’ జనం కోసం ప్రాణాలర్పించే పోరాట వీరుల త్యాగఫలాలు ప్రతి ఒక్కరి మదిలో నిత్యమని ఘంటాపథంగా చెబుతాడు కవి. ”సత్యం/కా.హరిభూషణ్, కత్తి మహేష్ స్మృతిలో కొన్ని కవితలు, కరుణాకర్ యెనికపాటి, జీతన్ మరాండీ; తన అమ్మ సేవలను కొనియాడుతూ, తను నివసించే నెల్లిమర్ల పట్టణ ప్రకృతి సౌందర్యాలను, వృత్తిపరంగా ఆత్మీయుడైన సీఆర్పీ జె.వెంకటరావు గారి స్మృతిలో, ఇస్సా అనే గరివిడి ఆటో డ్రైవర్‌” లాంటి కవితలతో సంపుటి నిండుదనాన్ని పొందింది. భాషాపరంగా చూస్తే ’మౌళి’ తేలికైన పదాల ప్ర యోగం కానవస్తుంది. కానీ భావపరంగా లోతుస్థాయి ఎక్కువే. ఇ ది పాఠకులకు కొంత ఇబ్బందికరం కూడా. ’మళ్లీ మళ్లీ దుఃఖా న్నే కలవరిస్తున్నాడు’ అనే వాళ్లకు నా సమాధానం ’జీవితం ఎలా వుంటే అలానే వాక్యంలోకి తర్జు మా అవుతుంది’ అన్న మౌళి మా టల్లో వాస్తవముంది. కొవిడ్ కాల పు అందరి దుఃఖభారాలను నెమరువేసుకునే కవిత్వాన్ని అందించిన మౌళికి ధన్యవాదాలు.

పిల్లా తిరుపతిరావు,
7095184846

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News