మనతెలంగాణ/హైదరాబాద్ : తెల్లబంగారం తెలంగాణను జాతీయ స్ధాయిలో రెండవ స్థానంలో నిలబెట్టింది. పత్తి సాగు విస్తీర్ణంలో మహారాష్ట తర్వాత స్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణతో పోటి పడే గుజరాత్ రాష్ట్రాన్ని ఈ సారి మూడవ స్థానానికి నెట్టేసింది. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వనరులు అందుబాటులో ఉండటం, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలిస్తుండటంతో రైతులు పత్తిసాగుపట్ల అధికంగా మొగ్గు చూపుతున్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లోనే పత్తిసాగుకు కేరాఫ్ తెలంగాణ అన్న పేరు గత కొన్ని దశాబ్ధాలుగా కొనసాగుతొంది. జాతీయ స్థాయిలో మహారాష్ట్ర ప్రధమ స్థానంలో ఉండగా, గుజరాత్ ద్వితీయ స్ధానంలో ఉండేది. దేశంలో పత్తి సాగు ప్రాంతాల వారీగా సెంట్రల్ జోన్‌లోని మహారాష్ట్ర ,గుజరాత్ రాష్ట్రాలదే ఎప్పుడూ పైచేయిగా ఉండేది. తొలిసారి సెంట్రల్ జోన్‌ను రికార్డను బ్రేక్‌చేసి ఈ ఏడాది 23.73లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణంతో తెలంగాణ జాతీయ స్థాయి రికార్డును నెలకొల్పింది.
గుజరాత్ రాష్ట్రం 22.773లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో మూడవ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్ర 41.84లక్షల హెక్టార్ల సాగుతో ప్రధమస్థానంలో నిలిచింది. దేశంలో 2020-2021కి సంబంధించి పత్తి సాగు విస్తీర్ణం, పంట దిగుబది తదితర వివరాలతో ప్రాధమిక నివేదికను వ్యవసాయశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది దేశంలో పత్తిసాగు మొత్తం 129.57లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వచ్చింది. అందులో నార్త్ జోన్ పరిధిలోకి వచ్చే పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మొత్తం 19.10లక్షల హెక్టార్లలో పత్తి సాగుచేశారు. సెంట్రల్ జోన్ పరిధిలోకొచ్చే గుజరాత్, మహారాష్ట్రా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 71.01లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చింది. సౌత్‌జోన్ పరిధిలోకి వచ్చే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,కర్ణాటక, తమిళనాడు రాష్టాల్లో మొత్తం 37.73లక్షల హెక్టార్లలో సాగు చేశారు. పంట దిగుబడి పరంగా చూస్తే ఈ ఏడాది దేశంలో 129.57లక్షల హెక్టార్ల నుంచి పత్తి ఉత్పత్తి జరిగింది. పంట దిగుబడి ప్రెసెడ్ బేళ్ల కింద 344.90లక్షల బేళ్లు, లూజ్ పత్తి కింద 26.10లక్షల బేళ్లు కలిసి మొత్తం 371లక్షల బేళ్ల(బేల్‌కు 170కిలోలు) పత్తి ఉత్పత్తిని కేంద్రం అంచనా వేసింది.
మహారాష్ట్రను మించిన తెలంగాణ..
పత్తి పంట ఉత్పాదకతో తెలంగాణ మహారాష్ట్రను మించి పోయింది. పంట సగటు ఉత్పాదకతలో హెక్టారుకు మహారాష్ట్రలో 349.43కిలోలు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 429.84కిలోలుగా అంచనా వేశారు. జాతీయ స్థాయి పంట ఉత్పాదకతలో రాజస్థాన్ ప్రధమ స్థానంలో నిలించింది. ఈ రాష్ట్రంలో సగటు ఉత్పతాదకత 683.04కిలోలు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. గుజరాత్ 676.86కిలోలతో రెండవ స్థానంలో నిలిచింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 583.97కిలోలతో మూడవ స్థానంలో నిలిచింది.
గుజరాత్‌లో 90లక్షల బేళ్లు..
దిగుబడిలో రాష్ట్రాల వారీగా గుజరాత్ ఈ ఏడాది 90.50లక్షల బేళ్లతో మొదటి స్థానంలో ఉన్నట్టు అంచనా వేశారు. మహారాష్ట్రలో 86లక్షలు, తెలంగాణలో 60లక్షలు, రాజస్థాన్‌లో 27లక్షలు, హర్యానాలో 25లక్షలు, మధ్యప్రదేశ్‌లో 21లక్షలు, కర్ణాటకలో 20లక్షలు, ఆంధప్రదేశ్‌లో 18లక్షలు, పంజాబ్‌లో 12లక్షలు, తమిళనాడులో 5లక్షలు, ఒడిశాలో 4.5లక్షలు, ఇతర అన్ని రాష్ట్రాలు కలిపి 2లక్షల పత్తి బేళ్లు దిగుబడిని కేంద్రం ప్రాధిమిక అంచాన వేసింది. పంట ఉత్పాదకత కూడా జాతీయ స్థాయిలో హెక్టారుకు 486.76కిలోలుగా అంచన వేశారు.