ఈసారి పెరిగిన జీఎస్టీ వసూళ్లు
ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే
శాఖల్లో కమర్షియల్ ట్యాక్స్‌దే అగ్రస్థానం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ట్యాక్స్ ద్వారా వస్తున్న వసూళ్ల కారణంగా తెలంగాణ ఆర్థికంగా పుంజుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికంగా ఆదాయం సమకూర్చే శాఖల్లో వాణిజ్య పన్నుల శాఖనే ముందంజలో నిలుస్తోంది. జీఎస్టీ వసూళ్లు కూడా ఆదాయం పెరగడానికి ఒక కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఆగష్టు నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల రూపాయలు సమకూరగా అందులో జీఎస్టీ ద్వారా రూ.18,754 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా రూ. 55వేల కోట్లకు పైగా రాగా పన్నేతర ఆదాయం ద్వారా రూ.14వేల కోట్లకు పైగా నిధులు వచ్చాయి. 2023,24 ఆర్థిక సంవత్సరం ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.72,933 కోట్ల రెవెన్యూ రాబడి రాగా, అందులో పన్నుల రూపంలో మొదటి ఐదు నెలల్లో రూ.55,441 కోట్లు సమకూరగా, ఇందులో జీఎస్టీ ద్వారా రూ.18,754 కోట్లు, స్టాంపులు – రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5,852 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.12,386 కోట్లు ఖజానాకు వచ్చాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో రూ.10,149 కోట్లు రాగా కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.5,064 కోట్లు సమకూరాయి. ఇతర పన్నుల రూపంలో మరో రూ.3,234 కోట్లు వచ్చాయి.
ఆగష్టు నెలలో పన్నుల ద్వారా రూ.12,729 కోట్లు
2023-, 24 ఆర్థిక సంవత్సరం ఆగష్టు నెలలో అత్యధికంగా రూ.12,729 కోట్లు పన్నుల ద్వారా సమకూరాయి. పన్నేతర ఆదాయం ఆగస్టు నెలలో భారీగా రావడం విశేషం. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదటి నాలుగు నెలల్లో జీఎస్టీ ద్వారా రూ12 వేల 224 కోట్లు రాగా, స్టాంపులు – రిజిస్ట్రేషన్ల ద్వారా 4 వేల 686 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.10,171 కోట్లు ఖజానాకు చేరాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో రూ.6,074 కోట్లు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.4,026 కోట్లు, ఇతర పన్నుల ద్వారా రూ.2,528 కోట్లు సమకూరాయి.
ఆగష్టు, సెప్టెంబర్‌లో పెరిగిన రాబడి
ఆగష్టు, సెప్టెంబర్‌లో పన్నుల రాబడి మరింత పెరిగింది. ఈ రెండు నెలల్లో జీఎస్టీ ద్వారా మరో రూ.6వేల కోట్లు అదనంగా రాగా, స్టాంపులు – రిజిస్ట్రేషన్ల ద్వారా మరో రూ.1,166 కోట్లు, ఎక్సైజ్ పన్నుల రూపంగా మరో రూ.4,075 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. అయితే ఇందులో సింహభాగం వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రావడం విశేషం. 2022, 23 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ రూ.72,525 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా అందులో చమురు అమ్మకాల వ్యాట్ ద్వారా రూ.14,987.44 కోట్లు, మద్యం అమ్మకాల వ్యాట్ ద్వారా రూ.14,286.85 కోట్లు, జిఎస్టీ, ఇతరత్రా రాబడులు కలిపి రూ.1,088.80 కోట్లు, కేంద్ర, రాష్ట్ర జిఎస్టీ ద్వారా రూ.38,101 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం 2023, 24లో సుమారుగా రూ. 80 వేల కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.