హైదరాబాద్: గిరిజన మహిళపై పోలీసుల దాడి ఘటనపై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనపై జడ్జి జస్టీస్ సూరేపల్లి నంద, చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. లేఖను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనలో రాష్ట్ర డిజిపి, హోంశాఖ కార్యదర్శి, రాచకొండ సిపికి, ఎల్బినగర్ డిసిపి, ఎసిపి, ఇన్ స్పెక్టర్ లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. సిసి కెమెరా పుటేజ్ తోపాటు కేసు దర్యాప్తు నివేదికను కూడా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
కాగా, ఎల్బీనగర్ లో స్వాతంత్య్ర దినోత్సవం రోజు రాత్రి ఓ మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి దాడి చేసిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రతిపక్షాలతోపాటు గవర్నర్ తమిళిసై సీరియస్ గా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామని, దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు.