హైదరాబాద్: ఎంఎల్‌ఏల ఎర కేసు పరిశోధనను సిబిఐకి బదిలీ చేయడాన్ని సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వినతి సమర్పించిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తన తీర్పును నిలిపి ఉంచింది. 2022 డిసెంబర్‌లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏల ఎర కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) నుంచి సిబిఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వును హైకోర్టు ఇచ్చింది.
కేసును సిబిఐకి బదిలీ చేయడాన్ని సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు అడ్వొకేట్, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దావే వినిపించిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్, న్యాయమూర్తి ఎన్. తుకారాంజీతో కూడిని ధర్మాసనం విన్నది. సిబిఐ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తోందని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దావే వాదించారు. ఈ నేపథ్యంలో కేసును సిబిఐకి అప్పజెప్పడం అహేతుకం అని కూడా వాదించారు. కేసును సిబిఐకి అప్పగించడంలో ఎలాంటి న్యాయం ఉంది? కాసింత న్యాయ సిద్ధాంతాలైనా పాటించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి బహిరంగ పత్రాన్ని బహిర్గతం చేయడాన్ని దర్యాప్తు సంస్థ లీకేజిగా సింగిల్ జడ్జీ పరిగణించడానికి లేదని వాదించారు.
ముఖ్యమంత్రి నిర్వహించిన విలేకరుల సమావేశం దర్యాప్తును ఎలా ప్రభావితం చేసిందో చూపించడంలో ప్రతివాదులు విఫలమయ్యారని అన్నారు. సింగిల్ జడ్జీ దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని ఆదేశించిన తర్వాత దర్యాప్తు బృందంలో భాగమైన ‘సిట్’, అధికారులను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్. సంతోశ్ బెదిరించారని దావే తెలిపారు. అంతేకాక అరెస్టు నుంచి మినహాయింపును కోరిన సంతోశ్ ఇప్పుడు కోర్టు అధికారాన్ని దిగజార్చుతున్నాడని వాదించారు. న్యాయమూర్తి బి. విజయసేన్ రెడ్డి ఉత్తర్వును పిటిషన్ ఛాలేంజ్ చేసింది.
ముఖ్యమంత్రి పరిశోధన ఇంకా ఆరంభ దశలో ఉండగానే, ఛార్జీషీటు కూడా దాఖలు కాకముందే వీడియోలను రాజ్యాంగ నిర్వాహకులకు పంపారని జడ్జీ అభిప్రాయపడ్డారు. వాదనలను పూర్తిగా విన్నాక కోర్టు జనవరి 30కల్లా రాతపూర్వకంగా తన వాదనను సమర్పించాలని ఆదేశించింది. తీర్పు ప్రభుత్వానికి అనుకూలమైనా, కాకపోయినా తుది ఉత్తర్వును మాత్రం 15 రోజులపాటు దూరంపెట్టాలని సీనియర్ అడ్వొకేట్ కోరారు.