Monday, December 23, 2024

ఆరోగ్య తెలంగాణ

- Advertisement -
- Advertisement -

జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ గణనీయ ప్రగతి
ప్రజల ముంగిటకు సూపర్ స్పెషలిటీ సేవలు


మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ స్థాయిలో వెల్లడించిన ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో అందరికి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ పయనిస్తున్నది. ప్రణాళికాయుతంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలుతో జాతీయ ఆరోగ్య సూచికలలో తెలంగాణ గణనీయ ప్రగతి సాధించింది. ఈ తేడా 2014తో పోల్చితే స్పష్టంగా కనిపిస్తున్నది. లక్ష ప్రసవాలకు 2014లో 92 ఉన్న మాతృమరణాలు, 2022 నాటికి 56కు తగ్గాయి. శిశుమరణాలు 39 నుంచి 23కి తగ్గాయి. 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాలు 41నుంచి 30కి పడిపోయింది. బాలింత మరణాలు 16కు తగ్గాయి. ఇమ్మ్యూనైజీషన్ వాక్సిన్ వంద శాతం చేరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 2014లో 30 శాతం ఉంటే నేడు 56 శాతానికి చేరాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల సంఖ్య 98 శాతానికి పెరిగింది. ఆరోగ్య సూచికల్లో జాతీయ స్థాయి కంటే తెలంగాణ మెరుగ్గా ఉంది. ‘నీతి ఆయోగ్ “ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచికల్లో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ మూడో స్థానానికి చేరింది. తలసరి ప్రభుత్వం చేస్తున్న వైద్య ఖర్చుల్లో రూ.1,698 లతో హిమాచల్ ప్రదేశ్, కేరళ తర్వాత తెలంగాణ రాష్ట్రం నిలిచింది. 2022 -23 బడ్జెట్లో దానిని రూ.3,091లకు పెంచారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆరోగ్య విభాగంలోని మూడు కేటగిరిల్లో అవార్డులు ప్రకటించగా తెలంగాణ 3 అవార్డులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

హెల్త్ హబ్‌గా హైదరాబాద్..

హైదరాబాద్ నగరానికి హెల్త్ హబ్ గా అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. దేశ, విదేశ ప్రజలు వైద్యసేవలకు హైదరాబాద్‌కు వస్తుండటంతో హెల్త్ టూరిజం విస్తరించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత విస్తరించిన సదుపాయాలు, ప్రజలందరికి అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యసేవలు అని స్పష్టంగా పేర్కొనవచ్చు. ఐదు అంచెల వ్యవస్థతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక వైద్య సేవలు, రోగ నిర్దారణ పరికరాలతోపాటు ఐసియు బెడ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. వైద్యబోధన కళాశాలల్లో ఐసియు బెడ్స్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదటిసారి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రోగనిర్దారణ పరీక్షా కేంద్రాలను నెలకొల్పిన ప్రభుత్వం, వాటి నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నది. గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక సెంట్రల్ డయాగ్నస్టిక్ లేబరేటరీని ఏర్పాటు చేశారు. మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పిన ప్రభుత్వ డయాగ్నస్టిక్ కేంద్రాలలో జరుగుతున్న రోగ నిర్దారణ పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు.

డయాలసిస్ రోగులకు ఉచిత ప్రయాణం…

కిడ్నీ వ్యాధిగ్రస్తుల సౌలభ్యం కోసం 42 డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పింది. ఈ కేంద్రాల సంఖ్యను 102కు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. డయాలసిస్ కేంద్రాలకు రోగులు వచ్చేపోయేందుకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 21 ఆసుపత్రుల్లో సి.టి. స్కాన్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ లో క్యాథ్ ల్యాబ్ లను ప్రభుత్వం నెలకొల్పింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్, డైట్ ఛార్జీలను పెంచారు.

వరంగల్‌లో ఆరోగ్య విశ్వ విద్యాలయం..

వరంగల్‌లో కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం నెలకొల్పింది. 2014 నాటికి తెలంగాణలో ప్రభుత్వపరంగా 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. మొదటి దశలో ఒక్కొక్కటి రూ.450 కోట్ల వ్యయంతో కొత్తగా మహబూబ్‌నగర్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేట లలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలు నడుస్తున్నాయి. 2021లో ఎనిమిది కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో దానికి రూ.510 కోట్ల వ్యయంతో సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం లలో మెడికల్ కాలేజిల ఏర్పాటు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 2023 -24లో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటుతో యంబిబిఎస్ సీట్లు 5,240కు, పిజి మెడికల్ సీట్లు 2,500లకు, సూపర్ స్పెషలిటీ సీట్లు 1,000కు చేరుతాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు తలమానికంగా ఉన్న వరంగల్ ను హెల్త్ సిటీగా అభివృద్ధి చేయుటకు 2,000 పడకల సామర్ధ్యంతో రూ.1,100 కోట్లతో 35 రకాలు సూపర్ స్పెషలిటీ విభాగాలతో మల్టీ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తున్నది.ఈ ఆసుపత్రిలో అత్యాధునిక క్యాన్సర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఎయిమ్స్ తరహాలో నగరంలో నాలుగు టిమ్స్‌లు..

KCR kit scheme achieves a milestone in telangana

హైదరాబాద్‌వాసులతో పాటు సమీప జిల్లాల నుంచి వచ్చే వారికి ఆధునిక వైద్య సేవలను అందించేందుకు ఎయిమ్స్ తరహాలో నగరానికి నాలుగు వైపులా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ (టిమ్స్) పేరున సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. 1,500 పడకలతో గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రిని ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.మొత్తం రూ.2,679 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటి 1,000 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో ఆల్వాల్, గడ్డి అన్నారం, ఎర్రగడ్డలలో సూపర్ స్పెషలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇటీవలనే శంకుస్థాపన చేశారు.

జిహెచ్‌ఎంసిలో 256 బస్తీ దవాఖానలు..

Another 15 Basti Dawakhanas in hyderabad

పట్టణ పేదలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలను అందించే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్‌లో 256 బస్తీ దవాఖానలను ప్రభుత్వం నెలకొల్పింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో 141 మున్సిపాలిటీలలో కొత్తగా 288 బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు.57 రకాల రోగానిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించేందుకు తెలంగాణ డయాగ్నస్టిక్స్ ల్యాబ్ ను ప్రభుత్వం నెలకొల్పి, ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4,745 సబ్ సెంటర్లను “పల్లె దవాఖాన”లుగా అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఆసుపత్రుల్లో చనిపోయిన వ్యక్తి భౌతికకాయాన్ని గౌరవప్రదంగా ఇంటికి చేర్చాలనే ఉద్దేశ్యంతో పార్ధివ వాహన సేవలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తున్నది. దేశంలో మొదటిసారి ఇటువంటి సేవలను ప్రవేశపెట్టి,రాష్ట్రవ్యాప్తంగా 50 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని 18 ప్రధాన ఆసుపత్రులకు వైద్య సేవలు పొందుతున్న రోగులతో పాటు వచ్చే సహాయకులకు రూ.5- లకే మూడు పూటలా భోజన సదుపాయం కల్పించారు. ప్రతి రోజు దాదాపు 18,600 మంది రోగి సహాయకులు లబ్ధి పొందుతున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ముందుచూపుతో అందరికి అభివృద్ధి, సంక్షేమఫలాలు అందించుటకు ప్రభుత్వం చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తున్నది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ పథకాలు అమలుతో ఆరోగ్య తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News