Thursday, January 9, 2025

క్వాష్ పిటిషన్ కొట్టివేత

- Advertisement -
- Advertisement -

ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ స్పష్టీకరణ
ఎఫ్‌ఐఆర్‌లో అనేక ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయి పోలీసుల దర్యాప్తు అన్యాయంగా
ఉంటేనే ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసే అధికారాన్ని కోర్టులు వినియోగిస్తాయి ఎసిబి చేసిన ఆరోపణల్లోకి
వెళ్లి దర్యాప్తు చేయాలని కోర్టు భావించడం లేదు తీర్పులో అనేక కీలకాంశాలను ప్రస్తావించిన
న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ కెటిఆర్‌కు మరోసారి ఇడి నోటీసులు 16న విచారణకు రావాలని
ఆదేశం కెటిఆర్ ఇంట్లో సోదాలకు ఎసిబి కోర్టు అనుమతి గ్రీన్‌కో ప్రాజెక్టు కంపెనీ
కార్యాలయాలపై ఎసిబి దాడులు ఐఎఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండిఎ మాజీ ఉద్యోగి
బిఎల్‌ఎన్‌రెడ్డి నివాసాల్లో సోదాలు నేడు ఎసిబి విచారణకు అర్వింద్‌కుమార్ హాజరు

మనతెలంగాణ/హైదరాబాద్:బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హై కోర్టు కొట్టివేసింది. ఎసిబి తనపై నమోదు చేసిన కేసు కొట్టి వేయాలని కోరుతూ కెటిఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జస్టిస్ కె లక్ష్మణ్ సారథ్యంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలను ఇచ్చింది. ఫార్ములా ఈ రేసులో కెటిఆర్‌పై ఎసిబి కేసు నమోదు చేయగా తనపై చ ర్యలు చేపట్టవద్దని, కేసు కొట్టివేయాలని కోరుతూ కెటిఆర్ ఇటీవల హైకో ర్టును ఆశ్రయించారు. ఇదివరకే వాదనలు ముగియగా, మంగళవారం ఉదయం కెటిఆర్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇలాంటి కేసులలో అరెస్ట్ చేయవద్దని తీర్పునివ్వడం కుదరదని స్పష్టం చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో తెలంగాణ ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీ భవించింది. కెటిఆర్‌ను అరెస్ట్ చేయవద్దన్న మ ధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది. ఇలాంటి కేసుల్లో ఎసిబి దర్యాప్తులో తాము జోక్యం చేసుకో లేమని హైకోర్టు పేర్కొంది.

చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు సూచించింది. చట్టాలు అందరికీ ఒకటేనని అందరికి రూల్ అఫ్ లా వర్తిస్తుందన్న హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నందినగర్‌లో ఉన్న తన నివాసంలో కెటిఆర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. తన లీగల్ టీమ్‌తో భేటీ అయ్యారు. సిద్ధార్థ్ దవే సహా కొందరు న్యాయ నిపుణుల సలహాలను స్వీకరించినట్లు సమాచారం. అందుబాటులో ఉన్న కొందరు మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు కూడా కెటిఆర్ నివాసానికి చేరుకున్నా రు. లీగల్ టీమ్‌తో పూర్తిస్థాయిలో సంప్రదింపులు నిర్వహించారు. క్వాష్ పిటీషన్‌పై సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలపై చర్చించారు. ఎసిబి దాఖలు చేసిన కేసులు తనకు వర్తిస్తాయా? లేదా? ఈ- ఫార్ములా కారు రేసుల చెల్లింపుల్లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా తన ప్రమేయం ఎంతవరకు ఉంది? అనే అంశాలపై కెటిఆర్ తన లీగల్ టీమ్‌తో చర్చించినట్లు చెబుతున్నారు.

‘ప్రభుత్వ ఆస్తులకు మంత్రి బాధ్యుడిగా ఉండాలి’
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆర్డర్ కాపీలో జడ్జి లక్ష్మణ్ పలు కీలక అంశాలను ప్రస్తావిం చారు. ‘అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. హెచ్‌ఎండిఎ ఖాతాలోని డబ్బును నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చి ఒప్పందం చేసుకున్న సంస్థలకు లబ్ధి చేకూర్చారని అభియోగాలున్నాయి. ఆరోపణల మేరకు ఎసిబి అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పురపాలక మంత్రిగా ఉన్న కెటిఆర్ హెచ్‌ఎండిఎ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. పోలీసుల దర్యాప్తు అన్యాయంగా ఉంటేనే కోర్టు తన అధికారాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు ఉన్న అధికారాలను కోర్టు హరించాలను కోవడం లేదు. ఎసిబి చేసిన ఆరోపణల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలని కోర్టు భావించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యుడిగా ఉండాలి. ఉత్తమ పరిపాలన అందించే బాధ్యత మంత్రులపైనే ఉంటుంది. ఈ కేసులో నేరపూరిత కుట్ర జరిగిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి బాధ్యతగల హోదాలో ఉన్నారు.

మరో నిందితుడితో కలిసి కెటిఆర్ హెచ్‌ఎండిఎ నిధుల ను అక్రమంగా వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిధులు దుర్వినియోగం జరగలేదని పిటిషనర్ వాదించడాన్ని కోర్టు నమ్మడం లేదు. దర్యాప్తులో ఈ విషయాలన్నీ తేలాల్సి ఉంది. నేరం జరిగిందని చెప్పడానికి ప్రాథమిక ఆరోపణలు మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లో ఉంటాయి. పూర్తిస్థాయి వివరాలన్నీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చాల్సిన అవసరం లేదు. పిటిషనర్ పేర్కొన్నట్లు అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు వర్తించక పోయినా ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయలేం. దర్యాప్తులో భాగంగా ఇతర సెక్షన్లు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. మంత్రి మండలి, ఆర్థిక శాఖ అను మతి లేకుండానే పిటిషనర్ హెచ్‌ఎండిఎ నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయి. సొంత లబ్ది కోసమో లేక మూడో వ్యక్తి ప్రయోజనం కోసం నగదు బదిలీ జరిగిందా అనేదానిపై దర్యాప్తు జరగాల్సి ఉంది. డిసెంబర్ 18న ఫిర్యాదు అందితే, 19న ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 20న పిటిషనర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఆధారాలు సేకరించాల్సిన సమయం దర్యాప్తు సంస్థలకు కావాలి. దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోదల్చుకోలేద’ని హైకోర్టు ఆర్డర్ కాపీలో వెల్లడించింది.

గ్రీన్‌కో ఎనర్జీ ప్రాజెక్ట్ కంపెనీ కార్యాలయాలపై ఎసిబి దాడులు
అదే సమయంలో ఈ అవినీతి కేసులో సంబంధం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న గ్రీన్‌కో ఎనర్జీ ప్రాజెక్ట్ కంపెనీ కార్యాలయాలపై ఎసిబి అధికారులు దాడులు చేపట్టారు. హైదరాబాద్ మాదాపూర్ సహా, విజయవాడ, మచిలీపట్నంలల్లో గల గ్రీన్‌కో కార్యాలయాలు, సంబంధిత ఉన్నత ఉద్యోగుల ఇళ్లపైనా ఏకకాలంలో ఈ దాడులు కొనసాగాయి. గ్రీన్‌కో ఎనర్జీకే చెందిన ఏస్ నెకస్ట్ జెన్ సంస్థ ఆఫీసులపైనా దాడులు సాగించారు. ఫార్ములా ఈ- రేస్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించింది ఈ గ్రీన్‌కో ఎనర్జీ ప్రాజెక్ట్ సంస్థ కాకినాడ లోక్‌సభ నుంచి వైసిపి తరఫున పోటీ చేసిన చలమలశెట్టి సునీల్‌కు చెందిన కంపెనీ. ఫార్ములా ఈ-రేస్ అవినీతిలో ఈ సంస్థకూ ప్రమేయం ఉండొచ్చని ఎసిబి అధికారులు అనుమానిస్తోన్నారు. ఈ క్రమంలో విస్తృతంగా దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలను ఎసిబి అధికారులు వెల్లడించాల్సి ఉంది.

కెటిఆర్‌కు మరోసారి ఇడి నోటీసులు-
ఈనెల 16 న విచారణకు రావాలని ఆదేశం
ఫార్ములా ఈ -రేసు కేసులో హైకోర్టులో కెటిఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన నేపథ్యంలో ఇడి రంగంలోకి దిగింది. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న కేసులో విచారణకు రావాలని కెటిఆర్‌కు నోటీసులు జారీచేసింది. ఈనెల 16న ఇడి కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. కెటిఆర్‌ను జనవరి 7న విచారణ కోసం రావాలని ఇడి గతంలోనే కోరింది. అయితే తన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం తుది తీర్పు వస్తోందని, తనకు ఈరోజు కాకుండా మరింత సమయం కావాలని ఆయన ఇడికి ఈ-మెయిల్ ద్వారా లేఖను పంపారు. దీనికి ఇడి అధికారులు కూడా సమ్మతించారు. అయితే మంగళవారం హైకోర్టులో కెటిఆర్‌కు తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఇడి మరోసారి నోటీసులు జారీచేసింది.అటు ఎసిబి కూడా ఈనెల 9న విచారణను రావాలని కెటిఆర్‌కు సోమవారం నోటీసులు జారీ చేసింది.

కెటిఆర్ ఇంట్లో సోదాలకు ఎసిబికి కోర్టు అనుమతి..!
కెటిఆర్ నివాసంలో సోదాలు చేసేందుకు సెర్చ్ వారెంట్‌కు ఎసిబి కోర్టు అనుమతిపొందినట్లుగా సమాచారం. దీంతో ఏ క్షణంలోనైనా కెటిఆర్ ఇంట్లో ఎసిబి సోదాలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ కేసులో ఎ2గా ఉన్న మాజీ చీఫ్ ఐఏఎస్ అరవింద్ కుమార్, ఎ3గా బీఎల్‌ఎన్ రెడ్డి నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలుపై దర్యాప్తు చేయనున్నారు. హెచ్‌ఎండీఏ ద్వారా జరిగిన లావాదేవీలు, ఒప్పంద పత్రాలపై ఎసిబి అధికారులు దృష్టి సారించారు.

కేసు వెలుగుచూసిందిలా…!
బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్‌ఎండిఎ ఈ నిధులను విదేశీ సంస్థలకు చెల్లించిందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కెటిఆర్ ఉన్నారు. విదేశీ సంస్థలకు నిధులు చెల్లింపుతో కెటిఆర్‌కు సంబంధం ఉందని ప్రభుత్వం అనుమానించింది. దీనికి సంబంధించి గవర్నర్‌కు లేఖ రాసింది. అదే సమయంలో మున్సిపల్ శాఖ ఎసిబికి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఎసిబి విచారణ ప్రారంభించింది. హెచ్‌ఎండిఎ నుంచి బదిలీ అయిన నిధులు ఏ ఖాతాలోకి వెళ్లాయనేది గుర్తించింది.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో నిధులు బదిలీ అయినట్లు ఎసిబి తేల్చింది. ఇసి నుంచి అనుమతులు తీసుకోకుండానే నిబంధనలు అతిక్రమించారని గుర్తించింది. 2023 అక్టోబర్ నెలలో రెండు తేదీల్లో హెచ్‌ఎండిఎ బోర్డు అకౌంట్ నుంచి రూ.45.71 కోట్లు లండన్‌లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు బదిలీ చేశారు. ఇందుకు ఆర్‌బిఐ రూల్స్ పాటించలేదు. దీంతో హెచ్‌ఎండిఎ రూ.8 కోట్లను ఐటి శాఖకు పెనాల్టీగా చెల్లించాల్సి వచ్చింది. మొత్తం రూ.54.89 కోట్లు మున్సిపల్ నిధులను అప్పటి మంత్రి కెటిఆర్ దుర్వినియోగం చేశారని ఎసిబి ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను బిఆర్‌ఎస్ ఖండించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి కెటిఆర్ ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చారని వ్యాఖ్యానించింది.

2022, అక్టోబర్‌లో ఫార్మూలా ఈ కారు రేసుకు సంబంధించి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఈఎఫ్‌ఓతో ఒప్పందం చేసుకుంది. సీజన్ 9, 10,11,12 రేసులను నిర్వహించాలనేది ఈ ఒప్పందం ఉద్దేశం. అయితే 2023 ఫిబ్రవరిలో సీజన్ 9 రేసులు జరిగాయి. సీజన్ 10కి సంబంధించి ప్రమోటర్ గా వ్యవహరించిన సంస్థ ముందుకు రావడంతో అంతకు ముందున్న త్రైపాక్షిక ఒప్పందం కాస్తా ద్వైపాక్షిక ఒప్పందంగా మారింది. ఇది నిబంధన ల ఉల్లంఘన చోటు చేసుకుందని ప్రభుత్వం వాదిస్తోంది.
ఫార్ములా ఈ కేసులో అక్రమాల ఆరోపణపై విచారణ
బీఆర్‌ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కారు కేసు విషయంలోరూ.55 కోట్లు అక్రమంగా తరలిపోయాయని ప్రభుత్వం విచారణ చేపట్టింది. కేసులో ఎ1 గా కేటీఆర్ పేరు చేర్చింది. ఎ2గా ఉన్న అర్వింద్ కుమార్, ఎ3 ఉన్న మాజీ ఉన్నతాధికారి బిఎల్‌ఎన్ రెడ్డిలకు సైతం ఎసిబి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. అయితే అంతకంటే ముందు తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదుకు గానూ గవర్నర్ జిష్ణు దేవ్ శర్మకు లేఖ రాసింది. నెల రోజులకు ఆయన పర్మిషన్ ఇవ్వడంతో ఆ ఉత్తర్వులు సిఎస్ నుంచి అందగానే ఎసిబి అధికారులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News