హైదరాబాద్ : ఎపి సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ ఎంపి హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై హైకోర్టు సిజె జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై వాదనలు జరిగాయి. అయితే హరిరామ జోగయ్య దాఖలు చేసిన సవరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం పిల్‌గా పరిగణించేందుకు అంగీకరించింది.
హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌కు నెంబర్ కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం ప్రతివాదులుగా ఉన్న జగన్, సిబిఐ, సిబిఐ కోర్టుకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇక, హరిరామయ్య జోగయ్య దాఖలు చేసిన పిల్‌లో జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసులలో విచారణ వేగవంతంగా పూర్తయ్యేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2024లో ఎపి ఎన్నికలు జరిగేలోపే కేసులను తేల్చాలని పిల్‌లో పేర్కొన్నారు.