Monday, January 20, 2025

జీవో 33పై వివరణ ఇవ్వండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు స్థానికత వివాదం మళ్లీ హైకోర్టుకు చేరింది. స్థానికతకు సంబంధించి మెడికల్, డెంటల్ కోర్సుల అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ జులై 19న ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గతేడాది ఇదే హైకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం నిబంధనలను సవరిస్తూ జీవో తీసుకువచ్చిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. ప్రస్తుత నిబంధన ప్రకారం ఆడ్మిషన్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివి ఉండాలని నిబంధన తీసుకువచ్చారన్నారు. గతంలో 10వ తరగతి వరకు చదివి తల్లిదండ్రుల ఉద్యోగ,

ఇతరత్రా ఇతర ప్రాంతాలకు వెళ్లిన సంద ర్భాల్లో ఇక్కడ శాశ్వత నివాసానికి సంబంధించి ఎమ్మార్వో ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ఈ హైకోర్టు తీర్పు వెలువరించిందన్నారు. దాని ప్రకారం గతేడాది అడ్మిషన్లు జరిగాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనల సవరణ వల్ల స్థానికులకే తీవ్ర నష్టం వాటిల్లుతోందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు వెల్లడి చేశారు. మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్ల నిమిత్తం దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం చివరి రోజు అని అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదుల వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ప్రతివాదులైన వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, ఎన్టీఏలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. జీవో 33పై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై ఇటీవలే బిఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కెటిఆర్ స్పందించారు. ప్రభుత్వ ఉత్తర్వులు 33 సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని హరీశ్‌రావు పేర్కొన్నారు. వైద్యవిద్య కళాశాలల్లో అడ్మిషన్ల కోసం స్థానికత నిర్ధారించుకోడానికి ప్రభుత్వం కొత్త సమగ్ర విధానం రూపొందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యార్థులకు వైద్య సీట్లల్లో అన్యాయం చేస్తారా అని కెటిఆర్ ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News