Wednesday, January 22, 2025

తహశీల్దార్ చెబితే..చార్మినార్‌నూ కూల్చేస్తారా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వివాదాస్పదంగా మారిన హైడ్రా పై హైకో ర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు తీవ్రంగా మండిపడింది. రాజకీయ నాయకులు చెప్పినా, ఎవరు చెప్పినా రూల్స్ పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. చార్మినార్ ఎ మ్మార్వో చెబితే, హైకోర్టును కూడా కూల్చేస్తారా? అని కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరుడుగట్టిన నేరస్థుడికి కూడా ఆఖరి కోరిక చెప్పుకునే అవకాశం ఉంటుంది, బాధితులకు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా సెలవు ది నాలలో కూల్చివేతలు చేపట్టడం ఏమిటని హైకోర్టు నిలదీసింది. గుక్క తిప్పుకోకుండా హైకోర్టు అడిగిన ప్రశ్నలకు హైడ్రా కమిషనర్ రంగానాథ్ సమాధానం చెప్పబోగా, మేము అడిగిన దానికే సమాధానం ఇవ్వాలని మందలించింది.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిపిన కూల్చివేతలపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా కోర్టుకు హాజరు కాగా అమీన్‌పూర్ తహసీల్దార్ నేరుగా హాజరయ్యారు. కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని తహసీల్దార్‌పై హైకోర్టు మండిపడింది. తహసీల్దార్ చెప్పిన సమాధానంపై సంతృప్తి చెందని హైకోర్టు ఆ తర్వాత ‘హైడ్రా’ కమిషనర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. సెలవు దినాలలో కూల్చివేతలు జరపవద్దని గతంలో కోర్టు హెచ్చరించినా ఆ విషయాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించింది. కేవలం వారంతం శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తరువాతే కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని కోర్టు ప్రశ్నించింది.

సెలవు రోజుల్లో నోటీసులు ఇచ్చి ఆ మరసటి రోజుననే అత్యవసరంగా కూల్చివేయడానికి కారణం ఏంటని ప్రశ్నించింది. అసలు రూల్స్ గురించి తెలుసా అని హైడ్రా కమిషనర్‌ను కోర్టు నిలదీసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డి గ్రామపంచాయతీ పరిధిలో ఒక హాస్పిటల్ భవనం కూల్చివేత కు ఇచ్చిన నోటిసును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కోర్టులో కేసు ఉన్నప్పటికీ పరిగణనలోకి తీసుకోకుండా కూడా అధికారులు అత్యుత్సాహంగా దూకుడుగా కూల్చివేతకు పాల్పడటాన్ని బాధితులు హైకోర్టు దృష్టికి తీసుకవచ్చారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అమీన్‌పూర్ తహశీల్దార్, హైడ్రా కమిషనర్ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు తహశీల్దార్ కోర్టుకు హాజరు కాగా, హైడ్రా కమిషనర్ వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నేతలు చెప్పినా, మరేవ్వరు చెప్పినా రూల్స్ ప్రకారమే నడుచుకోవాలని కోర్టు గుర్తు చేసింది.

రాజకీయ నేతలను, పై అధికారులను సంతృప్తి పరిచేందుకు అత్యుత్సాహంతో పనిచేయొద్దని హైకోర్టు హితవు పలికింది. కరుడుగట్టిన నేరస్థుడిని ఉరితీసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారని ఈ సందర్భంగా గుర్తుచేసింది. అలాంటిది కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా? అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఆదివారం సెలవుదినం. అలాంటిది సెలవు దినాలలో మీరు ఎందుకు పనిచేస్తున్నారని కూడా రంగనాథ్‌ను హైకోర్టు ప్రశ్నించింది.. చట్టప్రకారం నడుచుకోకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని తహసీల్దార్‌ను కోర్టు హెచ్చరించింది. రాజకీయ నేతలు చెప్పారనో, పై అధికారులు ఆదేశించారనో అత్యుత్సాహంతో పనిచేస్తే ఆ తర్వాత ఇబ్బంది పడతారంటూ అధికారులను హెచ్చరించింది. హైడ్రా కేవలం కూల్చివేతలపైనే దృష్టి పెడుతున్నట్లు హైకోర్టు భావిస్తుందన్నారు. అక్రమ కట్టడాలు కడుతుంటే నిలుపుదల చేయాలని.. లేదా సీజ్ చేయాలని… కానీ నిబంధనలు ఉల్లగించి ఆదివారం కూల్చడం ఏంటి అని ప్రశ్నించింది. “ఆక్రమణలకు అడ్డుకట్టవేసేందుకు హైడ్రా ఏర్పాటు చేయడాన్ని మేము కూడా అభినందించాం&కానీ హైడ్రా వ్యవహరిస్తున్న తీరు బాగులేదు” అని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

‘ఆక్రమణల తొలగింపు ఒక్కటే హైడ్రా డ్యూటీ కాదు…’
హైడ్రాకు ఉన్న విధుల్లో ఆక్రమణల తొలగింపు కూడా ఒకటని, కేవలం ఇదొక్కటే హైడ్రా డ్యూటీ కాదని హైకోర్టు గుర్తు చేసింది. అసలు హైడ్రా కున్న చట్టబద్ధతపై కూడా హైకోర్టు నిలదీసింది. నిబంధనలు పాటించకుంటే హైడ్రా ఏర్పాటు పై స్టే ఇవ్వాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది. చట్టప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తిచేసి, స్థానిక సంస్థల అనుమతి తీసుకున్నాకే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని కోర్టు గుర్తు చేసింది. అయితే, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. ఒక్కరోజులో హైదరాబాద్‌ను మార్చాలనుకోవడం సరికాదని, ఎఫ్‌టిఎల్ నిర్ధారించకుండా అక్రమాలను ఎలా తేలుస్తారని నిలదీసింది. అనంతరం కేసు విచారణను ఈ అక్టోబర్ 15కు వాయిదా వేస్తూ అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News