Thursday, November 28, 2024

చెరువులపై పర్యవేక్షణ మాదే

- Advertisement -
- Advertisement -

హెచ్‌ఎండిఎ పరిధిలోని 3,532 చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లను నిర్ధారించాలి. అప్పటి వరకు చెరువుల పర్యవేక్షణ బాధ్యత మాదే. తుది నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వ న్యాయవాది కోరినట్లుగా మూడు నెలల సమయం ఇవ్వడం కుదరదు.

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని అన్ని చెరువులపై పూర్తి పర్యవేక్షణ తమదేనని హైకోర్టు స్పష్టం చేసింది. రామమ్మ చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్‌ఎండిఎ పరిధిలోని చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లను నిర్ధారించేవరకు పూర్తి పర్యవేక్షణ తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. డిసెంబర్ 30 లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హెచ్‌ఎండిఎ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని జులైలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలపగా వాటన్నింటికీ బఫర్‌జోన్, ఎఫ్‌టిఎల్ నిర్ధారించాలని హైకోర్టు ఆదేశించింది. బుధవారం హెచ్‌ఎండిఎ కమిషనర్ విచారణకు హాజరై ఇప్పటివరకు 2739 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు పూర్తయినట్లు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు. నోటిఫికేషన్లు ఖరారు చేసేందుకు 3 నెలల గడువు ప్రభుత్వ న్యాయ వాది కోరగా, అందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 30కి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ అంటే ఏమిటి?
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు, కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువుల ను ఆక్రమించి కట్టిన బిల్డింగులపై హైడ్రా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ అనే పదాలు తరచూ వార్తల్లో కనిపిస్తున్నాయి. ఇంతకీ బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం.
ఎఫ్‌టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవల్. ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని అంచనా వేసి ఫుల్ ట్యాంక్ లెవల్ నిర్ణయిస్తారు. వర్షాకాలంలో చెరువులో పూర్తిగా నీళ్లు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో ఎఫ్‌టీఎల్ తెలియజేస్తుంది. అక్కడ అన్ని కాలనీల్లో నీరు ఉండదు. దీంతో చాలా మంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. నీరు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో పట్టా భూములున్నా సరే.. అందులో వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు. నిర్మాణాలు చేయడానికి అక్కడ పర్మిషన్ ఉండదు.

రెండు లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు. బఫర్ జోన్ పరిధిలో సొంత భూమి ఉన్నా సరే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. సాగు మాత్రమే చేసుకోవచ్చు. ఇవి ఉండే ప్రదేశాలను బట్టి వాటిలో రకాలు కూడా ఉంటాయి. కొన్ని బఫర్ జోన్లు వన్యప్రాణుల సంరక్షణకు నిలయంగా ఉంటాయి. 25 హెక్టార్లకు మించి విస్తీర్ణంలో ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలను బఫర్ జోన్లుగా పరిగణిస్తారు. వాటికి 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.
హైడ్రా: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం తెచ్చింది. విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్ష, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్టవేయడం, ఆక్రమణలను తొలగించడం, అక్రమ నిర్మాణానలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో హైడ్రాకు విధులు, బాధ్యతలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News