ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో చిన్న పిల్లల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా,ఒమిక్రాన్ పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం నాడు విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని, అదేవిధంగా కేంద్ర మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా జనం గుమిగూడకుండా నియంత్రించాలని మాల్స్, థియేటర్లలో కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది.
వాణిజ్య సముదాయాలు, వారాంతపు సంతల్లోనూ కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఒమైక్రోన్ వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నందున పరీక్షలు పెంచాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఒమైక్రాన్ వైరస్ చిన్న పిల్లలలో కూడా చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని కాబట్టి ఇప్పుడున్న నీలోఫర్ హాస్పిటల్ కాకుండా అదనంగా కొన్ని ఆస్పత్రులను పెంచాలని సూచించింది. సినిమా హాల్స్, మాల్స్, ఇతర కమర్షియల్ ఎస్టాబ్లిస్‌మెంట్ కోసం నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంది.కరోనాపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.