Sunday, December 22, 2024

గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై టిఎస్‌పిఎస్‌సికి చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రూప్-1 రద్దుపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం నాడు సమర్ధించింది. గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చి చెప్పింది. టిఎస్‌పిఎస్‌సి అప్పీలును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఈ ఏడాది జూన్ 11న గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షను టిఎస్‌పిఎస్‌సి నిర్వహించింది. అయితే పరీక్ష నిర్వహణ సమయంలో బయోమెట్రిక్ తీసుకోలేదని కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ నిర్వహించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఈ పరీక్షలను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ లో టిఎస్‌పిఎస్‌సి రెండ్రోజుల క్రితం సవాల్ చేసింది. ఈ విషయమై విచారణ నిర్వహించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్ధించింది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధంగా అభ్యర్ధుల నుండి బయో మెట్రిక్‌ను తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో టిఎస్‌పిఎస్‌సి నిబంధనలను పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణలో టిఎస్‌పిఎస్‌సి విఫలమైందని హైకోర్టు పేర్కొంది.

వ్యవస్థపై నమ్మకం కోల్పోవడంతో గతంలో పరీక్ష రాసిన 50 వేల మంది మరోసారి పరీక్ష రాయలేకపోయారని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని 503 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అర్హుల ఎంపిక కోసం టిఎస్‌పిఎస్‌సికి ప్రభుత్వం అప్పగించింది. గ్రూప్-1 పరీక్షలకు 3.80 లక్షల మంది ధరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పరీక్షలకు మాత్రం 2, 32, 457 మంది హాజరయ్యారు. రెండు సార్లు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కావడంతో అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022 అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను టిఎస్‌పిఎస్‌సి రద్దు చేసింది. ఈ ఏడాది జూన్ 11న మరోసారి పరీక్ష నిర్వహించింది. గత ఏడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందనే అనుమానంతో ఈ పరీక్షను రద్దు చేశారు.

ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన పరీక్షలో బయోమెట్రిక్ తీసుకోకపోవడం ఇతరత్రా కారణాలతో హైకోర్టు రద్దు చేసింది. ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో ఇప్పటికే టిఎస్‌పిఎస్‌సిపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష కూడ హైకోర్టు తీర్పుతో రద్దు కావడంతో అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News