Monday, March 31, 2025

నటి విష్ణుప్రియకు హైకోర్టులో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

బెట్టింగ్ యాప్స్ కేసులో నటి విష్ణుప్రియకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని నటి విష్ణుప్రియను హైకోర్టు ఆదేశించింది. చట్టప్రకారం దర్యాప్తు నిర్వహించాలని నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. మియాపూర్ పోలీసుస్టేషన్‌లో నమోదైన బెట్టింగ్ యాప్స్ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టి వేయాలని విష్ణుప్రియ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ తుకారాంజీ విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వ్యక్తికి బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడి పెట్టాలని విష్ణుప్రియ ప్రోత్సహించలేదని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో యువకులు ప్రాణాలు కోల్పోయారని చాలా మంది అప్పులపాలయ్యారని మియాపూర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఫణీంద్ర అనే వ్యక్తి తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

బెట్టింగ్ యాప్స్‌పైన రాష్ట్రంలో నిషేధం ఉందని, బెట్టింగ్ యాప్స్‌లో బెట్టింగ్ పెట్టినా వాటి తరఫున ప్రచారం చేసినా చట్ట ప్రకారం నేరమని పబ్లిక్ ప్రాసి క్యూటర్ కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు చట్టప్రకారం పోలీసులు దర్యాప్తు నిర్వహించారని నిందితులను నోటీసులిచ్చి విచారించాలని ఆదేశిస్తూ విష్ణుప్రియ పిటీషన్‌పై విచారణను ముగించింది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే హైకోర్టును వ్యక్తిగతంగా ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలని ఇటీవల వైసిపి అధికార ప్రతినిధి శ్యామల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు ఆమెను అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణ కు సహకరించాలని ఆమెకు సూచించింది.

విష్ణుప్రియ, రీతూచౌదరి విచారణ
ఈ కేసులో నిందితులుగా ఉన్న విష్ణుప్రియ, రీతూచౌదరిలను పంజాగుట్ట పోలీసులు ఈ నెల 20న సుదీర్ఘంగా విచారించారు. విష్ణుప్రియను 11 గంటల పాటు విచారించారు. రీతూచౌదరి విచారణ ఐదున్నర గంటలకు పైగా కొనసాగింది. తొలుత ఇద్దరినీ వేరువేరుగా అనంతరం కలిపి ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయాలని ఎవరు సంప్రదించారు? ఎంత పారితోషికం ఇచ్చారు? ప్రచారానికి ఒప్పందం ఎప్పుడు ఎలా జరిగింది? ఏయే సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం జరిగింది? అనే కోణంలో విచారించి జవాబులు రాబట్టినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News