Thursday, January 23, 2025

మాకొద్దీ కుల మతాల భారతం!

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ రచన సందర్భంలోనే తొలి ప్రధాని నెహ్రూ ఒక ప్రతిపాదన తెచ్చారట. వ్యక్తి కులం, మతం అనేది ఆయా సమాజాలకు, వర్గాలకు పరిమితమైనది. వాటికి ప్రభుత్వ రికార్డులలో చోటు ఇస్తే ఆ తారతమ్యాలను అధికారికంగా కొనసాగించినట్లవుతుంది. అందుకే స్కూల్ సర్టిఫికేట్ల స్థాయి నుండే విద్యార్థుల కుల మతాల వివరాలు నమోదు కాకుంటే ఉంటే క్రమంగా కొన్నేళ్ళకు మనిషిని కుల మతాల కళ్లతో చూడడం తగ్గిపోతుంది అని సూచించారట. అయితే అప్పటికే దేశంలో అణగారిన వర్గాల జీవితాలు కడు దయనీయంగా ఉన్నాయి. స్వతంత్ర దేశంలో నిమ్న కులాల ఉన్నతి కోసం తగినన్ని సౌకర్యాలు కల్పించాలి. చట్టసభల్లో వారికి ప్రవేశం కలిగేలా కొన్ని సీట్లు వారికే కేటాయించాలి. విద్య ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు ఉండాలి అనే ఆలోచన వచ్చినపుడు ఆయా వర్గాలను కుల మతాల ఆధారంగా గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కుల మత రహిత జనన ధ్రువీకరణ పత్రం జారీ విషయంలో పిటిషనర్ల తరఫున తెలంగాణ హైకోర్టు తీర్పు ఇస్తూ సమాజం కాలంతో పాటు మారాలని, పౌరుల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సమాజంలో మార్పు రావాలని అభిప్రాయపడింది. అభ్యర్థనలో కులం ‘లేదు’, మతం ‘లేదు’ అని పూరించిన వారికి కూడా బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలని జులై 19న న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ మతం గురించి చెప్పని వారి కోసం పుట్టుక, స్కూల్ ప్రవేశ పత్రాల్లో సరియైన కాలమ్స్ ఏర్పాటు చేయాలని ఆ తీర్పులో ఉంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఉటంకిస్తూ దేశంలో ఏ మతం లేకుండా బతికే హక్కు పౌరులకు ఉందని జస్టిస్ లలిత కన్నెగంటి సంచలనాత్మక తీర్పులో వెల్లడించారు. ఆ హక్కును గౌరవిస్తూ అధికారులు తల్లిదండ్రుల కోరిక మేరకు కుల, మత రహిత జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోర్టు పేర్కొంది. ఏ పౌరుడినైనా తమ మతాన్ని ప్రకటించమని అడిగే అధికారం ఏ రాష్ట్రానికి లేదు. అడిగితే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లే అని కోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లో నివాసముండే వనపర్తి జిల్లాలోని కొత్తకోటకు చెందిన సందెపు స్వరూప, డేవిడ్ అజ్జేపగుల దంపతులు తమ కుమారుడి బర్త్ సర్టిఫికెట్ కోసం అప్లికేషన్‌లో కులం, మతం వివరాలు పేర్కొనవలసిన చోట ‘కులం లేదు, మతం లేదు’ అని రాసి మున్సిపల్ అధికారులకు ఇచ్చినారు. అయితే ఆ ఫారంలో మతం అనే చోట ఐచ్చికాలుగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లేదా ఇతర మతాలు అని ఉంది. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి కానీ మతం ‘లేదు’ అని రాసేందుకు వీలు లేదు.

అయితే ఆ తల్లిదండ్రులు తామిద్దరం భిన్న మతాలకు చెందినవారము, ఏ మతాచారాలు పాటించకుండా పెళ్లి చేసుకున్నాము. మా పిల్లలను మత రహితులుగా పెంచాలనుకుంటున్నాము అని అధికారులకు విన్నవించుకున్నారు. అందుకు అధికారులు వారి కుమారుడికి కుల, మత ప్రస్తావన లేకుండా బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో వారు పై అధికారుల చుట్టూ తిరిగి చివరకు 2021లో కోర్టును ఆశ్రయించారు. ఎందరో అనుమానాలను, అవసరాలను తీర్చినట్లుగా హైకోర్టు ఇలా తీర్పును ఇచ్చి వీరి సంకల్పాన్ని గెలిపించింది.
దేశంలో లక్షలాదిగా ఉన్న నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, సామాజికవేత్తలు కుల, మత పట్టింపులు లేకుం డా బతుకుతున్నారు. అయితే వారు ఎవ్వరు కూడా సర్టిఫికేట్లలో కుల, మత ప్రస్తావన గురించి ప్రశ్నించలేదు. తమకు, తమ పిల్లలకు ప్రభుత్వం ఇస్తున్న విధానంలోనే కుల, జనన పత్రాలు తీసుకొంటూ సర్దుకుపోతున్నారు. ఇన్నేళ్లకు ఓ యువ జంట సమాజం, ప్రభుత్వం, న్యాయస్థానం ముందు ఈ ప్రశ్నను లేవనెత్తి దృఢంగా నిలబడింది.

వాస్తవానికి జనన మరణ పత్రాల్లో మత వివరాలు పేర్కొనకున్నా పుట్టినవారు, గిట్టినవారు ఏ మతంవారు అనే గణాంకాల కోసం ఈ కుల మత గడులున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నిర్ణయాలు తీసికోవచ్చని కేంద్రం అంటోంది. కుల మత రహిత సర్టిఫికెట్ల కోసం తమిళనాడులో స్నేహ అనే అడ్వొకేట్ రెవెన్యూ అధికారులతో 9 ఏళ్ళు పోరాడి తన పేరిట ‘నో క్యాస్ట్, నో రిలీజియన్ సర్టిఫికెట్’ 2019 లో సాధించారు. అలాగే నరేష్ కార్తీక్ అనే కోయంబత్తూర్ వ్యాపారవేత్త తన మూడున్నర ఏళ్ల కూతురు పేరిట ఇలాంటి పత్రం పొందారు. కులం, మతం పేర్కొనకుండా ఆ అమ్మాయిని స్కూల్లో చేర్చుకోనుందుకు యాజమాన్యాలు ఒప్పుకోకపోవడంతో అధికారికంగా ఆయన ఆ సర్టిఫికెట్‌ను పొంది కోరుకున్న రీతిలో అమ్మాయికి స్కూలు అడ్మిషన్ సాధించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కి చెందిన 35 ఏళ్ల లాయర్ ప్రితిషా సాహా మే 2022 లో తనను కుల మత బంధాల నుండి విముక్తి చేస్తూ కుల మత రహిత ధ్రువీకరణ పత్రం ఈయమని జిల్లా అధికారులను కోరి సంపాదించారు. జన్మతః ఆవిడా హిందూ వైశ్య కులానికి చెందిన మహిళ. వీరి ఉదంతాలు తెలిశాక తమకు ధైర్యమొచ్చి ఈ న్యాయ పోరాటానికి సిద్ధపడ్డామని స్వరూప, డేవిడ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

సర్టిఫికేట్లలో కుల, మత ప్రస్తావన వ్యక్తిగత అవసరం. ఆ అవసరం లేకుండా బతకాలనుకొనే వారు కోరుకున్న విధంగా ధ్రువీకరణలు తీసుకొనే హక్కును చట్టం ఈ తీర్పుతో ఇప్పుడు కల్పిస్తోంది. సమాజంలో ఉన్న కుల, మత వివక్షను, వాటి పేరిట వచ్చే గౌరవాలను, అవమానాలను వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ తాము కొత్త తరంగా నిలబడాలనుకోవడం ఆహ్వానించ దగ్గదే! క్రమంగా ఈ సంఖ్య పెరిగితే ఒక విడి గుర్తింపు, ఒక కొత్త పేరు పుట్టుకు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఇంత జనాభా ఉన్న విశాల భారతంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కులాలు ఎదగాలని రాజ్యాంగబద్ధంగా కొన్ని రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ప్రభుత్వాలు కొన్ని పథకాల్ని కులాలు, మతాల ఆధారంగా అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు దళిత బంధు, షాదీముబారక్ పథకాల లబ్ధి పొందాలంటే అభ్యర్థులు తమ కుల, మత గుర్తింపును రుజువు చేసుకోవాలి. ఆర్థికంగా బలపడిన ఏ వర్గానికి చెందినవారైనా తమకు కుల మతాలు వద్దు, వాటితో లభించే సదుపాయాలు కూడా వద్దు అనుకుంటే దానిని గొప్ప నిర్ణయంగానే భావించాలి. తరతరాలుగా రిజర్వేషన్లు ఉపయోగించుకుంటూ తమ కింది వారికి అన్యాయం చేసే వారి కంటే ఏదీ వద్దు అనుకొనేవారే మేలు.

రాజ్యాంగ రచన సందర్భంలోనే తొలి ప్రధాని నెహ్రూ ఒక ప్రతిపాదన తెచ్చారట. వ్యక్తి కులం, మతం అనేది ఆయా సమాజాలకు, వర్గాలకు పరిమితమైనది. వాటికి ప్రభుత్వ రికార్డులలో చోటు ఇస్తే ఆ తారతమ్యాలను అధికారికంగా కొనసాగించినట్లవుతుంది. అందుకే స్కూల్ సర్టిఫికేట్ల స్థాయి నుండే విద్యార్థుల కుల మతాల వివరాలు నమోదు కాకుంటే ఉంటే క్రమంగా కొన్నేళ్ళకు మనిషిని కుల మతాల కళ్లతో చూడడం తగ్గిపోతుంది అని సూచించారట. అయితే అప్పటికే దేశంలో అణగారిన వర్గాల జీవితాలు కడు దయనీయంగా ఉన్నాయి. స్వతంత్ర దేశంలో నిమ్న కులాల ఉన్నతి కోసం తగినన్ని సౌకర్యాలు కల్పించాలి. చట్టసభల్లో వారికి ప్రవేశం కలిగేలా కొన్ని సీట్లు వారికే కేటాయించాలి. విద్య ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు ఉండాలి అనే ఆలోచన వచ్చినపుడు ఆయా వర్గాలను కుల మతాల ఆధారంగా గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

అయితే ఈ 75 ఏళ్ల తరవాత కులం మతం రికార్డుల్లో ఎక్కే అవసరం లేకుండా ఉంటామంటే ఒప్పుకోవలసిందే! అయితే కుల మత రహితంగా ఒక తరం సిద్ధమైనా వారి పిల్లలు పెరిగి పెద్దవారై తమకు కులం కావాలనుకుంటే తిరిగి దొరికే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి. వారి జీవిత భాగస్వాములుగా వచ్చే వారితో తిరిగి కులం వారి జీవితాల్లో ప్రవేశించవచ్చు. ఎందుకంటే నాస్తికుల ఇళ్లలో పుట్టిన వారంతా నాస్తికులు కావడం లేదు. ఉద్యమకారుల పిల్లలు ఉద్యమాల్లోకి రావడం లేదు. ఆ స్వేచ్ఛ ముందు తరాలకు ఉండడాన్ని తప్పుపట్టే అవసరం కూడా లేదు. అయితే ఒకరు సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచి కుల రహిత సమాజం వైపు ఎన్ని అడుగులేసినా అవి ప్రగతికి సోపానాలే.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News