Monday, September 23, 2024

ముచ్చటగా సాగిన ఎలగందుల చరిత్ర

- Advertisement -
- Advertisement -

Telangana history in telugu

పుట్టి పెరిగిన ఊరి గురించి వ్రాయడమంటే ఎవరికైనా ప్రీతిపాత్రమే. స్వీయ చరిత్ర మాదిరే ఎంతో ఇష్టంగా రాసే అంశాల్లో ఇదొకటి. ’నేను-మా ఊరు’ అనే శీర్షికలు పెట్టి రచయితలతో ఊరి అనుబంధాల్ని రాయించుకున్న పత్రిక లు కూడా ఉన్నాయి. జన్మస్థలం ఓ చారిత్రక ప్రదేశమైతే ఇష్టంతో పాటు వ్రాసేందుకు ఎన్నో విశేషాలు కూడా ఉంటాయి. అవే తుమ్మూరి రాంమోహన్ రావును రచనకు ఉద్యుక్తుణ్ణి చేసి ఉంటాయి. తన తండ్రి పద్మనాభ శర్మ తలపెట్టిన ’వెయ్యేళ్ల వెలగందుల’ను తీర్చే బాధ్యత కూడా ఆయన్ని వెంటాడి కార్యాచరణకు పూనుకొనేలా చేసింది. రాసింది రాసినట్లు ఆయన తన ఊరి చరితను ఫేస్ బుక్ వేదికగా అందరికి అందుబాటులోకి తెచ్చారు. చేతికందిన సమాచారాన్ని తన అనుభవాల్ని జోడిస్తూ ఇలా ఎనభై రోజులు రాస్తూ వెళ్లారు. ఊరిచరిత్రతో పాటు రాసే క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, అనుమానాలు కూడా పుస్తకంలో సమాంతరంగా కనబడతాయి. రాసిన క్రమం కన్నా రాయాలని ఆయనలో ఉన్న తపన, రాయడానికి పడ్డ శ్రమ ఆయన మాటల్లో పుస్తకమంతా కనిపిస్తుంది.
రోజులు గడుస్తున్న కొద్దీ రచనను ముందుకు నడిపించేందుకు ఆయన చారిత్రక పరిశోధనలో ఉన్న వారిని కలిసి అనుమాన నివృత్తి చేసుకున్నారు. అంతర్జాల సదుపాయం ఎంతున్నా సంచారం కూడా తప్పలేదు. తనకు లభించిన శాసనాల ఆధారాలు చూయించి తెలిసిన వారి నుంచి సమాచారాన్నిరాబట్టుకున్నారు. ఒక్కోసారి అగమ్యమైన గమనంలో ఆధారాల ఊతంతో విషయాన్ని మళ్ళీ పట్టాల మీదికి తెచ్చారు. ఊరి చరిత్ర కోసం తుమ్మూరి వెదుకులాటలో ఊరి చెరువు కట్ట చివరలో మట్టి కొట్టుకుపోయిన రాయి 820 ఏళ్ల కిందటి శాసనంగా బయటపడింది. ఆయన కృషితో జిల్లా యంత్రాంగం ఆ విలువైన శాసనాన్ని ఖిల్లాకు తరలించారు. రచనకు ఈ శాసనమే బొడ్రాయి.
’మానేరు ముచ్చట్లు – వెయ్యేళ్ల వెలగందుల చరిత్ర’ ఆరంభంలో వరుస సంఖ్యతో 35 విభాగాలుగా సాగింది. కాకతీయుల ఏలుబడిలో వెలగందుల 10వ శతాబ్దంలో ఉన్నట్లు శాసన ఆధారం ఉన్నందున నేటికి ఆ ఊరికి వెయ్యేళ్ల చరిత ఉందనడానికి రుజువు దొరికింది. ఈ సుదీర్ఘ కాలంలో రాచరిక పాలన ఎలా సాగిందీ, ఎవరెవరు ఏ ఏ కాలాల్లో పాలించారు, వారి ప్రాశస్త్యమేమిటీ అనే సమాచారం వివరంగా ఉంది. రాజధానులు, ఆనాటి గుళ్లు, ఆయా కాలాల్లోని కళాకారులు, కవులు, వారి రచనల వివరాలు చూడొచ్చు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట లాంటి 9 తాలుకాలతో జిల్లా కేంద్రంగా వెలుగొందిన ఎలగందుల 1905 లో కరీంనగర్ జిల్లాలోని ఒక ఊరుగా మారిపోయింది. దీనితో వెలగందుల ప్రభావం చిన్నబోయిందని రచయిత అన్నారు.
మానేరు ముచ్చట్లు లో రెండో భాగంగా ’నేను చూసిన ఎలగందుల మరియు కొన్ని చూడవలసిన ప్రదేశాలు’ పేరిట మరో 36 భాగాలున్నాయి. ఇందులో రచయిత బాల్యం నాటి ఊరి నాలుగు దిక్కులున్న వీధులు, ప్రదేశాలు, గుట్టలు, వాటిపై ప్రాచీన కట్టడాలు, ఆనాటి దేవాలయాలు మొదలగు వాటి విశేషాలు ఉన్నాయి. వాటితో పాటు అడుగడుగునా రచయితకున్న అనుబంధాలతో , అనుభవాలతో కూడిన మమకారపు ముచ్చట్లు పేజీల కొద్దీ చూడొచ్చు. చరిత్రలో భాగంగా తన గురువులను, సహచరులను, ఆ నేలపై పుట్టిన ప్రతిభావంతులను పేరు పేరునా పరిచయం చేస్తూ వారితో తనకున్న అనుబంధాల్ని వివరించారు. అదే క్రమంలో మనసులో మాటగా అరవై ఏళ్ల కిందటి తన ఊరు, బాల్యం మళ్ళీ కావాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఎలగందుల చరిత్రకు చెందిన విశేష కట్టడాల మరియు ఊరుకి వన్నె తెచ్చిన వ్యక్తుల అరుదైన ఫోటోలు ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి.
మామూలుగా ఒక ప్రాంత చరిత్రను పక్కాగా రాయడం మరియు సొంత ఊరి చిన్నా పెద్దా జ్ఞాపకాలను నలుగురితో పంచుకోవడం మధ్య తేడా ఉంటుంది. చరిత్ర రచనకు ఒక నిర్దిష్టత, నిరూపణ, బలాన్నిచ్చే సాక్ష్యాధారాలు, మరీ ముఖ్యంగా అవునో కాదో అనే సంశయం లేకపోవడం తప్పనిసరి. రచనాక్రమంలో ఎలగందుల చరిత్రను తడుముతూ ఎక్కువగా ఆ ఊరితో తన అనుబంధాన్ని, పరిచయాల్ని పంచుకున్న రచయిత తుమ్మూరి రాంమోహన్ రావు తాను రాసిన దాంట్లో చరిత్ర పాలును గురించి పుస్తక శీర్షికతోనే నివృత్తి చేశారు. అందుకే ’మానేరు ముచ్చట్లు’ అనే పుస్తకానికి వెయ్యేళ్ల ఎలగందుల చరిత్ర ట్యాగ్ లైన్ అయింది. ముక్తాయింపులో సైతం ఊరి చరిత్రను రాయాలనుకున్న తన తండ్రి కలవరింతను కనీసం ఈ ముచ్చట్ల రూపంలోనైనా నెరవేర్చినట్లవుతున్నదని తుమ్మూరి అభిప్రాయపడ్డారు. ఇంత రాసినా ఏదో సంశయమున్నట్లు ’ఇది సమగ్రమని నేను భావించటం లేదు. భావి పరిశోధకులకు ఒక సూచికగా పనికొచ్చినా చాలును’ అని జోడించారు.
నిజానికి చరిత్ర లేని ఊరే ఉండదు. అయితే దాన్ని రికార్డు చేయాలనే స్పృహ అరుదుగా ఉంటుంది. తన అరవై ఏళ్ల జీవితానుభవాన్ని ఊరి చరిత్రలో భాగం చేస్తూ రాసిన ఈ పుస్తకం తన తరానికి ఓ అపురూప అనుభూతిని, ముందు తరాలకు ఊరి విశేషాలను తప్పక అందిస్తుంది.ఇటీవల ఈ పుస్తకం తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి ఉత్తమ గ్రంథంగా పురస్కారమందుకుంది. రచయితకు అభినందనలు.
మానేరు ముచ్చట్లు – వెయ్యేళ్ల వెలగందుల చరిత్ర
రచన: తుమ్మూరి రాంమోహన్ రావు
పేజీలు 216, వెల రూ.౩౦౦/-
పద్మ సూర్య ప్రచురణలు హైదరాబాద్
ప్రతులకు రచయిత 9701522234

-బి.నర్సన్
94401 28169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News