56 శాతం బాలికలు,42 శాతం బాలుర ఉత్తీర్ణత
మొత్తంగా 49 శాతం ఉత్తీర్ణత నమోదు
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల
ముందస్తు సమాచారం లేకుండా
నేరుగా వెబ్‌సైట్‌లో ఫలితాల అప్‌లోడ్
కరోనా పరిస్థితుల కారణంగా తగ్గిన ఉత్తీర్ణత శాతం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో బాలికలే పైచేయి సాధించారు.రాష్ట్రంలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలను ఇంటర్ బోర్డు గురువారం విడుదల చేసింది. మొదటి సంవత్సరంలో 49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫలితాల్లో 56 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, 42 శాతం బాలురు ఉత్తీర్ణులైనట్లు పేర్కొంది. ప్రథమ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 49 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 56 శాతం నమోదైంది. ఈ పరీక్షలకు 2,26,616 మంది బాలికలు మంది హాజరు కాగా, 1,26,289 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. జనరల్‌లో 1,99,786 మంది(49 శాతం) ఉత్తీర్ణత సాధించగా, ఒకేషనల్‌లో 24,226 మంది(49 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం ఫలితాలలో జనరల్‌లో 1,02,808 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించగా, 55,707 మంది బి గ్రేడ్, 26,988 సి గ్రేడ్, 14,283 మంది డి గ్రేడ్ సాధించారు. ఒకేషనల్‌లో 12,730 మంది విద్యార్థులు ఎ గ్రేడ్,10,644 మంది బి గ్రేడ్, 764 మంది సి గ్రేడ్, 88 మంది డి గ్రేడ్ సాధించారు.
మేడ్చల్‌లో అత్యధికం…మెదక్‌లో అత్యల్పంగా ఉత్తీర్ణత
అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 63 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, అత్యల్పంగా మెదక్ జిల్లాలో 20 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపిసిలో 61 శాతం, బైపిసిలో 55 శాతం, హ్యుమానిటీస్ గ్రూపుల్లో 50 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో కేవలం 39 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ పారామెడికల్ కోర్సుల్లో 60 శాతం, హోం సైన్స్‌లో 67 శాతం, బిజినెస్ అండ్ కామర్స్‌లో 51 శాతం, అగ్రికల్చర్ కోర్సుల్లో 52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎంపిసిలో అత్యధిక మార్కులు 470కి 467 కాగా .. బైపిసిలో 440కి 438 మార్కులు వచ్చాయి. ఎంఇసిల్లో ఎంఇసిలో 500కు 494 రాగా, సిఇసిలో 500కి 492, హెచ్‌ఇసిలో 500కి 488 మార్కులు సాధించారు. రీకౌంటింగ్, రివెరిఫికేషన్ దరఖాస్తులకు ఈ నెల 22 వరకు గడువు విధించినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫలితాలను tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు బోర్డు తెలిపింది. అంతేకాకుండా http://results.cgg.gov.in వ్బ్సైట్లోనూ చూడొచ్చు.
12 జిల్లాల్లో 40 శాతం దాటని ఉత్తీర్ణత
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో 12 జిల్లాల్లో 40 శాతంలోపే ఉత్తీర్ణత నమోదైంది. మంచిర్యాల,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, భూపాలపల్లి, మెదక్, యాదాద్రి, సూర్యాపేట, గద్వాల, నాగర్ కర్నూలు, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఉత్తీర్ణత 40 శాతం కూడా చేరలేదు.
ఫస్టియర్ ఫలితాలపై కరోనా ఎఫెక్ట్
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కరోనా తీవ్రత కారణంగా గత మార్చిలో పరీక్షలు నిర్వహించలేకపోయిన ఇంటర్ బోర్డు, ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమైన తర్వాత అక్టోబరులో పరీక్షలు నిర్వహించారు. కరోనా పరిస్థితుల కారణంగా మూడు నెలల వరకు ఆన్‌లైన్‌లో తరగతులు కొనసాగగా, సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. కరోనా పరిస్థితుల వల్ల బోధన సరిగా జరగలేదని. ఒక వైపు రెండో సంవత్సరం తరగతులు కొనసాగుతుండగానే మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరిగి సరిగ్గా పరీక్షలు రాయలేకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కార్పొరేట్ కళాశాలలు ఆన్‌లైన్ పాఠాలు నిర్వహించినప్పటికీ, గ్రామీణ, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు దూరదర్శన్, టీ సాట్ పాఠాలపైనే ఆధారపడ్డారు. కొందరు విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేక ఇబ్బంది పడ్డారు. దాంతో పూర్తిగా పాఠాలు వినకపోవడంతో పరీక్షలు సరిగ్గా రాయలేకపోయినట్లు తెలుస్తోంది. ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత తగ్గిన కారణంగానే పత్రికా ప్రకటన ద్వారా ఫలితాలు విడుదల చేసినట్లు సమాచారం. సాధారణంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలితాలను వెల్లడించే ఇంటర్ బోర్డు, ఈ సారి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా ఫలితాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి, పత్రికా ప్రకటన విడుదల చేసింది.