మనతెలంగాణ/హైదరాబాద్ : కేరళ కేడర్‌కు చెందిన తెలంగాణ సీనియర్ ఐపిఎస్, ఐజి గుగులోత్ లక్ష్మణ్ నాయక్‌ను బుధవారం నాడు కేరళ సిఎం పినరయి విజయన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇటలీలో స్థిరపడ్డ మలయాళీ మహిళ అనిత పుల్లాయిల్‌తో కలిసి ఐపిఎస్ అధికారి లక్ష్మణ్ నాయక్ పురాతన వస్తువుల వ్యాపారం చేసినట్లు కేరళ సిఎంకు క్రైమ్ బ్రాంచ్ అధికారులు నివేదిక సమర్పించారు. ప్రజల సొమ్ము కోట్లాది రూపాయలు స్వాహా చేసిన మాన్షన్ మౌన్కల్‌తో ఐపిఎస్ అధికారి, సిఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గుగులోత్ లక్ష్మణ్ నాయక్‌కు సన్నిహిత సంబంధాలు వున్నాయని దర్యాప్తులో నిర్ధారణ కావడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణ యం తీసుకున్నారు.
అలాగే రూ. 10 కోట్లు ప్రజల సొమ్ము ఎగ్గొట్టిన మాన్షన్ మౌన్కల్ ఇంటికి లక్ష్మణ్ తరచూ వెళ్ళడంతో పాటు స్కామ్ బయటపడిన తరవాత మౌన్కల్ కేసు మరో స్టేషన్‌కు బదిలీ చేయాలని పోలీసు అధికారులపై లక్ష్మణ్ ఒత్తిడి తెచ్చిన ఆడియో బయటకు వచ్చాయి. అలాగే ఆయనపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఆడియోలు సామాజిక మీడియాలో వైరల్ అయ్యాయి. 2022 జనవరిలో ప్రమోషన్ లిస్ట్‌లో ఉన్న ఐజి లక్ష్మణ్ సస్పెండ్‌కు గురికావడం చర్చనీయాంశంగా మారింది. 1997 బ్యాచ్ కు చెందిన లక్ష్మణ్ నాయక్ స్వస్థలం ఖమ్మ జిల్లా, కాగా సదరు ఐపిఎస్ అధికారి తెలంగాణలో మంత్రి అవుతారని గతంలో ప్రచారం జరగడంతో ఆయన పేరు వ్యాప్తంగా మారుమోగింది.