Monday, December 23, 2024

పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ గమ్యస్థానం

- Advertisement -
- Advertisement -
  • పారిశ్రామిక అభివృద్ధ్దిలో రాష్ట్రంలోనే మేడ్చల్ జిల్లాది ప్రధమ స్థానం
  • జీనోమ్ వ్యాలీ నుండి 160 దేశాలకు 35 శాతం కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పారిశ్రామిక విధానాలతో జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది సంబురాలలో భాగంగా శామీర్‌పేట మండలం తుర్కపల్లిలోని జినోమ్ వ్యాలీలో ఉన్న విమ్టా ల్యాబ్‌లో తెలంగాణ పారిశ్రమిక ప్రగతి ఉత్సవాన్ని నిర్వహించారు.

కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్తా, పారిశ్రామికవేత్తలతో కలిసి పారిశ్రమిక ప్రగతి ఉత్సవాన్ని మంత్రి మల్లారెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానం, మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. అనతి కాలంలోనే చిన్న రాష్ట్రం పెద్ద విజయాన్ని సాధించిందని మంత్రి అన్నారు. పారిశ్రామిక అభివృద్ధ్దిలో మేడ్చల్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జిల్లాలో రూ.10,169 కోట్ల పెట్టుబడులతో టీఎస్ ఐపాస్ కింద 4809 పరిశ్రమలు స్థాపించబడి సుమారు 1.8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారని మంత్రి అన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, సత్వర అనుమతులతో జిల్లాలోని జినోమ్ వ్యాలీలో 200 కంపెనీలు స్థాపించ బడ్డాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాలకు 35 శాతం కరోనా వ్యాక్సిన్ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థల నుండి ఉత్పత్తి కావడం గర్వంగా ఉందని మంత్రి అన్నారు. గతంలో ఫవర్ హాలీడేస్ కారణంగా చిన్న తరహా పరిశ్రమలు వారంలో మూడు రోజుల పని దినాలతో నడిచాయని, నేడు పరిశ్రమలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పారు. టీఎస్ ప్రైడ్‌తో ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలు సహకారం అందిస్తుందని మంత్రి అన్నారు.

అంతకు ముందు జిల్లాలో టీఎస్ ప్రైడ్ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసిన ఎస్సీ పారిశ్రామిక వేత్త అరుణ దాసరి, ఎస్టీ పారిశ్రామిక వేత్త వినోద పరిశ్రమల స్థాపనలో ఎదురైన సంఘటనలు, అనుభవాలను వివరించారు. జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ లిమిటెడ్, విమ్టా ల్యాబ్ సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. జిల్లాలోని పలువురు పారిశ్రామికవేత్తలను మంత్రి, కలెక్టర్ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్ మాధవి, డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లాలోని పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News