Wednesday, January 22, 2025

బాల సాహిత్యంలో తెలంగాణ దేశానికే నమూన

- Advertisement -
- Advertisement -

ఒకే రోజు, ఒకే సమయానికి, ఐదు లక్షల మంది విద్యార్థులు కథలు రాయడం రికార్డు
33 పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు సాహిత్య అకాడమీ అందించడం అభినందనీయం
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణాలో పాఠశాల విద్యార్థులు చిన్నారి చేతులతో రాసిన కథలు నూతన చరిత్రకు శ్రీకారం చుట్టినట్టు ఉందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఒకే రోజు ఒకే సమయానికి ఐదు లక్షల మంది విద్యార్థులు మన ఊరు మన చెట్టు అన్న అంశంపై కథలు రాయడం దేశ చరిత్రలోనే మొట్ట మొదటిది కావడం తెలంగాణ గర్వించదగ్గ విషయమని ఆమె అన్నారు. 33 జిల్లాలకు చెందిన విద్యార్థులు రాసిన కథలను ముప్పై మూడు పుస్తకాలుగా తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించి, విద్యార్థి లోకానికి అందించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ విద్యార్థులు కలం పట్టి తమ ఊరి ప్రకృతిని అద్భుతంగా కథలుగా మలచి దేశానికే మోడల్‌గా నిలిచారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాలలో దేశానికే మోడల్‌గా నిలిచినట్లు తెలంగాణ పాఠశాల విద్యార్థులు కూడా దేశానికి మోడల్‌గా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన మన ఊరు, మన చెట్టు అన్న కథల రచనకు పాఠశాల విద్యాశాఖ చేసిన కృషి తోడై బాలల కథా ప్రపంచలోనే ఒక నూతన ఒరవడి సృష్టించడం జరిగిందని చెప్పారు.

తెలంగాణ అంబేద్కర్ సచివాలయంలో పాఠశాల విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళ వారం తన కార్యాలయంలో మన ఊరు ౠ మన చెట్టు అనే అంశంపై తెలంగాణ సాహిత్య అకాడమీ వెలవరించిన ముప్పై మూడు పుస్తకాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులలో నూతన సృజనలను రగిలించేందుకై తెలంగాణ సాహిత్య అకాడమి చేసిన కృషిని అభినందించారు. విద్యార్థులలో దాగి ఉన్న కొత్త ఆలోచనలకు పురుడుపోసేందుకు, వారిలో ఉన్న సాహిత్య పటిమను వెలుగు చూపేందుకు ఈ కథా రచన ప్రయోగం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ వేదికల ద్వారా, వివిధ సంస్థల ద్వారా బాల సాహిత్యం వెల్లివిరుస్తూ వస్తుందని, తెలంగాణ సాహిత్య అకాడమీ ఒక్కసారిగా ఐదు లక్షల మంది విద్యార్థులను ఒక్కదగ్గరికి తీసుకవచ్చి బాల సాహిత్యానికి పెద్ద పీఠం వేయడం సాహిత్య చరిత్రలోనే మకుటాయమానంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇంత పెద్ద సాహిత్య మహా యజ్ఞాన్ని ప్రోత్సహిస్తూ కృషి చేసిన ఉపాధ్యాయ లోకాన్ని, అందులో పాల్గొన్న విద్యార్థులందరికి ఆమె హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. బాల సాహిత్యంలో నూతన ఒరవడి తెచ్చి లక్షలాది మంది పిల్లల్ని కథా రచన చేసేందుకు దోహదకారిగా నిలిచిన తెలంగాణ సాహిత్య అకాడమీ కృషి చరిత్రలో నిలిచిపోతుందని అభినందించారు. బాల సాహిత్య విస్తృతికి కృషి చేయడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలో పుస్తక ప్రదర్శనలతో జ్ఞాన తెలంగాణ కోసం కృషి చేస్తున్న సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్‌ను ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి శాలువాతో సన్మానించారు.

తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం జరుగుతున్న కృషిని గమనించిన విద్యార్థులు తమ కథల్లో తమ ఊర్లోని పచ్చదనాన్ని కథలుగా మలిచారని తెలిపారు. ఈ బాల కథల రచనల్లో పాల్గొన్న విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప కవులుగా, రచయితలుగా, సామాజిక స్పృహ ఉన్న యోధులుగా పర్యావరణ పరిరక్షకులుగా తమ గ్రామాలల్లో పచ్చదనాన్ని ప్రతిష్టించే పర్యావరణ కార్యకర్తలుగా తయారు కావడానికి ఈ కథా రచన ప్రయోగం ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. ఈ తరం విద్యార్థులు ఎంతో చురుకైన వారని వారిని గొప్ప సమాజ పరిరక్షకులుగా మార్చడానికి సాహిత్యం ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు. ఈ 33 కథల పుస్తకాలను రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అందిస్తామని వెల్లడించారు. అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రసంగిస్తూ సాహిత్య అకాడమి చేసిన ఆలోచనకు కార్య రూపం ఇచ్చి బాల సాహిత్య కథా యజ్ఞంలో రాష్ట్రంలోని పాఠశాలలన్నీ పాల్గొనే విధంగా కృషి చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బాల సాహిత్య కథా రచయితలు, పాఠశాల విద్యా శాఖా అధికార బృందం కృషి మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి బాలాచారి నామోజు, తెలంగాణ విద్యా మౌళిక వసతుల సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, ప్రొ. నారా కిషోర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు డి. శ్రీపాల్ రెడ్డి, బి. కమలాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News