Monday, December 23, 2024

సంక్షేమంతోనే..

- Advertisement -
- Advertisement -

Telangana is a role model in the budget

కొనుగోలు శక్తి పెరిగితేనే బడ్జెట్ పెరిగేది
భారీగా పెరిగిన ఆర్థికరంగ కార్యకలాపాలు బడ్జెట్‌లోనూ తెలంగాణే రోల్ మోడల్

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనకు అనుసరిస్తున్న విధానాలు, నిర్దేశించుకొన్న ఫార్ములా విజయవంతం కావడంతో మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ విధానాలను అధ్యయనం చేస్తున్నాయి. ప్రజా సంక్షేమ పథకాలు, నగదు బదిలీ పథకాలతో రాష్ట్రంలో ఎకనమిక్ యాక్టివిటి (ఆర్ధిక కార్యకలాపాలు) భారీగా పెరగడంతోనే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయల మార్కును దాటిందని ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు సంబరపడిపోతున్నారు. కేవలం అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ప్రజా సంక్షేమ పథకాలు కూడా ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతాయని, తద్వారా కూడా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుందనే ఆర్ధిక సూత్రాన్ని బలంగా నమ్మి ఆచరించడంతోనే భారీ బడ్జెట్‌లను రూపొందించడానికి ఆస్కారమేర్పడిందని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, గ్రామీణాభివృద్ధి పథకాలు, విద్యుత్తు ప్రాజెక్టులు, మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు, ఇతరత్రా అభివృద్ధి పనులే కాకుండా సంక్షేమ రంగంలోని రైతుబంధు, దళిత బంధు, వ్యవసాయ రుణాల మాఫీ, గొర్రెల పంపిణీ, చేపల చెరువులు, ట్రాక్టర్లు పంపిణీ, డబుల్ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణాలు, కళ్యాణలక్షీ, షాదీ ముబారక్, వృద్ధాప్య పెన్షన్లు వంటి అనేక పథకాలతో ప్రజలకు డబ్బు ఇబ్బడి ముబ్బడిగా చేరుతోందని వివరించారు.

ఇలా ప్రజలకు రకరకాల సంక్షేమ పథకాలతో చేరుతున్న నగదు, పనిదినాల్లో సంపాదించిన డబ్బులతో ప్రతి కుటుంబంలోనూ కొనుగోలు శక్తి పెరగడమే కాకుండా పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలు జరుగుతుండటం, అనేక రకాల వేడుకలు వంటి ఎన్నో కార్యకలాపాలతో ఒక ఎకనమిక్ యాక్టివిటీ జరుగుతోందని, ఈ ఆర్ధిక కార్యకలాపాల మూలంగా ప్రజలు ఖర్చు చేసే ప్రతి వస్తువు నుంచి 30 శాతం నిధులు రకరకాల పన్నుల రూపంలో తిరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే ఆదాయం వస్తుందనే ఆర్ధిక సూత్రాన్ని పాటిస్తున్నామని, అదే విజయతీరాలకు చేరుస్తోందని ఆ అధికారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ఒక లక్షా 12 వేల 077 చదరపు కిలోమీటర్లు ఉందని, జనాభా సుమారు 4.25 కోట్ల మంది ఉంటారని, దేశంలోని ఎన్నో పెద్ద రాష్ట్రాల కంటే చిన్నదైన తెలంగాణ రాష్ట్రంలో 2022-23వ ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ సుమారు 2.60 లక్షల కోట్ల రూపాయల వరకూ ఉండవచ్చునని ఆ అధికారులు ధీమాగా చెబుతున్నారు.

వైశాల్యంలో 8వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం పెద్ద రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ నిధులతో ప్రవేశపెట్టడానికి కారణం తాము అనుసరిస్తున్న ఆర్ధిక నిర్వహణ, ఆర్ధిక క్రమశిక్షణ, ప్రజలందరి కొనుగోలు శక్తిని పెంచడం, ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయకుండా ఉన్న నిధులతోనే సర్దుకుపోతూ నిబద్దతను పాటించడం మూలంగానే బడ్జెట్ స్వరూపాన్ని భారీగా పెంచుకొగలిగామని ఆ అధికారులు అంటున్నారు. ప్రజలపై అదనంగా ఎలాంటి పన్నులు భారాన్ని మోపకుండా, ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం ప్రకారం సుమారు 45,510 కోట్ల రూపాయల వరకూ రుణాలను సేకరించే అవకాశం ఉందని వివరించారు. ఇక నిరర్ధక ఆస్తుల విక్రయంలో భాగంగా ప్లాట్ల వేలం వేసి అదనంగా మరో 20 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాబట్టుకోవాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకొంది. వేలం రూపంలో ఇప్పటికే అయిదు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని,వచ్చే ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకొన్న లక్షాల మేరకు ఆదాయాన్ని రాబట్టుకొంటామని ఆ అధికారులు ధీమాగా చెబుతున్నారు.

అంతేగాక రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగాం నుంచి వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 15 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుండవచ్చునని ఆర్ధికశాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాధమికంగా వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 2.60 లక్షల కోట్ల రూపాయల వరకూ బడ్జెట్ ఉండవచ్చునని భావిస్తున్నామని, తమ అంచనాలు వాస్తవ రూపం దాలిస్తే బడ్జెట్ రికార్డుస్థాయిలో 2.75 లక్షల కోట్ల రూపాయల వరకూ పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని వివరించారు. దేశంలో భారీగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో జమ్ము-కాశ్మీర్ రాష్ట్రం 48 శాతం అప్పులతో అగ్రస్థానంలో ఉండగా కేవలం 16 శాతం అప్పులతో తెలంగాణ రాష్ట్రం 27వ స్థానంలో ఉంది. అంటే అతి తక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచస్థాయి ఆర్ధిక సంస్థలు, బహుళజాతి కంపెనీలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News