Monday, December 23, 2024

వందశాతం ఇంటింటికీ మంచినీరు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : 80 శాతం రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 2 నుంచి 22 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం విధితమే. మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ గ్రామీణ మండలం మన్యంకొండలో మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిర్వహించిన మంచినీళ్ల పండుగ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తాగునీటి కోసం మహిళ కిలో మీటర్ల దూరం నడిచి బిందె మీద బిందె పెట్టుకొని తెచ్చుకున్న పరిస్థితులు ఉండేవని, అప్పుడు నీటిని ఏ విధంగా నీటిని వినియోగించుకున్నామో ఇప్పుడు అదే విధంగా వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధ్దికి గుర్తుగా తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాలను చేసుకుంటున్నామని, ముఖ్యంగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టారని, ఇది ఏ రాష్ట్రంలో లేదని, ఇది దేశం యావత్తు ప్రశంసిస్తున్న పథకం అని అన్నారు.

అన్ని నీటి శుద్ది కేంద్రాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా మంచినీళ్ల పండుగ నిర్వహించడం జరుగుతున్నదని, ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు, ప్రజల మిషన్ భగీరథ మంచినీటిని ఇంటింటికి ఇవ్వడానికి పడుతున్న శ్రమను, ఖర్చును, పద్దతులపై అవగాహన కల్పించాలని కోరారు. మిషన్ భగీరథ తాగునీరు మినరల్ వాటర్ కన్నా గొప్పదని, ఎన్నో మినరల్స్ ఈ నీటిలో ఉన్నాయని, కృత్రిమంగా దేవుడిచ్చిన వరప్రసాదంగా వచ్చిన ఈ నీరు ఎంతో శ్రేష్టమని, ప్రతి ఒక్కరు మిషన్ భగీరథ తాగునీటిని వాడాలని కోరారు.

మిషన్ భగీరథ తాగునీటిని శుద్ది చేసేందుకు ఎంతో మంది ఇంజనీరింగ్ అధికారులు , సిబ్బంది శ్రమిస్తున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్ పట్టణంలో గతంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని ఇప్పుడు ప్రతి రోజు వస్తున్నదని అలా అని నీటిని వృధా చేయవద్దని, సద్వినియోగం చేసుకోవాలని ఎక్కడైనా కొళాయిలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇప్పుడు ప్రతి రోజు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు పొందుతున్నారని అన్నారు. మంచినీళ్ల పండుగ సందర్భంగా నీటి శుద్ది కేంద్రాల వద్ద తాగునీరు ఎలా వస్తుందో ఎలా శుద్ది చేస్తారో ఇంజనీరింగ్ అధికారులు తెలియజేస్తారని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 826 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించడం జరుగుతున్నదని, దీనికి గుర్తుగా ఓహెచ్‌ఎస్‌ఆర్ నుండి గ్రామంలోకి ర్యాలీగా వచ్చి అక్కడ సమావేశాన్ని నిర్వహించుకొని ప్రతి రోజు తాగునీరు ఇస్తున్న వాటర్‌మెన్‌లకు సత్కారం చేయడంతో పాటు, రాష్ట్ర రాజధానిలో సైతం మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్‌గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, మున్సిపల్ చైర్మన్ ఏసి నర్సిములు, మిషన్ భగీరథ సిఈ చెన్నారెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాస్, ఈఈలు వెంకటరెడ్డి, పుల్లారెడ్డి, తహసీల్దార్ పాండు , ఇతర అధికారులు, డిపిఓ వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News