Saturday, December 28, 2024

దేశంలో ఆకలి దారిద్య్రాలు లేని రాష్ట్రం తెలంగాణ

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : దేశంలో ఆకలి దారిద్య్రాలు లేని రాష్ట్రం తెలంగాణ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏడవ వార్డు ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2లో బిజేపి మాజీ పట్టణ అధ్యక్షుడు కొండేటి ఏడుకొండలు బిజేపికి రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి, దేశానికి శ్రీరామ రక్ష అన్నారు. దేశ వ్యాప్తంగా 30శాతం మంది ప్రజలు ఒక్క పూట భోజనం మాత్రమే తింటూ మిగతాపూట పస్తులు ఉంటే, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆకలి దారిద్య్రాలను లేకుండా చేసిందన్నారు. దేశంలో నేటికి రెండు పూటల తిండి తింటున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.

దేశంలో ఇంటింటికి 24 గంటల కరెంటు, త్రాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బిజేపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ చాలా గ్రామాల్లో కరెంటు లైన్‌లు కూడా లేవన్నారు. దేశ వ్యాప్తంగా అత్యధికంగా 45లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో సైతం 40వేల మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. సూర్యాపేటలో 2014కు ముందు వేసిన ఓటు ద్వారా ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్న మంత్రి, 2014లో కారు గుర్తుకు వేసిన ఓటు సూర్యాపేట ప్రజలను మూసి మురికి నుండి విముక్తి కల్పించిందన్నారు.

మెడికల్ కళాశాల, మినీ ట్యాంక్‌బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు వేసిన ఓటు ద్వారానే వచ్చాయన్నారు. ప్రతి ఇంట్లో తల్లి, అత్తా చేయని పనిని ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, అమ్మవడి వంటి పథకాలతో మేనమామలా కేసీఆర్ చేస్తుండన్నారు. సూర్యాపేటను నెంబర్ వన్ సుందరమైన పట్టణంగా చేసుకుందామన్న మంత్రి, అభివృద్ధిలో భాగస్వామ్యమై బీఆర్‌ఎస్‌లో చేరిన ఏడుకొండలు, మహిళా మోర్చా నాయకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. గులాబీ కండువా కప్పి సాదరంగా బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు గౌడ్, కౌన్సిలర్లు భరత్ మహాజన్, బత్తుల జానీ, రాపర్తి శ్రీనివాస్, కడారి సతీష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News