Monday, December 23, 2024

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం ఆయన. తెలంగాణ కోసం నెహ్రుతో సైతం ఢీకొనడానికి వెనుకాడనని ప్రాంతీయ అభిమాని. పదవీ త్యాగానికి వెన్నుచూపని త్యాగశీలి. చేయాలను కున్నది ఎన్ని అడ్డంకులెదురైనా చేసిన ధీశాలి. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు సైతం వెళ్ళిన పోరాట యోధుడు. 1950లోనే ఆయన తెలంగాణ వాదం వినిపించారు. నిజాం పాలన, ఆ తర్వాత మిలిటరీ గవర్నర్ పాలన, వెల్లోడి పాలనలో మహారాష్ట్రులదే పైచేయి ఉండడాన్ని ఆయన నిరసించారు. దీన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో ఒక బహిరంగ సభ కూడాపెట్టారు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బూర్గులను నిలిపి గెలిపించింది కూడా ఆయనే.

ఆయనే కొండా వెంకట రంగారెడ్డి. ఆంధ్రప్రదేశ్ మంత్రి గా, ఉప ముఖ్యమంత్రిగా, ప్రముఖ న్యాయవాదిగా, పలు సంస్థల వ్యవస్థాపకుడుగా ఆయన బహుముఖ సేవలు అందించిన నేతగా చరిత్రలో నిలిచిపోయారు. కొండా వెంకట రంగారెడ్డి (డిసెంబరు 12, 1890 జులై 24, 1970)స్వాతంత్య్ర సమరయోధుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకులు. ఆయన పేరు మీదనే రంగారెడ్డి జిల్లాకు ఆ పేరు వచ్చింది. రంగారెడ్డి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాదు మండ లం, పెద్ద మంగళారం గ్రామంలో 1890, డిసెంబరు 12 న జన్మించారు. 1959 నుండి 1962 వరకు దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. రంగారెడ్డి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో కూడా మంత్రి పదవి నిర్వహించారు.

ఆయన నైజాం శాసన సభలో, హైదరాబాదు రాష్ట్ర శాసన సభలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ప్రాతినిధ్యం వహించారు. 1936లో ఆయన శాసన సభకు ఎన్నిక కావడంతో ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగింది. సభలో 24 శాసనాలను, కొన్ని సవరణలు ప్రవేశపెట్టారు. అందులో స్త్రీలకు వారసత్వపు హక్కు కలుగజేయడం, వర్ణాంతర వివాహం చేసుకుంటే వారి సంతానం సక్రమ సంతానమని నిరూపణ, బాల్య వివాహ వ్యవస్థ నిర్మూలన, అస్పృశ్యత నివారణ, జాగీర్ల రద్దు, ఉద్యోగాల నియామకానికి పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటును తన రెండేళ్ల పదవీ కాలంలో చేయగలిగారు. కెవి రంగారెడ్డి పూర్తి పేరు కొండా వెంకట రంగారెడ్డి. కెవి రంగారెడ్డి మనసు ఎప్పుడూ అనాదరణకు గురైన స్త్రీల దుర్గతి పైన, దళితుల, పేదల ఆర్థిక దుస్థితి పైన ఉండేది.

దీన్ని ఎలాగైనా రూపు మాపాలని అనుకునేవారు. స్త్రీ తన భర్త చనిపోగానే ఎలాంటి ఆస్తి లేకుండా నిరాదరణకు గురయ్యేది. అలాగే నిమ్నజాతుల వారు కూడా నిరాదరణకు గురయ్యేవారు. జాగీరుదారులకు, పేద రైతులక మధ్య వివాదాలు వచ్చినపుడు పేదలపక్షాన నిలిచేవారు. పేదల పక్షాన ఉచితంగా వాదించేవారు. రంగారెడ్డి ఆంధ్ర మహాసభ కార్య క్రమాలలో చురుకుగా పాల్గొని మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఐదవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. హైదరాబాద్‌లో అనేక సాంఘిక, సాంస్కృతిక సేవా సంస్థల ఆవిర్భావంలో ప్రధాన పాత్ర పోషించారు. 1940 వరకు జిల్లా కోర్టు, హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు.

1943లో జరిగిన ఏడవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. అంతేకాదు సాహిత్యా భివృద్ధి కోసం 1943లో ఆవిర్భవించిన ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం, శ్రీవేమన భాషా నిలయం స్థాపనకు తోడ్పడ్డారు. హిందీ ప్రచార సభకు, గోలకొండ పత్రికకు, రయ్యత్ పత్రికకు చేయూత నందించారు. నిజాం సంస్థానం భారత్‌లో విలీనం అయిన తర్వాత బూర్గుల మంత్రి వర్గంలో రెవెన్యూ, ఎక్సైజ్, కస్టమ్స్ శాఖలను నిర్వహించారు. నాటి ముఖ్యమంత్రి బూర్గులను ఏ కారణం లేకుండానే ముఖ్య మంత్రిగా రాజీనామా చేయాలని కోరినపుడు ఆ నిర్ణయాన్ని కెవి తీవ్రంగా వ్యతిరేకించారు.

అంతేకాకుండా మేం మళ్లీ బూర్గులనే సిఎంగా ఎన్నుకుంటే మీరేం చేస్తారని నిలదీసిన ధీరుడు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో హోం శాఖ, రెవెన్యూ శాఖలను నిర్వహించారు. 1960లో నీలం సంజీవరెడ్డి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెళ్లగా ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని దామోదరం సంజీవయ్యను వరించింది. ఆయన కాలంలో రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన మర్రి చెన్నారెడ్డి ఆయన మేనల్లుడు. ఏనాడు ఏ విషయంలోనూ రాజీపడని మనస్తత్వం కొండాది.

సంస్థానంలో మహారాష్ట్రులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను పెట్టినా, తెలంగాణ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రిని ఎంపిక చేయించినా, విశాలాంధ్రకు వ్యతిరేకత వ్యక్తం చేసినా అన్నీ సదరు అదరక బెదరక చేసేవారు. చాలా వరకు పేదలకు ఉచితంగా పనులు చేసి పెట్టేవారు. విద్యార్థి దశలో తాను ఎదుర్కొన్న కష్టాలను పేద విద్యార్థు లెవరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో రెడ్డి హాస్టల్ కట్టించారు. బాలుర పాఠశాల, ఆంధ్ర సరస్వతి, బాలికల పాఠశాల, రెడ్డి బాలికల హాస్టల్, ఆంధ్ర విద్యాలయం మొదలైన వాటిని కట్టించారు. 1970, జులై 24న రంగారెడ్డి మరణించారు. ఆయన స్మృత్యర్ధం 1978, ఆగస్టు 15న హైదరాబాదు జిల్లాను విభజించి నూతనంగా ఏర్పడిన జిల్లాకు రంగారెడ్డి జిల్లా అని పేరుపెట్టారు.

రామకిష్టయ్య సంగన భట్ల
9440595494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News