నాగర్‌కర్నూల్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్ల స్వల్ప కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని ప్రభుత విప్, అచ్చంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ప్రభుత్వ విప్, అచ్చంపేట శాసన సభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం అమరుల స్తూపం వద్ద నివాళులర్పించి అమరవీరులకు పుష్పాంజలి ఘటించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని అన్నారు. తెలంగాణలో ప్రజలకు మెరుగైన పాలన కోసం పరిపాలన సంస్కరణలతో ఏర్పాటైన కొత్త జిల్లాలు, మండలాలతో పరిపాలన సౌలభ్యం ప్రజల చెంతకు చేరిందని అన్నారు. గతంలో చెరువులు ఎండిపోయి ఉండేవని, ఇప్పుడు మండుటెండల్లోనూ నిండుగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి కోసం యుద్దాలు జరిగేవని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు.
తెలంగాణ ప్రజల హృదయాలు ఆనందం, గర్వంతో నింపుకున్న సందర్భమని అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది త్యాగలు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం అమరవీరులకు, వారి అంకిత భావానికి హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల కోటి ఆశలు కొత్త చిగుర్లు తొడిగిన రోజు జూన్ 2 అని తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైన రోజు తెలంగాణ ఆవిర్భవించి పదవ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ అమరుల నెత్తుటి త్యాగాలు స్మరించుకుంటూ దశాబ్ది వేడుకలకు సర్వ సన్నాహాలు చేసిందన్నారు.
ముఖ్యమంత్రి సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్ల స్వల్ప కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందన్నారు. ప్రజా సంక్షేమంలో, అభివృద్ధిలో యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుకరిస్తుందని చెప్పుకునే స్థాయికి చేరుకుందని ఇది తెలంగాణ ప్రజలకు గర్వ కారణమని ఆయన అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాను అభివద్ధి పథంలో ఉంచడానికి పనిచేస్తున్న జిల్లా యంత్రాంగానిరి, మంత్రి వర్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసన సభ్యులకు, శాసనమండలి సభ్యులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.
జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు. నూతన కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ భవనాన్ని ఈ నెల 6వ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, ఎస్పి కె. మనోహర్‌లతో కలిసి స్టాల్స్‌ను ఆయన సందర్శించారు.
అంతకు ముందు తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. విద్రార్థును అభినందించి ఙ్ఞపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శాంత కుమారి, నాగర్‌కర్నూల్ శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు మను చౌదరి, మోతిలాల్, అదనపు ఎస్పిలు భరత్, రామేశ్వర్, ఆర్డిఓ నాగలక్ష్మి, డిఎస్పి మోహన్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.