Monday, December 23, 2024

దేశానికే తెలంగాణ ఆదర్శం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం అద్భుతమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభలో 2022-23 సంవత్సరానికి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో అమలు చేసిన ప్రతి పథకాన్ని దేశంలో అమలు చేస్తున్నారన్నారు. దీంతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నామని, నేడు ఆకలి చావులు, కరెంట్ కోతలు లేవన్నారు. తెలంగాణకు అదనపు నిధులు ఇవ్వమంటే మోడీ ప్రభుత్వం ఇవ్వటం లేదని మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం మాటతప్పిందని హరీష్ రావు విరుచుకపడ్డారు. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం పట్టించుకోవడంలేదని, తెలంగాణకు ఇచ్చే గ్రాంట్లు 2 వేల 362 కేంద్రం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరి కాళ్లలో కట్టెపెట్టేలా ఉందని, ఫెడరల్ స్ఫూర్తికి బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు.

ఎఫ్‌ఆర్‌బిఎం పేరుతో రాష్ట్రాల మెడపై కేంద్రం కత్తి పెట్టిందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం నిరంకుశ వైఖరి మానుకోవాలని హెచ్చరించారు. కంఠంలో ప్రాణముండగా విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోమన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్‌కు కూడా కేంద్ర జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. బావిల దగ్గర మోటర్లకు మీటర్లు పెట్టబోమని, తెలంగాణ పథకాలకు కేంద్ర డబ్బులు ఇవ్వడంలేని మండిపడ్డారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన డబ్బును సెస్సుల రూపంలో దొడ్డిదారిన వసూలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెలంగాణపై దాడి జరుగుతోందని, తెలంగాణపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని అడిగితే 24 రూపాయలు ఇవ్వలేదని మండిపడ్డారు. జహీరాబాద్‌లో నిమ్స్‌కు కేంద్రం రూ.500 కోట్లు ఇంకా ఎందుకు ఇవ్వడంలేదని అడిగారు. కరోనా సమయంలోనూ కేంద్రం అదనంగా రూపాయి ఇవ్వలేదని, కేంద్రం తీరుతో తెలంగాణ ప్రతీ సంవత్సరం రూ.5 వేల కోట్లు నష్టపోతుందని, ఈ లెక్కన ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు నష్టపోతున్నామన్నారు.

మొత్తం బడ్జెట్ రూ.2 లక్షల 56 వేల 958 కోట్లుగా ఉందని, దేశ జిడిపి వృద్ధి రేటు 8.9 శాతంగా ఉంటే తెలంగాణ వృద్ధి రేటు 19.4 శాతంగా ఉందన్నారు. సేవల రంగం 18.3 శాతంగా వృద్ధి సాధించిందని, తెలంగాణ తలసరి ఆదాయం 2 లక్షల 78 వేల 833కు చేరిందన్నారు. తలసరి ఆదాయం వృద్ధిలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ స్థిరమైన వృద్ధి రేటు సాధిస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News