మూలధనం వ్యయంలో దేశంలోనే తెలంగాణ ఫస్ట్
అభివృద్ధి పథకాలకు చేసే పెట్టుబడి ఖర్చులో టాప్ టెన్‌లో నం.1గా నిలిచిన రాష్ట్రం, కరోనా కష్టకాలం నుంచి ఆర్థిక క్రమశిక్షణతో వేగంగా కోలుకున్న గడ్డ : కాగ్ నివేదిక వెల్లడి
మన తెలంగాణ/ హైదరాబాద్ : అభివృద్ధి పథకాలకు ఖర్చు చేసే కేపిటల్ వ్యయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2021-22వ ఆర్ధిక సంవత్సరానికి జరిగిన మూలధన వ్యయంలో తెలంగాణ రాష్ట్రం 51.9 శాతం నిధులను ఖర్చు చేసి దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 47.7 శాతం నిధులను ఖర్చు చేసిన కేరళ రాష్ట్రం రెండో స్థానంలో నిలవగా 46.2 శాతం నిధులను ఖర్చు చేసిన మధ్య ప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. కరోనా కష్టకాలంలో దేశాలు, రాష్ట్రాలకు రాష్ట్రాలే ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోగా ఒక్క తెలంగాణ రాష్ట్రమే వేగంగా, త్వరితగతిన కోలుకుందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సి.ఏ.జి) నివేదిక స్పష్టంచేసింది. అభివృధ్ధి పథకాలకు ఖర్చు చేసే కేపిటల్ వ్యయంలో టాప్ టెన్ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్రమోడి సొంత రాష్ట్రమైన గుజరాత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. కరోనా లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి గత మేనెల వరకూ రికార్డుస్తాయిలో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఏకంగా 50 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది.
అయినప్పటికీ సమర్ధవంతమైన పరిపాలనా విధానాలతో, ఆర్దిక క్రమశిక్షణను పాటించి, పన్నుల వసూళ్ళలో ఎక్కడా లోపాల్లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, జీ.ఎస్.టి. వసూళ్ళల్లోనూ రికార్డు సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా ఆర్ధిక సమస్యల నుంచి కోలుకున్నదని కాగ్ నివేదించింది. అందుకే అభివృధ్ధి పథకాలకు కూడా 2021-22వ ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్‌లో కేటాయించిన కేపిటల్ వ్యయంలో నిర్ధిష్ట కాలపరిమితిలోగా 51.9 శాతం నిధులను ఖర్చు చేయగలిగిందని కాగ్ నివేదికలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం 2021-22వ ఆర్ధిక సంవత్సరంలో అభివృధ్ధి పథకాలకు కేపిటల్ వ్యయం కింద సుమారు 29 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించింది. నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్తు రంగానికి, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, వ్యవసాయ రంగాలకు ఈ నిధులను ఖర్చు చేయడంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయకుండా కేటాయించిన నిధులను ఖర్చు చేస్తూ వచ్చింది.
ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రజలపై ఎలాంటి అదనపు పన్నుల భారాన్ని మోపకుండా, రొటీన్‌గా వచ్చే ఆర్ధిక వనరుల్లో ఎక్కడా లోపాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకొంటూ ఆర్ధిక క్రమశిక్షణను పాటించడం మూలంగానే ప్రజలకు, ప్రభుత్వానికి, ఉద్యోగులు జీతభత్యాలకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా సమతూకంతో తెలంగాణలో ప్రభుత్వ పాలన సాగుతోందని, అందుకే 51.9శాతం కేపిటల్ వ్యయాన్ని చేరుకోగలిగిందని కాగ్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది.